పుజారా పునరాగమనం

23 May, 2022 07:06 IST|Sakshi

ఇంగ్లండ్‌తో చివరి టెస్టుకు భారత జట్టు ఎంపిక

ముంబై: భారత్, ఇంగ్లండ్‌ మధ్య టెస్టు సిరీస్‌లో భాగంగా జరగాల్సిన చివరిదైన ఐదో టెస్టు కోసం టీమిండియాను సెలక్టర్లు ప్రకటించారు. గత ఏడాది ఇరు జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌లు జరిగిన అనంతరం కరోనా వైరస్‌ కారణంగా ఐదో టెస్టు అనూహ్యంగా వాయిదా పడింది. ఇప్పుడు అదే టెస్టు మ్యాచ్‌ను జూలై 1 నుంచి 5 వరకు ఎడ్జ్‌బాస్టన్‌లో నిర్వహిస్తారు. సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో చోటు కోల్పోయిన సీనియర్‌ బ్యాటర్‌ చతేశ్వర్‌ పుజారా ఈ టెస్టు కోసం మళ్లీ జట్టులోకి రాగా, మయాంక్‌ అగర్వాల్‌ను తప్పించారు.

ప్రస్తుతం ఇంగ్లండ్‌లోనే ఉంటూ కౌంటీ క్రికెట్‌ ఆడుతున్న పుజారా అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ససెక్స్‌ తరఫున అతను నాలుగు సెంచరీలు సహా 720 పరుగులు చేశాడు. ఇలాంటి ఫామ్‌తో అతను భారత జట్టుకు కీలకం కాగలడని భావించిన సెలక్టర్లు మరో మాట లేకుండా పుజారాను ఎంపిక చేశారు. లంకతో సిరీస్‌లో పుజారాతో పాటు చోటు కోల్పోయిన రహానే ప్రస్తుతం గాయంతో ఆటకు దూరం కావడంతో అతని పేరును పరిశీలించలేదు. 17 మంది సభ్యుల బృందంలో ఎలాంటి అనూహ్య ఎంపికలు లేవు. సిరీస్‌లో ప్రస్తుతం భారత్‌ 2–1తో ఆధిక్యంలో ఉండగా... ఇరు జట్లు కొత్త కెప్టెన్లతో (రోహిత్‌ శర్మ, బెన్‌ స్టోక్స్‌) ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాయి.  

భారత టెస్టు జట్టు: రోహిత్‌ (కెప్టెన్‌), రాహుల్, గిల్, కోహ్లి, శ్రేయస్, విహారి, పుజారా, పంత్, షమీ, జడేజా, సిరాజ్, శార్దుల్, శ్రీకర్‌ భరత్, అశ్విన్, బుమ్రా, ఉమేశ్, ప్రసిధ్‌ కృష్ణ.

మరిన్ని వార్తలు