IPL Auction: క్రిస్‌ మోరిస్‌ కొత్త రికార్డు

19 Feb, 2021 01:24 IST|Sakshi

వేలంలో రూ. 16.25 కోట్లు పలికిన ఆల్‌రౌండర్‌ 

మ్యాక్స్‌వెల్‌కు రూ.14.25 కోట్లు

ఐపీఎల్‌–2021 వేలంలో విదేశీ ఆటగాళ్ల పంట పండింది. ఇప్పటికే నాలుగు వేర్వేరు ఫ్రాంచైజీలకు ఆడిన క్రిస్‌ మోరిస్‌ రూ. 16.25 కోట్లకు అమ్ముడుపోయి కొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌ చరిత్రలో వేలంలో ఒక ఆటగాడికి పలికిన అత్యధిక ధర ఇదే కావడం విశేషం. బెంగళూరు జట్టు ఇద్దరు ఆటగాళ్ల కోసం ఏకంగా రూ. 29.25 కోట్లు వెచ్చించడం మరో చెప్పుకోదగ్గ అంశం. ఆస్ట్రేలియా హిట్టర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ రూ. 14.25 కోట్ల విలువ పలుకగా, న్యూజిలాండ్‌కు చెందిన పేస్‌ బౌలర్‌ కైల్‌ జేమీసన్‌ ఏకంగా రూ. 15 కోట్లు అందుకోనున్నాడు. ఆసీస్‌ పేసర్‌ జాయ్‌ రిచర్డ్సన్‌ను సొంతం చేసుకునేందుకు పంజాబ్‌ టీమ్‌ రూ.14 కోట్లు ఖర్చు చేసింది. వేలంలో ఈ నలుగురు క్రికెటర్లే రూ. 10 కోట్లకంటే ఎక్కువ ధర పలికారు.

చెన్నై:  ఎప్పటిలాగే ఐపీఎల్‌ వేలం అంచనాలకు భిన్నంగా అనూహ్యంగా సాగింది. కచ్చితంగా భారీ ధర పలకగలరని భావించిన ఆటగాళ్లను ఫ్రాంచైజీలు పట్టించుకోకపోగా, అనామకులుగా కనిపించిన మరికొందరు మంచి విలువతో లీగ్‌లోకి దూసుకొచ్చారు. మరికొందరు ఆటగాళ్ల స్థాయి, సామర్థ్యం, గత రికార్డులను పరిగణనలోకి తీసుకుంటే ఆశించిదానికంటే చాలా ఎక్కువ మొత్తం లభించింది. దాదాపు అన్ని జట్లు వారి వ్యూహాలకు తగినట్లుగా ఆటగాళ్లను కొనసాగించడంతో మిగిలిన ఖాళీల కోసం, ఒక్క ఐపీఎల్‌ – 2021 కోసం మాత్రమే వేలం జరిగింది. 2015లో యువరాజ్‌ సింగ్‌ నెలకొల్పిన రికార్డు ధర (రూ. 16 కోట్లు– ఢిల్లీ)ని ఇప్పుడు మోరిస్‌ బద్దలు చేయడం విశేషం.  

ఐపీఎల్‌–2021 వేలం విశేషాలు చూస్తే...
► గత ఏడాది క్రిస్‌ మోరిస్‌కు బెంగళూరు రూ. 10 కోట్లు చెల్లించింది. వేలానికి ముందు అతడిని విడుదల చేసిన జట్టు ఆశ్చర్యకరంగా తాజా వేలంలో ఒక దశలో మోరిస్‌కు రూ. 9.75 కోట్ల వరకు చెల్లించేందుకు సిద్ధం కావడం విశేషం. రూ. 10 కోట్లు దాటిన తర్వాత కూడా ముంబై, పంజాబ్‌ మోరిస్‌ కోసం ప్రయత్నించగా, చివరకు రాజస్తాన్‌ అతడిని తీసుకుంది. 2020 ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరఫున 5 ఇన్నింగ్స్‌లలో కలిపి 34 పరుగులు చేసిన మోరిస్‌... 6.63 ఎకానమీతో 11 వికెట్లు తీశాడు.  

