పుజారా ఆడకపోయుంటే...

10 Jan, 2021 06:04 IST|Sakshi

100 బంతుల్లో 16 పరుగులు... 133 బంతుల్లో 40... 174 బంతుల్లో అర్ధ సెంచరీ... తొలి వంద బంతుల్లో ఒక్క ఫోర్‌ కూడా లేదు... శనివారం చతేశ్వర్‌ పుజారా బ్యాటింగ్‌ సాగిన తీరు ఇది. దీనిపైనే పలువురు మాజీలు, అభిమానుల నుంచి విమర్శలు వచ్చాయి. రికీ పాంటింగ్‌ కూడా ‘ఇది సరైన పద్ధతి కాదు. స్కోరింగ్‌ వేగం మరింత ఎక్కువగా ఉండాల్సింది. ఈ తరహా ఆట ఇతర బ్యాట్స్‌మెన్‌పై తీవ్ర ఒత్తిడి పెంచుతుంది’ అంటూ వ్యాఖ్యానించాడు. అయితే ఇలా ఆడటం ఇదేమీ మొదటిసారి కాదు! నిజానికి ఇదే అతని బలం కూడా. పరుగులు చేయడంలో అతని శైలే ఇది.

పుజారా విషయంలో ఇలాంటిది బ్రహ్మాండంగా పని చేస్తుంది కూడా. సుదీర్ఘ సమయం పాటు క్రీజ్‌లో పాతుకుపోయి... ప్రత్యర్థి బౌలర్లు అలసిపోయి, గతి తప్పి పేలవ బంతులు వేసే వరకు వేచి చూడటం... ఆపై పరుగులు రాబట్టడం అతనికి తెలిసిన విద్య. 2018లో జొహన్నెస్‌బర్గ్‌ టెస్టులో 50వ బంతికి తొలి పరుగు తీసిన రోజు కూడా పుజారా శైలిపై విమర్శలు రాలేదు. రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి సిరీస్‌ గెలిచినప్పుడు పుజారా ఇదే మంత్రం పఠించాడు. సిరీస్‌ మొత్తంలో అసాధారణంగా సుమారు 30 గంటల పాటు అతను బ్యాటింగ్‌ చేసిన విషయం మరచిపోవద్దు.

అతనిలో ‘దూకుడు’ లోపించిందని చెప్పడంలో అర్థం లేదు. సాధారణంగా అయితే నిలదొక్కుకోవడానికి కొంత సమయం తీసుకున్నా... ఆ తర్వాత షాట్లు ఆడుతూ లెక్క సరి చేయడం అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌ చేస్తుంటారు. అడిలైడ్‌ టెస్టులో కోహ్లి తన తొలి 80 బంతుల్లో 29 పరుగులే చేసి ఆపై కొంత జోరు పెంచాడు. అయితే పుజారాకు అలాంటి షాట్ల ‘రిస్క్‌’ విలువేమిటో బాగా తెలుసు. శనివారం భారత జట్టు ఉన్న స్థితిలో అలాంటి రిస్క్‌లు కూడా అనవసరమని అతను భావించినట్లున్నాడు. అన్నింటికి మించి ఫామ్‌లో ఉన్న ముగ్గురు అత్యుత్తమ పేసర్లను అతను ఎదుర్కొంటున్నాడు.

పిచ్‌ భిన్నంగా స్పందిస్తోంది. ఎన్ని ఎక్కువ బంతులు ఆడితే అన్ని ఎక్కువ పరుగులు చేసే అవకాశం తనకు పెరుగుతుందని అతను అనుకున్నాడు. అన్నింటికి మించి తన సహచరుల బ్యాటింగ్‌ బలంపై కూడా అతనికి అంచనా ఉంది. టెస్టు క్రికెట్‌లో సుమారు 31 వేల బంతులు ఆడిన పుజారాకు తనకు ఏది బాగా పని చేస్తుందో తెలీదా! చివరకు అతను భయపడినట్లే జరిగింది. కమిన్స్‌ వేసిన ఒక అద్భుత బంతికి పుజారా వెనుదిరిగాక జట్టు ఒక్కసారిగా కుప్పకూలింది. అతను కూడా పట్టుదలగా నిలబడకుండా వేగంగా ఆడితే చాలనే భావనలో వెళితే అసలు ఈ మాత్రం స్కోరైనా వచ్చేదా! జట్టు పేలవ ఇన్నింగ్స్‌లో అత్యధిక బంతులు ఎదుర్కోగలిగిన బ్యాట్స్‌మెన్‌ అని చూడకుండా రహానేపై ఒత్తిడి పెరిగి అవుట్‌ కావడానికి కారణమయ్యాడని, అతని ఆట శైలి కారణంగానే విహారి కూడా రనౌట్‌ అయ్యాడని విమర్శించడంలో ఏమాత్రం అర్థం లేదు.

నేను బాగా ఆడుతున్న సమయంలో ఒక మంచి బంతికి అవుటయ్యాను. నాకు తెలిసిన శైలిలోనే నేను బ్యాటింగ్‌ చేస్తాను. అంతకంటే మెరుగ్గా నేను ఏమీ చేయలేను. కమిన్స్‌ వేసిన ఆ బంతి ఈ సిరీస్‌లోనే అత్యుత్తమమైంది. నేను ఆడక తప్పని పరిస్థితి. మనది కాని రోజు చిన్న తప్పులు కూడా పెద్దవిగా కనిపిస్తాయి.
పుజారా, భారత బ్యాట్స్‌మన్‌

>
మరిన్ని వార్తలు