'ఐపీఎల్‌లో ఆడనందుకు నాకు బాధ లేదు'

8 Sep, 2020 21:45 IST|Sakshi

ముంబై : చటేశ్వర్‌ పుజార.. పరిచయం అక్కర్లేని పేరు. టీమిండియా టెస్టు క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన ఆటగాడు. ఇప్పటితరంలో అద్భుతమైన స్ట్రోక్‌ ప్లే కలిగిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. టెస్టుల్లో రెగ్యులర్‌ సభ్యుడిగా ఉన్న పుజార పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. దీంతో టీ20 పనికిరాడంటూ కేవలం టెస్టులకు మాత్రమే పరిమితం చేసింది. ఈ అంశమే అతన్ని టీ20తో పాటు ఐపీఎల్‌కు దూరం చేసింది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్‌ వేలంలో పుజారను ఏ ఐపీఎల్‌ జట్టు కూడా కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదు. దీంతో వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలాడు. తాజాగా ఐపీఎల్‌ వేలంలో తనను ఎవరు కొనుగోలు చేయకపోవడంపై చటేశ్వర్‌ పుజార మరోసారి స్పందించాడు. 

'నేను ఐపీఎల్‌ 2020 వేలంలో అమ్ముడుపోనందుకు ఏం బాధ లేదు. ఐపీఎల్‌కు ఆడలేకపోతున్నా అనే ఫీలింగ్‌ కూడా లేదు. ఎందుకంటే టీ20ల్లో నాకంటే బాగా ఆడేవాళ్లు చాలా మందే ఉన్నారని.. అందులో వరల్డ్‌ క్లాస్‌ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్న హషీమ్‌ ఆమ్లా లాంటి ఆటగాడు కూడా అమ్ముడుపోని ఆటగాడిగానే మిగిలాడు. ఆమ్లాలా ఇంకా ఎందరో ఉన్నారు.. అందులో నేను ఒకడిని. మేము ఐపీఎల్‌లో ఆడడం లేదన్న ఈగో ఫీలింగ్‌ లేదు. నా ప్రదర్శనతో నేను సంతోషంగా ఉన్నా. ఇప్పటికి అవకాశమొస్తే అన్ని ఫార్మాట్లలో ఆడేందుకు సిద్ధంగా ఉన్నా.. కానీ నన్ను ఒక టెస్టు ప్లేయర్‌గా మాత్రమే  గుర్తించారు. దానికి నేను కూడా ఏం చేయలేను. 

టీమిండియాలో నాతో పాటు ఆడే ఆటగాళ్లు ప్రతీసారి ఐపీఎల్‌లో బిజీగా ఉంటే బీసీసీఐ అనుమతితో నేను మాత్రం ఇంగ్లండ్‌ వెళ్లి కౌంటీ క్రికెట్‌లో పాల్గొనేవాడిని. కరోనా కారణంగా ఈసారి ఆ అవకాశం లేకుండా పోయింది. కౌంటీలో ఆడడం లేదని కొంచెం నిరుత్సాహంగానే ఉన్నా. టీమిండియా తరపున టెస్టుల్లో జట్టుకు ఎన్నో విజయాలు సాధించిపెట్టా. అశేషమైన భారత అభిమానుల మద్దతుతో మ్యాచ్‌లు గెలవడం కన్నా ఇంకా గొప్ప అనుభూతి ఏం ఉంటుంది చెప్పండి. టెస్టుల ద్వారా ఇప్పటికే చాలాసార్లు చూశా. ఐపీఎల్‌లో సాధించే విజయం కన్నా దేశంకోసం సాధించే విజయంలో ఎక్కువ ఆనందం ఉంటుంది. దాన్ని ఎవరు కాదనలేరు' అంటూ చెప్పుకొచ్చాడు. టెస్టు క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన పుజార 77 టెస్టులాడి 6వేలకు పైగా పరుగులు సాధించాడు. ఇందులో మొత్తం 18 సెంచరీలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు