పాపం పుజారా.. ఎంత పని జరిగిపోయింది

16 Feb, 2021 08:20 IST|Sakshi

చెన్నై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో చతేశ్వర్‌ పుజారా రెండో ఇన్నింగ్స్‌లో రనౌట్‌ అయిన సంగతి తెలిసిందే. అతను రనౌట్‌ అయిన తీరు మాత్రం దురదృష్టకరం అని చెప్పొచ్చు.  టీమిండియా ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన స్పిన్నర్ మొయిన్ అలీ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చిన పుజారా బంతిని హిట్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ అనూహ్యంగా టర్న్ అయిన బంతి అతని బ్యాట్‌కి కాకుండా ఫ్యాడ్‌ను తాకి షార్ట్ లెగ్‌లోని ఫీల్డర్ ఓలీ పోప్ చేతుల్లో పడింది. అప్పటికే పుజారా క్రీజులో లేకపోవడంతో ఓలీ పోప్‌ బంతిని కీపర్ బెన్ ఫోక్స్‌కి త్రో చేశాడు.

రనౌట్ అవకాశముందని ఊహించిన పుజారా క్రీజులో బ్యాట్‌ని ఉంచేందుకు ప్రయత్నించాడు. కానీ బ్యాట్ క్రీజు లైన్‌పైనే చిక్కుకోవడం.. అదే సమయంలో అతని చేతి నుంచి బ్యాట్ కూడా జారిపోయింది. అయితే ఆఖరి క్షణంలో తన పాదాన్ని ఉంచేందుకు పుజారా ప్రయత్నించగా అప్పటికే ఫోక్స్‌ బంతితో బెయిల్స్‌ను కిందపడేశాడు. దీంతో పుజారా రనౌట్‌ అయినట్లు ప్రకటించడంతో నిరాశగా పెవిలియన్‌ చేరుకున్నాడు. పుజారా రనౌట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా రెండో ఇన్నింగ్స్‌లో 7 పరుగులు చేసిన పుజారా మొదటి ఇన్నింగ్స్‌లో 21 పరుగులు చేశాడు.

ఇక టీమిండియా రెండో టెస్టులో విజయం దిశగా సాగుతుంది. 482 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ జట్టు 3 వికెట్లు నష్టపోయి 53 పరుగులు చేసింది. లారెన్స్‌ 12, రూట్‌ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైంది. రవిచంద్రన్‌ అశ్విన్‌ (148 బంతుల్లో 106; 14 ఫోర్లు, 1 సిక్స్‌) కెరీర్‌లో ఐదో సెంచరీ చేయగా, కోహ్లి (149 బంతుల్లో 62; 7 ఫోర్లు) రాణించాడు.
చదవండి: చెన్నపట్నం చిన్నోడు...
నైట్‌వాచ్‌మన్‌గా వచ్చి..గోల్డెన్‌ డక్‌

మరిన్ని వార్తలు