► 6.8 అడుగుల పొడగరి అయిన కివీస్‌ పేసర్‌ కైల్‌ జేమీసన్‌ అనూహ్యంగా భారీ ధర పలికాడు. గత ఏడాది భారత్‌పై కివీస్‌ టెస్టు సిరీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన అతని కోసం ఆర్‌సీబీ మొదటినుంచీ పోటీ పడింది. చివరి క్షణంలో పంజాబ్‌ తప్పుకోవడంతో జేమీసన్‌ బెంగళూరు సొంతమయ్యాడు.  

► మ్యాక్స్‌వెల్‌ కోసం చివరి వరకు చెన్నై, బెంగళూరు తీవ్రంగా పోటీ పడ్డాయి. రూ.4.40 కోట్లనుంచి ఈ రెండు జట్లూ అతడిని సొంతం చేసుకునేందుకు విలువ పెంచుకుంటూ పోయాయి. చివరకు ఆర్‌సీబీ అతడిని సొంతం చేసుకుంది. గత ఏడాది పంజాబ్‌ అతనికి రూ. 10.75 కోట్లు చెల్లించగా... ఘోరంగా విఫలమైన తర్వాత కూడా మ్యాక్సీ విలువ పెరగడం విశేషం. గత ఐపీఎల్‌లో మ్యాక్స్‌వెల్‌ 11 ఇన్నింగ్స్‌లలో కలిపి 108 పరుగులే చేయగలిగాడు. అతని స్ట్రైక్‌రేట్‌ కూడా అతి పేలవంగా 101.88గా మాత్రమే ఉంది.  

► బిగ్‌బాష్‌ లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాయ్‌ రిచర్డ్సన్‌ కోసం సాగిన వేలం అందరినీ ఆశ్చర్యపరచింది. 9 అంతర్జాతీయ టి20లే ఆడిన అతని రికార్డు గొప్పగా లేకపోయినా భారీ విలువ పలికాడు. రూ.13.25 కోట్ల వరకు పోటీ పడిన ఆర్‌సీబీ చివరకు తప్పుకుంది.

► ఆస్ట్రేలియా తరఫున ఒక్క మ్యాచ్‌ కూడా ఆడని పేస్‌ బౌలర్‌ రిలీ మెరిడిత్‌ కోసం పంజాబ్‌ ఏకంగా రూ. 8 కోట్లు ఖర్చు చేయడం విశేషం.  
 

► వేలంకు ముందు ఒకే ఒక విదేశీ ఆటగాడి స్థానం ఖాళీగా ఉన్న చెన్నై, మొయిన్‌ అలీని ఎలాగైనా తీసుకునేందుకు సిద్ధమైంది. పంజాబ్‌తో పోటీ పడి ఆ జట్టు ఇంగ్లండ్‌ ఆఫ్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ను భారీ మొత్తానికి ఎంచుకుంది.  

► వరల్డ్‌ నంబర్‌వన్‌ టి20 బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మలాన్‌ను పంజాబ్‌ కేవలం రూ.1.50 కోట్లకే దక్కించుకుంది.  

► రూ. 12.50 కోట్ల విలువతో గత ఐపీఎల్‌ వరకు రాజస్తాన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆస్ట్రేలియా స్టార్‌ స్టీవ్‌ స్మిత్‌ను  ఢిల్లీ కేవలం రూ. 2.20 కోట్లకే సొంతం చేసుకుంది.  

► ఆస్ట్రేలియా వన్డే, టి20 కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ను రూ. 1 కోటి కనీస ధరకు కూడా ఎవరూ పట్టించుకోలేదు.  
 

► గత ఐపీఎల్‌లో రూ. 8.5 కోట్లు పలికిన విండీస్‌ పేసర్‌ షెల్డన్‌ కాట్రెల్‌ను ఎవరూ ఎంచుకోలేదు.  

► వేలంలో అందరికంటే చివరగా వచ్చిన పేరు అర్జున్‌ టెండూల్కర్‌. కనీస ధర రూ. 20 లక్షలు ముంబై బిడ్డింగ్‌ చేయగా మరే జట్టూ స్పందించలేదు. దాంతో అతను తన తండ్రి మెంటార్‌గా ఉన్న జట్టులోకి వచ్చేశాడు.

