‘సన్‌’కు చెన్నై చెక్‌... 

14 Oct, 2020 03:26 IST|Sakshi
వాట్సన్‌

ఛేదనలో హైదరాబాద్‌ విఫలం

20 పరుగులతో సూపర్‌ కింగ్స్‌ విజయం

ధోని సేన సమష్టి ప్రదర్శన

విలియమ్సన్‌ అర్ధ సెంచరీ వృథా   

సీజన్‌లో తొలిసారి ముందుగా బ్యాటింగ్‌కు దిగడం చెన్నైకి కలిసొచ్చింది. గత రెండు మ్యాచ్‌లలో స్వల్ప లక్ష్యాలను ఛేదించలేక చతికిలపడిన ఆ జట్టు హ్యాట్రిక్‌ పరాజయం నుంచి తప్పించుకుంది. సరైన కూర్పుతో బరిలోకి దిగిన ధోని సేన సమష్టి ప్రదర్శనతో కీలక విజయాన్ని అందుకుంది. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో అంతా తలా ఓ చేయి వేయడంతో చెప్పుకోదగ్గ స్కోరు సాధించిన సూపర్‌ కింగ్స్‌... ఆపై ఐదుగురు బౌలర్లు కనీసం ఒక్కో వికెట్‌ తీయడంతో ప్రత్యర్థిని కట్టిపడేసింది. హైదరాబాద్‌ మాత్రం మరోసారి బ్యాటింగ్‌ వైఫల్యంతో ఓటమిని ఆహ్వానించింది. విలియమ్సన్‌ అర్ధ సెంచరీ సాధించడం తప్ప ఇతర బ్యాట్స్‌మెన్‌ ఒక్కరూ రాణించకపోవడంతో 168 పరుగుల లక్ష్యమే కొండంతగా మారిపోయి కుప్పకూలింది. 

దుబాయ్‌: ఐపీఎల్‌లో రెండు వరుస పరాజయాల తర్వాత చెన్నై ఖాతాలో మళ్లీ విజయం చేరింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 20 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. షేన్‌ వాట్సన్‌ (38 బంతుల్లో 42; 1 ఫోర్, 3 సిక్సర్లు), అంబటి రాయుడు (34 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), స్యామ్‌ కరన్‌ (21 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం రైజర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులే చేయగలిగింది. కేన్‌ విలియమ్సన్‌ (39 బంతుల్లో 57; 7 ఫోర్లు) అర్ధసెంచరీ చేశాడు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన రవీంద్ర జడేజాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.
 
ఆకట్టుకున్న కరన్‌... 
ఓపెనర్‌ డుప్లెసిస్‌ (0) తాను ఎదుర్కొన్న తొలి బంతికే అవుటైనా... మరో ఎండ్‌లో కొత్త ఓపెనర్‌ స్యామ్‌ కరన్‌ చక్కటి షాట్లతో జట్టుకు కావాల్సిన ఆరంభాన్ని అందించాడు. ముఖ్యంగా ఖలీల్‌ వేసిన నాలుగో ఓవర్లో అతను 2 ఫోర్లు, 2 సిక్సర్లతో చెలరేగిపోవడంతో మొత్తం 22 పరుగులు వచ్చాయి. అయితే సందీప్‌ వేసిన బంతికి బౌల్డ్‌ కావడంతో కరన్‌ ఆట ముగిసింది. పవర్‌ప్లే ముగిసేసరికి చెన్నై స్కోరు 44 పరుగులకు చేరింది. ఈ దశలో వాట్సన్, రాయుడు కలిసి కీలక భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. మంచి సమన్వయంతో ఆడిన వీరిద్దరు మూడో వికెట్‌కు 64 బంతుల్లో 81 పరుగులు జోడించారు. 9 పరుగుల వద్ద రాయుడు, 24 పరుగుల వద్ద వాట్సన్‌ ఇచ్చిన క్యాచ్‌లను సన్‌రైజర్స్‌ వదిలేయడం కూడా కలిసొచ్చింది. రషీద్‌ బౌలింగ్‌లో వాట్సన్‌ కొట్టిన మూడు సిక్సర్లు ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచాయి. అయితే నాలుగు పరుగుల వ్యవధిలో వీరిద్దరు ఫుల్‌ టాస్‌ బంతులకే వెనుదిరిగారు. చివర్లో ధోని (13 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్‌), జడేజా (10 బంతుల్లో 25 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడటంతో సూపర్‌ కింగ్స్‌ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. ఆఖరి ఐదు ఓవర్లలో చెన్నై 51 పరుగులు చేసింది.  
వార్నర్‌ వికెట్‌ తీసిన సంబరంలో స్యామ్‌ కరన్‌ 

