క్రికెటర్‌ అవ్వాలని కలలు కన్నాడు.. పేదరికం అడ్డొచ్చింది.. అయితేనేం.. అంతర్జాతీయ క్రీడాకారుల్నే తయారు చేస్తూ..

28 Dec, 2022 09:17 IST|Sakshi

కలలను సాకారం చేసుకుంటున్న క్రికెట్‌ కోచ్‌ సుబ్బు 

ఎంతో ఇష్టమైన క్రికెట్‌లో రాణించాలని కలలు కన్నాడు. మైదానంలో ఫోర్లు, సిక్సర్లతో మోత మోగించాలని, దేశానికి పేరు తేవాలని పదేపదే పరితపించాడు. అయితే టాలెంట్‌ ఉన్నా పేదరికం అడ్డొచ్చింది. ఆటపై ఉన్న మక్కువ పేదరికాన్ని జయించేలా చేసింది. తాను ఆడలేని క్రికెట్‌ను పదిమందితో ఆడించాలని భావించాడు. అభినవ ద్రోణాచార్యలా మారాడు. ఎందరికో అంతర్జాతీయస్థాయిలో తర్ఫీదునిస్తూ తన కలలను సాకారం చేసుకుంటున్నాడు చింతూరుకు చెందిన పాసర్లపూడి సుబ్రహ్మణ్యం అలియాస్‌ సుబ్బు. 

సాక్షి, అల్లూరి సీతారామరాజు(చింతూరు): క్రికెట్‌లో ఎంతోమందికి తర్ఫీదునిస్తూ వారి ఉన్నతికి బాటలు వేస్తున్నాడు చింతూరుకు చెందిన పాసర్లపూడి సుబ్రహ్మణ్యం అలియాస్‌ సుబ్బు. పేదరికం కారణంగా మధ్యలోనే ఆటకు స్వస్తి పలికిన సుబ్బు తన కలల సాకారానికి అడ్డొచ్చిన పేదరికాన్ని  అసహ్యించుకోలేదు.  తాను సాధించలేనిది తన శిక్షణతో పలువురిని ఆటలో తీర్చిదిద్దేందుకు నడుం బిగించాడు. ఖర్చుతో కూడుకున్నదైనా క్రికెట్‌ అకాడమీని ఏర్పాటు చేసి పలువురు చిన్నారులకు శిక్షణ ఇస్తున్నాడు. వారు మెరుగైన అవకాశాలు అందిపుచ్చుకునేలా చేస్తున్నాడు.  

స్థానికంగానే చదువు.. 
సుబ్బు తండ్రి సత్యనారాయణ వడ్రంగి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తుండగా సబ్బు చింతూరులో ఇంటర్‌ వరకు చదివాడు. చిన్నప్పటి నుంచి క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న అతను స్థానికంగా జరిగే టోర్నమెంట్లలో ఆడుతూ మంచి నైపుణ్యం సాధించాడు. అదే సమయంలో అకాడమీలో చేరి క్రికెట్‌లో ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆశించాడు. అతనికి పేదరికం అడ్డురావడంతో ఆశయానికి బ్రేక్‌పడింది.

అనంతరం భద్రాచలంలో డిగ్రీలో చేరిన సుబ్బు  2010 నుంచి 2014 వరకు ఐదేళ్లపాటు చిన్నారులకు క్రికెట్‌లో కోచింగ్‌ ఇచ్చాడు. 2015 నుంచి 2016 వరకు హైదరాబాద్‌లోని సెయింట్‌జోన్స్‌ క్రికెట్‌ అకాడమీలో కోచ్‌గా పనిచేశాడు. 2016లో హైదరాబాద్‌లో ఎరీనా ఎలైట్‌ కోచింగ్‌ సెంటర్‌ ప్రారంభించి 2020 వరకు ఎందరో చిన్నారులకు క్రికెట్‌ ఓనమాలు నేర్పాడు. అనంతరం 2020లో తిరిగివచ్చిన ఆయన శ్రీ భద్రాద్రి క్రికెట్‌ అకాడమి పేరుతో సంస్థను నెలకొల్పాడు. ప్రస్తుతం అదే పేరుతో 30 మంది చిన్నారులకు కోచింగ్‌ ఇస్తున్నాడు.  

రాణించిన త్రిష 
భద్రాచలంకు చెందిన గొంగడి త్రిష 2010 నుంచి 2014 వరకు భద్రాచలంలో సుబ్బు కోచింగ్‌లో క్రికెట్‌లో ఓనమాలు నేర్చుకుంది. దీంతో త్రిష హైదరాబాద్‌ జట్టుతో పాటు ఇండియా అండర్‌–16, అండర్‌–19 జట్లకు ఎంపికైంది. అనంతరం నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సీఏ)కు ఎంపికై మరిన్ని మెళకువలు నేర్చుకుంది.  ఇటీవల  అండర్‌–19 మహిళా జట్టు తరఫున శ్రీలంక, వెస్టిండీస్, న్యూజిలాండ్‌ సిరీస్‌లో రాణించడం ద్వారా అండర్‌–19 వరల్డ్‌కప్‌లో పాల్గొనే భారత్‌ మహిళా జట్టుకు ఎంపికైంది. ఇదే బాటలో     మరెందరో చిన్నారులు సుబ్బు కోచింగ్‌లో    రాటుదేలుతున్నారు.  ఉన్నత అవకాశాల కోసం వారంతా ఎదురు చూస్తున్నారు.  

భారత్‌ జట్టులో ఆడాలనుకున్నా  
చిన్నతనం నుంచి క్రికెట్‌ అంటే ఎంతో ఇష్టం. ఎప్పటికైనా ఇండియా జట్టు తరఫున ఆడాలనుకున్నా. అనివార్య కారణాలతో ఆటను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఎంతో ఇష్టమైన ఆటను వదల్లేక కోచ్‌గా బాధ్యతలు చేపట్టి చిన్నారులకు శిక్షణ ఇస్తున్నాను. నా కోచింగ్‌లో రాటుదేలిన త్రిష ఇండియా జట్టుకు ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉంది. నా కళ ఇలా సాకారం చేసుకుంటున్నా. 
–పాసర్లపూడి సుబ్రహ్మణ్యం, క్రికెట్‌ కోచ్, చింతూరు 

మరిన్ని వార్తలు