Chess Olympiad: నా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తా: హరికృష్ణ

27 Jul, 2022 00:47 IST|Sakshi

రేపటి నుంచి చెస్‌ ఒలింపియాడ్‌

చెన్నై: స్వదేశంలో తొలిసారి జరుగుతున్న ప్రతిష్టాత్మక చెస్‌ ఒలింపియాడ్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన ఇస్తానని భారత గ్రాండ్‌మాస్టర్, ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ పెంటేల హరికృష్ణ తెలిపాడు. ఈనెల 28 నుంచి ఆగస్టు 8 వరకు తమిళనాడులోని మహాబలిపురంలో చెస్‌ ఒలింపియాడ్‌ జరగనుంది. 187 దేశాల నుంచి ఓపెన్, మహిళల విభాగాల్లో కలిపి మొత్తం 343 జట్లు పతకాల కోసం పోటీపడతాయి. గత నెలలో ప్రాగ్‌ మాస్టర్స్‌ టోర్నీలో విజేతగా నిలిచిన 36 ఏళ్ల హరికృష్ణ తన కెరీర్‌లో పదోసారి చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

‘2000 నుంచి నేను చెస్‌ ఒలింపియాడ్‌లో పోటీపడుతున్నాను. సుదీర్ఘకాలం నుంచి దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది. సీనియర్‌ ప్లేయర్‌గా మెరుగ్గా రాణించాలనే బాధ్యత ఉంది. నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా’ అని హరికృష్ణ వ్యాఖ్యానించాడు. ‘ఆతిథ్య దేశం హోదాలో భారత్‌ ఓపెన్‌ విభాగంలో మూడు, మహిళల విభాగంలో మూడు జట్లను బరిలోకి దించనుంది. ఇప్పటికైతే పతకాల గురించి ఆలోచించడంలేదు. టోర్నీ మొత్తం నిలకడగా రాణిస్తే పతకాలు వాటంతట అవే వస్తాయి’ అని ప్రపంచ 25వ ర్యాంకర్‌ హరికృష్ణ అన్నాడు.  

మరిన్ని వార్తలు