సందడి షురూ...

22 Aug, 2020 03:05 IST|Sakshi

యూఏఈలో మరో మూడు జట్లు  

దుబాయ్‌: అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)– 2020కి రంగం సిద్ధమవుతోంది. సెప్టెంబర్‌ 19నుంచి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లోని మూడు వేదికల్లో లీగ్‌ జరగనుండగా... సుమారు నెల రోజుల ముందుగానే జట్లు అక్కడికి చేరుకుంటున్నాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్, ధోని సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్, భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్లు శుక్రవారం యూఏఈ గడ్డపై అడుగు పెట్టాయి. మరో రెండు టీమ్‌లు సన్‌రైజర్స్‌ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్‌ మాత్రమే అక్కడికి వెళ్లాల్సి ఉంది. నిబంధనల ప్రకారం ఆరు రోజుల వరకు అందరికీ క్వారంటీన్‌ తప్పనిసరి. ఈ సమయంలో ఒక్కొక్కరికి కనీసం మూడు సార్లు కరోనా పరీక్షలు నిర్వహి స్తారు. ఆ తర్వాతేనుంచి ఆటగాళ్ల ప్రాక్టీస్, లీగ్‌ వార్తలు క్రికెట్‌ ఫ్యాన్స్‌ను అలరించనున్నాయి.  
మలింగ మరింత ఆలస్యంగా...
శ్రీలంక స్పీడ్‌స్టర్, ముంబై ఇండియన్స్‌ ప్రధాన పేసర్‌ లసిత్‌ మలింగ కూడా ఆలస్యంగానే యూఏఈ వెళ్లనున్నాడు. దీంతో తొలి దశ మ్యాచ్‌లకు అతను జట్టుకు అందుబాటులో ఉండడు. కుటుంబ కారణాల వల్లే లంక ఆటగాడు కాస్తా ఆలస్యంగా ఐపీఎల్‌ ఆడనున్నాడు. ఈ పేసర్‌ తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు త్వరలోనే సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఉండటంతో మలింగ తండ్రి వెంటే ఉండాలనుకుంటున్నాడు. దీంతో సగం మ్యాచ్‌లు అయ్యాకే అక్కడికి వెళ్లే అవకాశముంది. గతేడాది మలింగ మలుపు తిప్పిన ఆఖరి ఓవర్‌తోనే ముంబై నాలుగోసారి చాంపియన్‌ అయ్యింది. 8 పరుగులు చేస్తే చెన్నై గెలిచే ఆ ఓవర్‌లో అద్భుతంగా కట్టడి చేయడం వల్లే రోహిత్‌ సేన నెగ్గింది. చెన్నై బౌలర్‌ హర్భజన్‌ సింగ్‌ కూడా వ్యక్తిగత కారణాలతో జట్టుతో పాటే యూఏఈ వెళ్లలేకపోయాడు.     

మరిన్ని వార్తలు