R Praggnanandhaa: ‘ప్రజ్ఞ’కు పట్టం.. 18 ఏళ్ల వయస్సులో ఎన్నో సంచలనాలు

24 Sep, 2023 11:32 IST|Sakshi

నవంబర్‌ 2013.. విశ్వనాథన్‌ ఆనంద్, మాగ్నస్‌ కార్ల్‌సన్‌ మధ్య వరల్డ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ మ్యాచ్‌.. వేదిక చెన్నైలోని హయత్‌ రీజెన్సీ హోటల్‌.. ఎనిమిదేళ్ల కుర్రాడొకడు టోర్నీ జరిగినన్ని రోజులు తన కోచ్‌తో పాటు అక్కడే తచ్చాడుతూ కనిపించాడు. ప్రేక్షకుల మధ్యలో కూర్చొనే అవకాశం వచ్చినప్పుడు ఇద్దరు దిగ్గజాల మధ్య పోరులో ఎత్తులు, పైఎత్తులను గమనించడం.. లేదంటే హోటల్‌ లాబీలో చెస్‌తో సంబంధం ఉన్న ఎవరైనా ఆట గురించి మాట్లాడుతుంటే ఆసక్తిగా వినడం.. అన్ని రోజులూ అతనిది అదే దినచర్య! ఆ సమయంలో అతనొక ఔత్సాహిక ఆటగాడు, చెస్‌ అభిమాని మాత్రమే.

అతనే కాదు అతని కోచ్‌ కూడా ఊహించలేదు.. సరిగ్గా దశాబ్ద కాలం తర్వాత ఆ ‘ప్రజ్ఞ’ ప్రపంచ స్థాయికి చేరుతుందని. ఆ కుర్రాడు.. విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ప్రపంచ కప్‌ ఫైనల్‌కు చేరిన రెండో భారతీయుడిగా నిలుస్తాడని.. అదే కార్ల్‌సన్‌తో విశ్వ వేదికపై తలపడతాడని! అద్భుతమైన ప్రతిభతో ఇప్పుడు భారత్‌లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్త గుర్తింపు కూడా దక్కించుకున్న ఆ బాల మేధావి పేరు ఆర్‌. ప్రజ్ఞానంద.

గత ఏడాది మే నెలలో చెస్‌ ఏబుల్‌ మాస్టర్స్‌ ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ టోర్నమెంట్‌ జరుగుతోంది. అదే సమయంలో ప్రజ్ఞానంద తన 11వ తరగతి పరీక్షలకు సిద్ధమయ్యాడు. స్టడీ బ్రేక్‌ అంటూ పరీక్షల మధ్యలో కొంత విరామం ఇవ్వడంతో అతను ఈ టోర్నీలో పాల్గొనాలని నిశ్చయించుకున్నాడు. కార్ల్‌సన్, వీయీ, అనీశ్‌ గిరి, డింగ్‌ లారెన్‌ లాంటి స్టార్లు ఉన్న ఈ టోర్నీలో ‘నేనేమాత్రం ముందుకు వెళ్లగలను?’ అనే సందేహం ఉండటంతో పరీక్షల గురించి పెద్దగా ఆలోచించలేదు.

కానీ ఈ టోర్నీలో వచ్చిన అద్భుతమైన ఫలితాలు ఫైనల్‌ వరకు తీసుకెళ్లాయి. దాంతో ఒకే సమయంలో పగలు, రాత్రి అటు చెస్, ఇటు పరీక్షలు అంటూ మేనేజ్‌ చేయాల్సి వచ్చింది. తెల్లవారుజామున 4 గంటల వరకు గేమ్‌ ఆడి మళ్లీ 7 గంటలకు అతను పరీక్షకు హాజరయ్యాడు. ఆ శ్రమ వృథా కాలేదు. ఆ టోర్నీలో ఆల్‌టైమ్‌ గ్రేట్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను ఓడించడంలో అతను సఫలమయ్యాడు.

