Chennai Super Kings Win 4th Title: 35+ ‘బాయ్స్‌’ సక్సెస్‌ స్టోరీ..!

17 Oct, 2021 05:48 IST|Sakshi

సాక్షి క్రీడా విభాగం: ‘మేం వచ్చేసారి బలంగా తిరిగొస్తాం... అభిమానులకు ఇదే నా సందేశం’... గత ఏడాది ఐపీఎల్‌లో చెత్త ప్రదర్శనతో ఏడో స్థానంలో నిలిచిన తర్వాత ధోని చేసిన వ్యాఖ్య ఇది. జట్టుపై, తనపై ఎంత నమ్మకముంటే ధోని ఇలాంటి మాటలు చెప్పగలడు. ఎందుకంటే అతను ధోని కాబట్టి! చూస్తుంటే టీమ్‌ పరిస్థితి గొప్పగా ఏమీ లేదు. వయసు పెరిగిపోయి, ఫామ్‌ కోల్పోయి తంటాలు పడుతున్న ఆటగాళ్లతో ఈసారే కాలేదు, వచ్చే ఏడాది ఏమవుతుంది అని అన్ని వైపుల నుంచి వ్యంగ్య స్పందనలు. కానీ ఇలాంటి స్థితి నుంచి టీమ్‌ను నిజంగా విజేతగా నిలపడం అంటే అసాధారణం. 

సీఎస్‌కేకు తొలి సీజన్‌ నుంచి కర్త, కర్మ, క్రియ అన్నీ ధోనినే. జట్టు గెలిచినా, ఓడినా, చాంపియన్‌షిప్‌లు సాధించినా అంతా అతని సారథ్యం అనడంలో సందేహం లేదు. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కూడా ఇదే నమ్మింది. ఇన్నేళ్ల విజయాల్లో భిన్న ఆటగాళ్లు తమదైన పాత్ర పోషించారు. కానీ మారనిది ధోని, అతని వ్యూహ చతురతే! సరిగ్గా చెప్పాలంటే ఈ సీజన్‌లో 40 ఏళ్ల ధోని బ్యాటింగ్‌ చూస్తే సూపర్‌ కింగ్స్‌ పది మంది ఆటగాళ్లు, ఒక కెప్టెన్‌తో ఆడినట్లు ఉంది. కేవలం నాయకత్వం కారణంగానే అతను టీమ్‌లో ఉన్నాడనేది వాస్తవమైతే అతను నాయకుడిగా ఉన్నాడు కాబట్టే టీమ్‌ ఇలా పురోగమించిందనేది కూడా అంతకంటే వాస్తవం!  

చెన్నై టీమ్‌లో ఐదుగురు ఆటగాళ్లు 35 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారు. టి20లు అనగానే ఈ విషయంలో కాస్త సంశయం కనిపిస్తుంది. అయితే బరిలోకి దిగి అద్భుతాలు చేసేందుకు వారికి వయసు అడ్డు రాలేదు. వీరంతా టీమ్‌ విజయాల్లో కీలకపాత్ర పోషించారు. 37 ఏళ్ల డు ప్లెసిస్‌ ఏకంగా 633 పరుగులతో సత్తా చాటి ఓపెనర్‌గా శుభారంభాలు అందించాడు. 38 ఏళ్ల బ్రావో 14 కీలక వికెట్లు తీసి తాను చెన్నై బృందంలో సుదీర్ఘ కాలంగా ఎందుకు కొనసాగుతున్నాడో చూపించాడు. 34 ఏళ్ల సీనియర్, అత్యంత విజయవంతమైన చెన్నై ఆటగాడు సురేశ్‌ రైనా ఫామ్‌ కోల్పోయి తంటాలు పడుతుంటే మరో 35 ఏళ్ల రాబిన్‌ ఉతప్పను తుది జట్టులోకి తీసుకొని చేసిన వ్యూహం సూపర్‌గా పేలింది. తొలి క్వాలిఫయర్‌లో మెరుపు బ్యాటింగ్‌ చేసిన ఉతప్ప, ఫైనల్లో జట్టు ఒత్తిడిలోకి వెళుతున్న సమయంలో 3 సిక్సర్లతో ఆట మార్చేశాడు.

36 ఏళ్ల రాయుడు కూడా కీలక సమయంలో రెండు అర్ధ సెంచరీలతో తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇక ఐపీఎల్‌ గెలిచిన తొలి ఇంగ్లండ్‌ ఆటగాడిగా నిలిచిన 34 ఏళ్ల మొయిన్‌ అలీని కూడా ధోని సమర్థంగా వాడుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లతో పాటు అతని చక్కటి ఫీల్డింగ్‌ జట్టుకు ఎంతో పనికొచ్చాయి. ఎప్పటిలాగే రవీంద్ర జడేజా తనదైన శైలిలో అన్ని రంగాల్లో రాణించడం చెన్నై బలాన్ని పెంచింది. ఇక టీమ్‌ ప్రస్థానంలో చెప్పుకోదగ్గ పేరు రుతురాజ్‌ గైక్వాడ్‌. గత ఏడాది ఐపీఎల్‌ సమయంలో అనూహ్యంగా కరోనా బారిన పడి కోలుకున్న తర్వాత ఆరంభంలో విఫలమైనా... చివరి మ్యాచ్‌లలో సత్తా చాటాడు. ఈసారి తనలోని పూర్తి స్థాయి ఆటను చూపిస్తూ సెంచరీ సహా 635 పరుగులు సాధించడం చెన్నై టైటిల్‌ విజయంలో కీలకంగా మారింది. వీరందరినీ సమర్థంగా వాడుకుంటూ ధోని నడిపించిన తీరు నాయకుడిగా అతని వన్నె ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది.

చివరగా... వచ్చేసారి ఐపీఎల్‌లో మెగా వేలం ఉన్న నేపథ్యంలో ఇంకా నియమ నిబంధనలు ఏమిటనేది బీసీసీఐ ఇంకా స్పష్టం చేయలేదు. అయితే విజేతలుగా నిలిచిన ఈ టీమ్‌లోని సభ్యుల్లో కూడా ఎంత మంది మళ్లీ ఐపీఎల్‌లో కనిపిస్తారనేది వేర్వేరు కారణాలతో సందేహమే. ఒకవేళ ఆడినా ఇదే సక్సెస్‌ఫుల్‌ టీమ్‌ ఒక్క చోటికి చేరడం సహజంగానే కష్టం. ఈ నేపథ్యంలో వీరు సాధించిన విజయపు ఘనత చిన్నదేమీ కాదు. చెన్నై ఫ్యాన్స్‌ మాత్రమే కాదు, సగటు క్రికెట్‌ అభిమాని కూడా... ఏం ఆడిందిరా ఈ టీమ్‌ అనేలా ఘనంగా చెన్నై ముగింపు పలికింది.  

మరిన్ని వార్తలు