ఐపీఎల్‌ సన్నాహాకాల్లో భాగంగా చెన్నై జట్టు సాధన 

22 Mar, 2021 17:01 IST|Sakshi

చెన్నై: ఏప్రిల్‌ 9 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్‌-2021 సీజన్‌ కోసం ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు ముమ్మరంగా సాధన చేస్తోంది. మిగతా ఫ్రాంఛైజీల కన్నా ముందే ట్రైనింగ్‌ క్యాంప్‌ను ప్రారంభించిన చెన్నై జట్టు వినూత్నంగా ప్రాక్టీస్‌ చేస్తోంది. మ్యాచ్‌లో ఎదురయ్యే పరిస్థితులకు అనుగుణంగా ఎలా ఆడాలనే అంశంపై ధోనీ ఇప్పటి నుంచే ఆటగాళ్లను సన్నద్ధం చేస్తున్నాడు. స్ట్రైక్‌ రొటేట్‌ చేయడం, కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడం, వేగంగా పరుగులు రాబట్టడం, ఆఖరి ఓవర్లలో ఒత్తిడిని అధిగమించి బ్యాటింగ్‌ చేయడం లాంటి అంశాలపై ధోని పర్యవేక్షణలో జట్టు సాధన చేస్తోందని ఆ జట్టు మేనేజ్‌మెంట్‌ పేర్కొంది. రెగ్యులర్‌ ప్రాక్టీస్‌కు భిన్నంగా తమ సాధన సాగుతుందని ఆ జట్టు ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌ తెలిపాడు. 

కాగా, చెన్నై జట్టు టాప్‌ ఆటగాళ్లు సురేశ్‌ రైనా, రవీంద్ర జడేజా ఇంకా జట్టుతో చేరాల్సి ఉంది. రైనా ఈనెల 24లోగా క్యాంప్‌లో చేరనుండగా, ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏలో కోలుకుంటున్న రవీంద్ర జడేజా.. ఈ వారం చివర్లో జట్టుతో కలువనున్నాడని సీఎస్కే టీమ్‌ మేనేజ్‌మెంట్‌ పేర్కొంది. ఈ ఏడిషన్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ జట్టు.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగూళూరుతో ఢీకొట్టనుండగా, చెన్నై తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ ఏప్రిల్‌ 10న జరుగనుంది.

మరిన్ని వార్తలు