మళ్లీ సన్‌రైజర్స్‌ గెలిచేనా?

13 Oct, 2020 19:11 IST|Sakshi

దుబాయ్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్‌  హైదరాబాద్‌ జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గుచూపాడు. ఈ సీజన్‌లో ఇరు జట్లను నిలకడలేమి కలవరపరుస్తోంది. ఒక మ్యాచ్‌లో గెలిస్తే, మరొక మ్యాచ్‌లో ఓడిపోవడం ఇరుజట్లకు సాధారణంగా మారిపోయింది. ఇందులో సీఎస్‌కే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గత ఐదు మ్యాచ్‌ల్లో సీఎస్‌కే ఒకదాంట్లో మాత్రమే గెలవగా, ఎస్‌ఆర్‌హెచ్‌ ఆడిన చివరి ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించగా, రెండు మ్యాచ్‌లో ఓడిపోయింది. ఇరు జట్లు ఆడిన గత మూడు మ్యాచ్‌లో ఒక విజయాన్ని మాత్రమే ఖాతాలో వేసుకున్నాయి.  ఈ రెండు జట్లు ఇంకా సరైన టచ్‌లోకి రాకపోవడంతో ఏ క్షణంలో ఎవరు రాణిస్తారో చెప్పడం కష్టంగా మారింది.

ఫలాన ప్లేయర్‌ కచ్చితంగా ఆడతాడని ఇరు జట్ల ఫామ్‌ను బట్టి తెలుస్తోంది. ప‍్రస్తుత ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ ఏడు మ్యాచ్‌లు ఆడి మూడు విజయాలతో ఉండగా, సీఎస్‌కే ఏడు మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలు సాధించింది. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి అంకం మ్యాచ్‌లో సీఎస్‌కేపై ఎస్‌ఆర్‌హెచ్‌ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటివరకూ ఓవరాల్‌గా ఇరు జట్ల మధ్య 13 మ్యాచ్‌లు జరగ్గా సీఎస్‌కే 9 విజయాలు సాధించగా, ఎస్‌ఆర్‌హెచ్‌ 4 విజయాలు నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఒక మార్పులో బరిలోకి దిగుతున్నాయి. సీఎస్‌కే జట్టులో పీయూష్‌ చావ్లా తిరిగి జట్టులోకి వచ్చాడు. జగదీశన్‌ స్థానంలో చావ్లాకు అవకాశం కల్పించారు. ఇక ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టులోకి నదీమ్‌కు అవకాశం దక్కింది. అభిషేక్‌ శర్మ స్థానంలో నదీమ్‌ను తీసుకున్నారు.

ధోని వర్సెస్‌ రషీద్‌
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సాధించిన విజయాల్లో స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటివరకూ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 10 వికెట్లు సాధించాడు. అదే సమయంలో 5.03 ఎకానమీని నమోదు చేసి ప్రత్యర్థులకు సవాల్‌ విసురుతున్నాడు. ఓవరాల్‌గా 53 మ్యాచ్‌ల్లో 65 వికెట్లను రషీద్‌ ఖాతాలో వేసుకున్నాడు. మరొకవైపు సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని పరిస్థితి దారుణంగా ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ మంచి ఇన్నింగ్స్‌ ఆడలేదు. ఏడు మ్యాచ్‌ల్లో ధోని 113 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ మ్యాచ్‌లో ధోనిలో గాడిలో పడితేనే సీఎస్‌కే తిరిగి తేరుకుంటుంది. కాగా, సన్‌రైజర్స్‌ జట్టులో డేవిడ్‌ వార్నర్‌, బెయిర్‌ స్టో, మనీష్‌ పాండే, నటరాజన్‌, ఖలీల్‌ అహ్మద్‌, రషీద్‌ ఖాన్‌లే కీలక ఆటగాళ్లు. మరొకవైపు సీఎస్‌కే జట్టులో షేన్‌ వాట్సన్‌, డుప్లెసిస్‌, అంబటి రాయుడు,ఎంఎస్‌ ధోని, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌లే ప్రధాన క్రికెటర్లు.

సీఎస్‌కే
డేవిడ్‌ వార్నర్‌(కెప్టెన్‌), షేన్‌ వాట్సన్‌, డుప్లెసిస్‌, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, సామ్‌ కరాన్‌, డ్వేన్‌ బ్రేవో, దీపక్‌ చాహర్‌‌, పీయూష్‌ చావ్లా, శార్దూల్‌ ఠాకూర్‌, కరణ్‌ శర్మ

సన్‌రైజర్స్

డేవిడ్‌ వార్నర్‌(కెప్టెన్‌), జోనీ బెయిర్‌ స్టో, మనీష్‌ పాండే, కేన్‌ విలియమ్సన్‌, ప్రియాం గార్గ్‌, విజయ్‌ శంకర్‌, నదీమ్‌, రషీద్‌ ఖాన్‌, సందీప్‌ శర్మ, ఖలీల్‌ అహ్మద్‌, టి నటరాజన్‌

మరిన్ని వార్తలు