నాన్న.. 'ఉంగ తలా సూపర్‌'

19 Feb, 2021 17:15 IST|Sakshi

ముంబై: టీమిండియా టెస్టు స్పెషలిస్ట్‌గా ముద్రపడిన చతేశ్వర్‌ పుజారా ఎట్టకేలకు ఏడేళ్ల తర్వాత ఐపీఎల్‌లో అడుగుపెట్టనున్నాడు. గురువారం జరిగిన ఐపీఎల్‌ 2021 మినీ వేలంలో పుజారాను చెన్నై సూపర్‌కింగ్స్‌ కనీస మద్దతు ధర రూ.50 లక్షలకు దక్కించుకుంది.ఐపీఎల్‌లో ఆడాలని తనకు ఉంటుందని.. కానీ తనను గతంలో జరిగిన వేలంలో కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదని ఆసీస్‌ పర్యటన అనంతరం పుజారా ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ధోని నాయకత్వంలోని సీఎస్‌కే అతని బాధను అర్థం చేసుకుందో లేక అతనికున్న అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే వేలంలో కొనుగోలు చేసింది.

ఈ సందర్భంగా పుజారాకు వెల్‌కమ్‌ చెబుతూ అతని సంతోషాన్ని వీడియో రూపంలో పంచుకుంది. ఆ వీడియోలో పుజారా మహీబాయ్‌ సారధ్యంలో ఆడేందుకు మళ్లీ అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది అని పేర్కొన్నాడు. పుజారా మాట్లాడుతున్న సమయంలో అతని కూతురు 'ఉంగ తలా సుపరూ'( మీ బాస్‌ సూపర్‌) అంటూ ధోనినుద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వేలంలో సీఎస్‌కే కొనుగోలు అనంతరం పుజారా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

'ఐపీఎల్‌కు తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎల్లో జెర్సీలో బరిలోకి దిగడంతో పాటు మహీ బాయ్‌ సారధ్యంలో మళ్లీ ఆడుతుండడం కొత్తగా ఉంది. ఇంతకముందు నేను అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం సమయంలో ధోనినే కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ సమయంలో టెస్టు క్రికెట్‌లో కీలకమైన 3వ స్థానంలో నన్ను ఆడమని ప్రోత్సహించాడు. అతని కారణంగా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. మళ్లీ ఏడేళ్ల విరామం తర్వాత ధోని సారధ్యంలోనే సీఎస్‌కేకు ప్రాతినిధ్యం వహించడం ఆనందాన్ని కలిగిస్తుంది.

మహీ నాయకత్వంలో ఆడేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నా. ఇక ఈసారి ఐపీఎల్‌లో నా గేర్‌ను మార్చనున్నా.. అది ఎలా ఉంటుందనేది మీరు ఐపీఎల్‌లో చూస్తారు..అప్పటివరకు వేచి చూడండి.ఇప్పటికైతే నేను సెలెక్ట్‌ అయినందుకు విజిల్‌ పోడూ.. ఐపీఎల్‌ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నా'అంటూ చెప్పుకొచ్చాడు. కాగా పుజారా 2014లో కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌( ప్రస్తుతం పంజాబ్‌ కింగ్స్‌)తరపున చివరిసారి ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడాడు.
చదవండి: ఐపీఎల్‌లో‌ ఆడేందుకు సిద్ధం: పుజారా
కేదార్‌ జాదవ్‌ని పెట్టుకొని ఏం చేస్తారు!

మరిన్ని వార్తలు