మూడు నెలల వ్యవధిలో కార్ల్‌సన్‌ను రెండోసారి ఓడించడంతో అతని గత విజయం గాలివాటు కాదని, ప్రజ్ఞానంద ఎంతో ప్రత్యేకమైన ఆటగాడనేది ప్రపంచానికి తెలిసింది. 12 ఏళ్ల 10 నెలల 13 రోజుల వయసులో గ్రాండ్‌మాస్టర్‌ హోదా సాధించి ప్రపంచ చెస్‌లో రెండో పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందిన ఈ చెన్నై చిచ్చరపిడుగు ఆపై కూడా అంతే వేగంగా దూసుకుపోయాడు.

అక్క చూపిన దారిలో..
ప్రజ్ఞానంద.. ఆరంభంలో ఆసక్తితో కాకుండా అనుకోకుండానే చదరంగపు ఎత్తులు నేర్చుకున్నాడు. తమిళనాడు స్టేట్‌ కార్పొరేషన్‌ బ్యాంక్‌లో తండ్రి రమేశ్‌బాబు మేనేజర్‌. పోలియో బాధితుడైన ఆయన తన పిల్లలను సరదాగా ఆటల కోసం బయటకు తీసుకెళ్లడంలో ఇబ్బంది పడేవాడు. పెద్దమ్మాయి వైశాలి ఎక్కువసేపు టీవీ చూడటం, వీడియో గేమ్‌లకే అతుక్కుపోయేది. దాంతో దానిని నివారించేందుకు తనకు ఆట గురించి ఏమీ తెలియకపోయినా ఆయన తన కూతురును ముందుగా చెస్‌ వైపు నడిపించాడు.

ఆటలో ఓనమాలు నేర్చుకున్న తర్వాత ఆమె ఆసక్తి పెంచుకొని చదరంగం బోర్డుపైనే ఎక్కువ సమయం గడపడం మొదలుపెట్టింది. అక్క ఆటను చూస్తూ వచ్చిన చిన్నారి ప్రజ్ఞానంద కూడా చెస్‌ నేర్చుకున్నాడు. ఇప్పుడు అక్కను దాటి అగ్రస్థానానికి చేరాడు. వైశాలి కూడా ఇప్పుడు భారత చెస్‌లో చురుకైన ప్లేయర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇంటర్నేషనల్‌ మాస్టర్, మహిళా గ్రాండ్‌మాస్టర్‌గా కూడా వైశాలి సత్తా చాటుతుండగా.. మరో వైపు తమ్ముడు ప్రపంచ కప్‌ రన్నరప్‌ స్థాయికి చేరాడు.

కోచ్‌ చూపిన బాటలో..
ప్రజ్ఞానంద గెలుపు ప్రస్థానంలో కోచ్‌ రమేశ్‌దే కీలక పాత్ర. సహజమైన ప్రతిభను గుర్తించి చాలా చిన్న వయసులోనే సానబెట్టడంలో ఆయన దూరదృష్టి పని చేసింది. చెన్నైలోని చెస్‌ గురుకుల్‌ అకాడమీలో ఆయన వద్ద దాదాపు నాలుగు వందల మంది శిక్షణ పొందుతుండగా వారిలో ప్రజ్ఞ ప్రియ శిష్యుడయ్యాడు. అందుకే ఈ సంచలనం గురించి రమేశ్‌కు తెలిసినంతగా మరెవరికీ తెలీదు. ‘పిల్లలు బొమ్మలతో ఆడుకుంటూ గంటలు గంటలు గడిపే వయసులో ప్రజ్ఞానంద ఈ స్థాయికి చేరాడు.

ప్రతిభతోపాటు కష్టపడే తత్వం కూడా ఉంది ఆ పిల్లాడికి! అందుకే ఇంకా ఏదో సాధించాలంటూ అతడిపై అనవసరపు ఒత్తిడి పెంచను. అతను తర్వాతి గేమ్‌లో గ్రాండ్‌మాస్టర్‌ సాధిస్తాడని తెలిసి కూడా దాన్ని బయటకు వెలిబుచ్చకుండా బరిలోకి దించాను. ఆటలో గెలుపుతో పాటు ఓటములూ ఉంటాయనే విషయం అతనికి ఇప్పుడు అర్థమైంది. ఓడినా తన రొటీన్‌ను మార్చుకోడు కాబట్టి మానసికంగా సమస్య లేదు. పెద్దగా స్నేహితులు కూడా లేరు. కాబట్టి సమయం దొరికితే నేనే అతనితో సరదాగా టేబుల్‌ టెన్నిస్‌ ఆడతాను. ఏడాదిగా అతను అద్భుతాలు చేస్తున్నాడు. అవి అలాగే కొనసాగుతాయని నా నమ్మకం’ అన్నారు కోచ్‌.

అన్నీ సంచలనాలే..
ప్రజ్ఞానందకు ఇటీవలే 18 ఏళ్ల నిండాయి. ఇప్పటికే అతను అంతర్జాతీయ చెస్‌లో ఎన్నో విజయాలు అందుకున్నాడు. ఇటీవల కార్ల్‌సన్‌తో తలపడి ప్రపంచ కప్‌ ఫైనల్లో రన్నరప్‌గా నిలవడం అతని కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన. అయితే చిన్న వయసులోనే వరుసగా సాధించిన సంచలనాల జాబితా కూడా పెద్దదే! 10 ఏళ్ల వయసులోనే ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ అయి ఆపై రెండేళ్ల తర్వాత గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించాడు. అంతకు ముందే ప్రపంచ యూత్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో అండర్‌–8, అండర్‌–10 విభాగాల్లోనూ విజేతగా నిలిచాడు. కార్ల్‌సన్‌ను ఓడించిన అతి పిన్న వయస్కుడు కూడా అతనే.

ఆనంద్, హరికృష్ణ తర్వాత ఈ దిగ్గజాన్ని ఓడించిన మూడో భారతీయుడు ప్రజ్ఞానందే కాగా, మొత్తం 3 సార్లు అతను ఈ ఫలితాన్ని పునరావృతం చేయడం విశేషం. 14 ఏళ్ల వయసులో అంతర్జాతీయ టోర్నీ ఎక్స్‌ట్రాకాన్‌ ఓపెన్‌ (డెన్మార్క్‌)లో విజేతగా నిలవడంతో అతనికి తొలిసారి ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఆ తర్వాత యూత్‌ అండర్‌–18 వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ కూడా అతని ఖాతాలోనే చేరింది.

ఇప్పుడు ప్రపంచ చాంపియన్‌కు సవాల్‌ విసిరే ఆటగాడిని ఎంపికచేసే ప్రతిష్ఠాత్మక క్యాండిడేట్స్‌ టోర్నీకీ ప్రజ్ఞ అర్హత సాధించాడు. అతని విజయాలకెప్పుడూ అమ్మ నాగలక్ష్మి తోడుంటూ వచ్చింది. ఇటీవలి వరల్డ్‌ కప్‌ సమయంలోనే ఆమె పైనా అందరి దృష్టి పడింది. చిన్నప్పటి నుంచి కొడుక్కి తోడుగా.. అతని ఏర్పాట్లన్నీ చూస్తూ.. మ్యాచ్‌ల కోసం విదేశాలకు వెళ్లినప్పుడూ ఏమాత్రం లోటు రానివ్వకుండా.. తన చేతివంటతో బిడ్డపై చూపించే ఆ తల్లి ప్రేమ కూడా ఆటల సమయంలో ఆ చిన్నారికి అదనపు బలమవుతోంది.

ప్రజ్ఞానంద ఎంతో ప్రతిభావంతుడనడంలో ఎలాంటి సందేహం లేదు. అతని ఆట గురించి ఒక ప్రత్యేక అంశం నన్ను ఆకట్టుకుంటోంది. ‘డ్రా’కు అవకాశం ఉన్న మ్యాచ్‌లలో కూడా ఎక్కడా అతను తగ్గకుండా మిడిల్‌ గేమ్‌లో అనూహ్యమైన ఎత్తులతో అతను ఫలితం వైపు తీసుకెళ్తాడు. వేర్వేరు టోర్నమెంట్‌లలో గేమ్‌లను ఎంచుకునే విషయంలోనూ ఎంతో పరిణతి ప్రదర్శిస్తున్నాడు. అతను కెరీర్‌లో ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడు.విశ్వనాథన్‌ ఆనంద్‌
♦మొహమ్మద్‌ అబ్దుల్‌ హాది

మరిన్ని వార్తలు