Asia Cup 2022: ఇప్పటికే మునిగారు.. ఇకనైనా జాగ్రత్త పడండి

7 Sep, 2022 18:28 IST|Sakshi

ఆసియా కప్‌ 2022లో టీమిండియా సూపర్‌-4 దశలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడి దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించింది. వాస్తవానికి పాకిస్తాన్‌, శ్రీలంకతో మ్యాచ్‌లో టీమిండియా ఓడింది అంటే బౌలర్ల వైఫల్యం, ఫేలవ ఫీల్డింగ్‌ వల్లే అని చెప్పొచ్చు. అంతేకాదు ఆల్‌రౌండర్‌ జడేజా లేని లోటు కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే టీమిండియా టెస్టు స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈఎస్‌పీఎన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పుజారా మాట్లాడాడు.

''ఆసియాకప్‌ టోర్నమెంట్‌లో టీమిండియాకు ప్రస్తుత కాంబినేషన్ సరిగ్గా పని చేయడం లేదు. జట్టుకు మరో బౌలింగ్ ఆల్‌రౌండర్ అవసరం. రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్‌ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకుంటునే మంచిది. లెగ్‌ స్పిన్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ పరుగులు చేయగల సమర్థుడు.ఇప్పటికే మునిగాం.. ఇకనైనా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కనీసం అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో గెలిస్తే విజయంతో టోర్నీని ముగించినట్లు అవుతుంది.

ఇక రిషబ్‌ పంత్‌ స్థానంలో దినేశ్‌ కార్తిక్‌కు అవకాశం ఇవ్వాల్సిందే. బహుశా టి20 ప్రపంచకప్‌ తర్వాత దినేశ్‌ కార్తిక్‌ క్రికెట్‌ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి జట్టులో ఉన్నప్పుడే అతనికి అవకాశాలు ఇవ్వడం సమజసం.  హార్దిక్ పాండ్యా బాగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ.. పేస్ ఆల్ రౌండర్‌ను పూర్తి కోటా బౌలింగ్ వేసేలా అన్ని టైంలలో ప్రయోగించలేము. ఇక 6 నుంచి 15 ఓవర్ల మధ్య సరిగ్గా బ్యాటింగ్‌ చేయలేకపోతుంది. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో చాలా వికెట్లు కోల్పోతుంది. ఇక స్లాగ్‌ ఓవర్లలో 15 నుంచి 20 ఓవర్ల వరకు సరైన బ్యాటర్లు లేరు. కాబట్టి దానిని గుర్తించాల్సిన అవసరం ఉంది'' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: పాక్‌ కెప్టెన్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లిన స్టార్‌ ఓపెనర్‌

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న భారత్‌.. ఆవేశ్‌ స్థానంలో చాహర్‌ ఎంట్రీ..!

మరిన్ని వార్తలు