'నాన్నకు దెబ్బ ఎక్కడ తగిలితే అక్కడ ముద్దిస్తా'

21 Jan, 2021 18:03 IST|Sakshi

ముంబై: ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అందరికంటే ఎక్కువ బంతులు ఎదుర్కొన్న ఆటగాడిగా చతేశ్వర్‌ పుజారా వరుసగా రెండోసారి రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే. ఆసీస్‌ బౌన్సీ పిచ్‌ల‌పై అంత సేపు క్రీజులో ఉండ‌టం అంటే మాట‌లు కాదు. పేసర్ల నుంచి వేగంగా దూసుకొచ్చే బంతులు.. ఎక్క‌డ గాయాలు చేస్తాయోన‌న్న ఆందోళ‌న బ్యాట్స్‌మెన్లలో క‌నిపిస్తుంది. కానీ పుజారా మాత్రం ఆ గాయాల‌కు తాను అల‌వాటు ప‌డ్డట్లుగా కనిపించాడు.

ముఖ్యంగా బ్రిస్బేన్‌ వేదికగా జరిగిన నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ బౌలర్లను ఎదుర్కొంటూ ఒళ్లు హూనం చేసుకున్నాడు. మ్యాచ్‌ను పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతో వికెట్ కాపాడుకుంటూ ఒంటికి ఎన్ని దెబ్బ‌లు త‌గిలినా త‌ట్టుకున్నాడు. క‌మిన్స్‌, హాజిల్‌వుడ్ వేసిన బంతులు ఒళ్లంతా గాయాలు చేస్తున్నా చెక్కు చెద‌ర‌ని ఏకాగ్ర‌త‌తో బ్యాటింగ్ కొనసాగించాడు. కాగా చివ‌రి రోజు ఆట‌లో క‌నీసం12సార్ల‌యినా బంతి పుజారా శ‌రీరాన్ని బలంగా తాకింది. తాజాగా ఆసీస్‌పై టెస్టు సిరీస్‌ విజయం తర్వాత టీమిండియాకు స్వదేశంలో ఘనమైన స్వాగతం లభించింది. ఆటగాళ్లు ఎవరు ఇంటికి వారు వెళ్లిపోయాకా.. ఇంట్లోవారు కూడా వారికి ఘనమైన స్వాగతం పలికారు. చదవండి: సీఏదే తప్పు.. గబ్బాలో మొదటి టెస్టు 


అలా పుజారా  రెండేళ్ల ముద్దుల కూతురు అతిధి కూడా ఆమె తం‍డ్రికి ఘనస్వాగతం పలికింది. 'మా నాన్నకు అయిన గాయాలు మాన్పించడానికి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. ఎక్కడ దెబ్బలు తగిలాయో అక్కడ ముద్దిస్తా.. దీంతో మా నాన్నకు గాయాల నొప్పి తగ్గిపోతుంది' అంటూ ముసిముసి మాటలు పలికింది. ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదే విషయమై పుజారా స్పందిస్తూ.. త‌న కూతురు ఎప్పుడు కింద ప‌డినా తానూ అలాగే చేస్తానని తెలిపాడు. అందుకే ఆసీస్‌ సిరీస్‌తో గాయాలతో ఇంటికి వచ్చానని తెలుసుకున్న నా కూతురు నాకు అలాగే చేసింది. ముద్దు ఏ గాయాన్ని అయినా మాన్పుతుంద‌ని త‌న కూతురు అనుకుంటున్నట్లు సంతోషంతో పేర్కొన్నాడు. కాగా పుజారా ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో  8 ఇన్నింగ్స్‌లు కలిపి 271 పరుగులు చేశాడు.

మరిన్ని వార్తలు