విలియమ్సన్‌ మినహా... 
ఛేదనలో హైదరాబాద్‌కు సరైన ఆరంభం లభించలేదు. షాట్‌ను ప్యాడ్‌పైకి ఆడుకొని వార్నర్‌ (9) వెనుదిరగ్గా... మరో మూడు బంతులకే అలసత్వం కారణంగా మనీశ్‌ పాండే (4) రనౌటయ్యాడు. ఆ తర్వాత కూడా జట్టు ఇన్నింగ్స్‌ సరిగా సాగలేదు. బెయిర్‌స్టో (24 బంతుల్లో 23; 2 ఫోర్లు)లో దూకుడు లోపించగా, విలియమ్సన్‌ కూడా నిలదొక్కుకునేందుకు సమయం తీసుకున్నాడు. పవర్‌ప్లేలో హైదరాబాద్‌ 42 పరుగులు చేయగా...తర్వాతి ఐదు ఓవర్లలో కనీసం ఒక్క ఫోర్‌ కూడా రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 35 బంతుల విరామం తర్వాత ఎట్టకేలకు వరుసగా రెండు ఫోర్లతో విలియమ్సన్‌ జోరు పెంచాడు. ప్రియమ్‌ గార్గ్‌ (16), విజయ్‌ శంకర్‌ (12) కూడా ప్రభావం చూపలేకపోగా, 36 బంతుల్లో విలియమ్సన్‌ అర్ధసెంచరీ పూర్తయింది. మూడు ఓవర్లలో 46 పరుగులు చేయాల్సిన దశలో కరణ్‌ వేసిన 18వ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. విలియమ్సన్‌ ఇదే ఓవర్లో అవుటైనా... రషీద్‌ 2 ఫోర్లు, సిక్స్‌తో ఆశలు పెంచాడు. అయితే తర్వాతి 2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 6 పరుగులు మాత్రమే చేసిన రైజర్స్‌ పరాజయం ఖాయం చేసుకుంది. 

స్కోరు వివరాలు 
చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: స్యామ్‌ కరన్‌ (బి) సందీప్‌ శర్మ 31; డుప్లెసిస్‌ (సి) బెయిర్‌స్టో (బి) సందీప్‌ శర్మ 0; వాట్సన్‌ (సి) పాండే (బి) నటరాజన్‌ 42; రాయుడు (సి) వార్నర్‌ (బి) ఖలీల్‌ 41; ధోని (సి) విలియమ్సన్‌ (బి) నటరాజన్‌ 21; జడేజా (నాటౌట్‌) 25; బ్రేవో (బి) ఖలీల్‌ 0; చహర్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 167.  
వికెట్ల పతనం: 1–10; 2–35; 3–116; 4–120; 5–152; 6–152. బౌలింగ్‌: సందీప్‌ శర్మ 4–0–19–2; ఖలీల్‌ 4–0–45–2; నదీమ్‌ 4–0–29–0; నటరాజన్‌ 4–0–41–2; రషీద్‌ ఖాన్‌ 4–0–30–0. 

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి అండ్‌ బి) స్యామ్‌ కరన్‌ 9; బెయిర్‌స్టో (బి) జడేజా 23; మనీశ్‌ పాండే (రనౌట్‌) 4; విలియమ్సన్‌ (సి) శార్దుల్‌ (బి) కరణ్‌ శర్మ 57; ప్రియమ్‌ గార్గ్‌ (సి) జడేజా (బి) కరణ్‌ శర్మ 16; విజయ్‌ శంకర్‌ (సి) జడేజా (బి) బ్రేవో 12; రషీద్‌ (హిట్‌ వికెట్‌) (బి) శార్దుల్‌ 14; నదీమ్‌ (సి అండ్‌ బి) బ్రేవో 5; సందీప్‌ శర్మ (నాటౌట్‌) 1; నటరాజన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 147.  
వికెట్ల పతనం: 1–23; 2–27; 3–59; 4–99; 5–117; 6–126; 7–146; 8–146. బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 4–0–28–0; స్యామ్‌ కరన్‌ 3–0–18–1; జడేజా 3–0–21–1; శార్దుల్‌ ఠాకూర్‌ 2–0–10–1; కరణ్‌ శర్మ 4–0–37–2; బ్రేవో 3–0–25–2; చావ్లా 1–0–8–0.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు