Chess Olympiad 2022: చెస్‌ విజేతలకు నజరానా

11 Aug, 2022 04:37 IST|Sakshi

రూ. కోటి చొప్పున అందించిన తమిళనాడు సీఎం స్టాలిన్‌

సాక్షి, చెన్నై: 44వ చెస్‌ ఒలింపియాడ్‌లో సత్తా చాటిన భారత ఆటగాళ్లను ఆతిథ్య తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అభినందించారు. ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌ తరఫున ఆరు జట్లు పాల్గొనగా...ఓపెన్‌ విభాగంలో భారత ‘బి’ జట్టు, మహిళల విభాగంలో భారత ‘ఎ’ జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు సాధించాయి.

ఓపెన్‌ జట్టులో గుకేశ్, నిహాల్‌ సరీన్, ప్రజ్ఞానంద, ఆదిబన్, రౌనక్‌ సాధ్వాని సభ్యులు కాగా, మహిళల టీమ్‌లో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్‌దేవ్, భక్తి కులకర్ణి భాగంగా ఉన్నారు. బుధవారం సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో వీరందరి ఘనతను సీఎం ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన ఒక్కో జట్టుకు రూ. 1 కోటి చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత చెస్‌ సమాఖ్య (ఏఐసీఎఫ్‌) అధికారులతో పాటు మంత్రి మెయ్యనాథన్, సీఎస్‌ ఇరై అన్బు తదితరులు పాల్గొన్నారు.

‘టాటా స్టీల్‌’లో మహిళలు
చెన్నై: ప్రతిష్టాత్మక టాటా స్టీల్‌ చెస్‌ ఇండియా టోర్నమెంట్‌ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాదినుంచి ఈ టోర్నీలో మహిళల విభాగంలో కూడా పోటీలు నిర్వహించబోతున్నారు. పురుషులతో సమానంగా ప్రైజ్‌మనీని అందిస్తూ తొలిసారి మహిళల కేటగిరీని చేర్చారు. ఈ టోర్నమెంట్‌ నవంబర్‌ 29నుంచి డిసెంబర్‌ 4 వరకు కోల్‌కతాలో జరుగుతుంది.

ర్యాపిడ్‌ అండ్‌ బ్లిట్జ్‌ ఈవెంట్లలో జరిగే టోర్నమెంట్‌లో ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ఆటగాళ్లంతా భాగం కానున్నారు. మహిళల విభాగంలో భారత్‌నుంచి కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలిలతో పాటు అనా ముజిచుక్, మారియా ముజిచుక్‌ (ఉక్రెయిన్‌), నానా జాగ్‌నిజ్‌ (జార్జియా), అలినా కష్‌లిన్స్‌కయా (పోలండ్‌) తదితరులు పాల్గొంటారని నిర్వాహకులు వెల్లడించారు. టాటా స్టీల్‌ చెస్‌ టోర్నీకి భారత చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ సలహాదారుడు కావడంతో పాటు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండటం విశేషం.   

మరిన్ని వార్తలు