IND Vs AUS: ఆసీస్‌తో టెస్టు సిరీస్‌.. ప్రాక్టీస్‌ జోరు పెంచిన పుజారా

1 Feb, 2023 13:30 IST|Sakshi

టీమిండియా టెస్టు స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజారా ప్రాక్టీస్‌లో వేగం పెంచాడు. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ టెస్టు సిరీస్‌ సందర్భంగా పుజారా.. ఇండియా జెర్సీని ధరించి గ్రౌండ్‌లో తన ప్రాక్టీస్‌ను మొదలుపెట్టాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను పుజారా స్వయంగా ట్విటర్‌లో పంచుకున్నాడు. ''గెట్టింగ్‌ రెడీ ఫర్‌ ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా సిరీస్‌'' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. 

టీమిండియా టెస్టు జట్టులో కీలక ఆటగాడైన పుజారా గతేడాది ఐదు టెస్టులు కలిపి 10 ఇన్నింగ్స్‌లు ఆడి 45.44 సగటుతో 409 పరుగులు చేశాడు. వాటిలో ఒక సెంచరీ, మూడు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. కాగా గతేడాది డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సెంచరీ సాధించి.. 1400 రోజుల నిరీక్షణకు తెరదించాడు.

ఇక బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో పుజారా ఇప్పటివరకు 20 మ్యాచ్‌ల్లో 37 ఇన్నింగ్స్‌లు ఆడిన పుజారా 54.08 సగటుతో 1893 పరుగులు చేశాడు. అందులో ఐదు సెంచరీలు, 10 అర్ధసెంచరీలు ఉన్నాయి. అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 204 పరుగులుగా ఉన్నది. ఈ సిరీస్‌లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆరో బ్యాటర్‌గా పుజారా నిలిచాడు.

ఇక తొలి టెస్టు నాగ్‌పూర్‌ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు, రెండో టెస్టు ఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు, మూడో టెస్టు ధర్మశాల వేదికగా మార్చి 1 నుంచి 5 వరకు, నాలుగో టెస్టు అహ్మదాబాద్‌ వేదికగా మార్చి 9 నుంచి 13 వరకు జరగనున్నాయి. అనంతరం మూడు వన్డే మ్యాచ్‌లు మార్చి 17, 19, 22 తేదీల్లో జరగనున్నాయి. 

బోర్డర్‌-గావస్కర్‌ టెస్టు సిరీస్‌ టీమిండియాకు కీలకం కానుంది. ఇప్పటికే డబ్ల్యూటీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంది. ఆసీస్‌తో సిరీస్‌ను టీమిండియా 3-1తో గెలిస్తే టీమిండియా ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడే చాన్స్‌ ఉంటుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 10 టెస్టుల్లో గెలుపు, ఒక ఓటమి, నాలుగు డ్రాలతో కలిపి 75.56 పర్సంటైల్‌ పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. ఐదు టెస్టుల్లో గెలుపు, నాలుగింటిలో ఓటమి, ఒక డ్రాతో కలిపి 58.93 పర్సంటైల్‌ పాయింట్లతో టీమిండియా రెండో స్థానంలో ఉంది.

చదవండి: 'అదంతా అబద్ధం.. డబ్బు నాకు ముఖ్యం కాదు'

IND Vs AUS: భారత్‌తో టెస్టు సిరీస్‌.. ఫ్లైట్‌ మిస్సయిన ఆసీస్‌ క్రికెటర్‌

మరిన్ని వార్తలు