IPL 2022: చెన్నై సూపర్‌ కింగ్స్‌లోకి శ్రీశాంత్‌...!

4 Mar, 2022 14:57 IST|Sakshi

ఐపీఎల్-2022కు గాయం కారణంగా చెన్నై సూపర్‌ కింగ్స్ స్టార్‌ బౌలర్‌ దీపక్‌ చాహర్‌ దూరమైన సంగతి తెలిసిందే. ఈక్రమంలో చాహర్‌ స్ధానాన్ని భర్తీ చేసేందుకు సీఎస్కే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎస్కేకు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. టీమిండియా వెటరన్‌ పేసర్‌ శ్రీశాంత్‌తో చాహర్‌ స్థానాన్ని భర్తీ చేయాలని చెన్నై భావిస్తోంది అన్నది ఆ వార్త సారాంశం. కాగా రూ.50 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన  ఏ ఫ్రాంచైజీ  కూడా కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూపలేదు. దీంతో అమ్ముడుపోని ఆటగాడిగా శ్రీశాంత్‌  మిగిలిపోయాడు. ఇక 2013లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన శ్రీశాంత్‌పై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. దీంతో బీసీసీఐ అతడిపై జీవిత కాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ శ్రీశాంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

సుప్రీంకోర్టు స్పందిస్తూ.. శిక్ష కాలాన్ని త‌గ్గించ‌మ‌ని బీసీసీఐను ఆదేశించింది. దీంతో బీసీసీఐ అత‌డిపై నిషేధాన్ని ఏడు ఏళ్లకు కుదించింది. దీంతో 13 సెప్టెంబర్ 2020 నుంచి అత‌డిపై నిషేధం ఎత్తివేయ‌బ‌డింది. అనంతరం సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ, విజయహాజారే టోర్నీ, రంజీ ట్రోఫీల్లో కేరళ తరపున శ్రీశాంత్‌ ఆడుతున్నాడు.  రంజీట్రోఫీలో భాగంగా  మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో 40 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు సాధించాడు. అంతే కాకుండా తన పేస్‌ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ఇబ్బంది పెట్టే స్కిల్స్‌ శ్రీశాంత్‌కు ఉన్నాయి. అదే విధంగా పవర్‌ప్లేలో కూడా బౌలింగ్‌ చేసే సత్తా శ్రీశాంత్‌కు ఉంది.  ఈ కారణాలతోనే చెన్నై  శ్రీశాంత్‌పై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

చదవండి: IND vs SL: విరాట్‌ కోహ్లి అరుదైన రికార్డు.. ప్రపంచంలో రెండో ఆటగాడిగా!

మరిన్ని వార్తలు