క్రికెట్‌కు వాట్సన్‌ గుడ్‌బై

3 Nov, 2020 06:43 IST|Sakshi

టి20 లీగ్‌లకు రిటైర్మెంట్‌ ఇచ్చిన ఆసీస్‌ క్రికెటర్‌

చెన్నై: చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) తరఫున ఆస్ట్రేలియా ప్లేయర్‌ షేన్‌ వాట్సన్‌ చివరి మ్యాచ్‌ ఆడేశాడు. 2018 నుంచి ఓపెనర్‌గా చెన్నై విజయాల్లో కీలకంగా వ్యవహరించిన వాట్సన్‌ ఆదివారం ఫ్రాంచైజీ క్రికెట్‌ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. చివరి లీగ్‌ మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలుపు అనంతరం వాట్సన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రాంచైజీ వర్గాలు వెల్లడించాయి. 2016లోనే అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వీడ్కోలు తీసుకున్న 39 ఏళ్ల వాట్సన్‌ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లలో ఆయా ఫ్రాంచైజీలకు ఆడుతున్నాడు. ఆదివారంతో ఇక అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్‌ అవుతున్నట్లు సీఎస్‌కే సహచరులతో వాట్సన్‌ చెప్పాడు.

‘డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఈ విషయాన్ని పంచుకుంటూ వాట్సన్‌ ఉద్వేగానికి గురయ్యాడు. చెన్నై ఫ్రాంచైజీకి ఆడటాన్ని గౌరవంగా భావిస్తున్నానని అతను అన్నాడు’ అని జట్టు వర్గాలు తెలిపాయి. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో చెన్నై కన్నా ముందు రాజస్తాన్‌ రాయల్స్, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు వాట్సన్‌ ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లోనే కాకుండా కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్, బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్, పాకిస్తాన్‌ సూపర్‌లీగ్, బిగ్‌బాష్‌ లీగ్‌లలో కూడా వాట్సన్‌ బరిలోకి దిగాడు. ఓవరాల్‌గా వాట్సన్‌ తన టి20 కెరీర్‌లో 343 మ్యాచ్‌లు ఆడి 8,821 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 53 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 216 వికెట్లు కూడా పడగొట్టిన వాట్సన్‌ 101 క్యాచ్‌లు తీసుకున్నాడు.

మరిన్ని వార్తలు