 విహారికి నిరాశ...
ఆసీస్‌ పర్యటనలో ఆకట్టుకున్న ఆంధ్ర బ్యాట్స్‌మన్‌ హనుమ విహారికి ఈ సారి కూడా ఐపీఎల్‌ అవకాశం దక్కలేదు. రూ. 1 కోటి కనీస విలువతో అతను వేలంలోకి రాగా, ఏ జట్టూ తీసుకోలేదు. భారత సీనియర్‌ టీమ్‌ సభ్యులలో లీగ్‌ అవకాశం దక్కనిది ఒక్క విహారికే! రెండో సారి అతని పేరు వచ్చినప్పుడు కూడా ఫ్రాంచైజీలు స్పందించలేదు.  

మళ్లీ ఐపీఎల్‌లో పుజారా
భారత టెస్టు స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజారాకు ఎట్టకేలకు ఐపీఎల్‌ అవకాశం దక్కింది. అతని కనీస ధర రూ.50 లక్షలకు చెన్నై సొంతం చేసుకుంది. 2014 తర్వాత పుజారా ఐపీఎల్‌లోకి రావడం ఇదే తొలిసారి. పుజారాను చెన్నై ఎంపిక చేసుకున్న సమయంలో వేలంలో పాల్గొంటున్న అన్ని ఫ్రాంచైజీల సభ్యులందరూ చప్పట్లతో తమ సంతోషాన్ని ప్రకటించడం విశేషం!

ఉమేశ్‌కు రూ. 1 కోటి మాత్రమే...
భారత సీనియర్‌ పేస్‌ బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌పై ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. అతని బేస్‌ ప్రైస్‌కే చివరకు ఢిల్లీ తీసుకుంది.  

గౌతమ్‌కు రికార్డు మొత్తం
భారత్‌కు ప్రాతినిధ్యం వహించని అన్‌క్యాప్డ్‌ ఆటగాళ్లలో కృష్ణప్ప గౌతమ్‌కు బంగారు అవకాశం లభించింది. భారత ఆఫ్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అవసరం ఉన్న చెన్నై ఎలాగైనా సొంతం చేసుకునేందుకు ప్రయత్నించడంతో పోటీ పెరిగింది. హైదరాబాద్‌ రూ. 9 కోట్ల వరకు తీసుకు రాగా, చివరకు అతను చెన్నై చేరడంతో ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక మొత్తం పలికిన అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా గౌతమ్‌ నిలిచాడు. ముస్తాక్‌ అలీ ట్రోఫీలో 37 బంతుల్లో సెంచరీ చేసిన మొహమ్మద్‌ అజహరుద్దీన్‌ను రూ. 20 లక్షలకే బెంగళూరు ఎంచుకుంది.  
 

షారుఖ్‌ ఖాన్‌ను కొన్న ప్రీతి జింటా!
తమిళనాడు జట్టు ముస్తాక్‌ అలీ ట్రోఫీని గెలవడంలో కీలక పాత్ర పోషించిన హిట్టర్‌ షారుఖ్‌ ఖాన్‌పై అందరి ఆసక్తి కనిపించింది. రూ. 20 లక్షల కనీస ధరనుంచి ఢిల్లీ బిడ్డింగ్‌ మొదలు పెట్టగా, ఆర్‌సీబీ దానిని రూ. 5 కోట్ల వరకు తీసుకెళ్లింది. చివరకు అతను రూ.5.25 కోట్లకు పంజాబ్‌ జట్టు సొంతం చేసుకుంది.

ముగ్గురిని మాత్రమే...
గురువారం జరిగిన వేలంలో సన్‌రైజర్స్‌ టీమ్‌ కేదార్‌ జాదవ్‌ (రూ. 2 కోట్లు), ముజీబ్‌ ఉర్‌ రహమాన్‌ (రూ.1.50 కోట్లు), జె.సుచిత్‌ (రూ. 30 లక్షలు)లను మాత్రమే తీసుకుంది. టీమ్‌లో ఈ సారి హైదరాబాద్‌కు చెందిన ఒక్క ఆటగాడు కూడా లేడు.  

వేలంలో ఆంధ్ర జట్టుకు చెందిన కేఎల్‌ భరత్‌ (రూ.20 లక్షలు – బెంగళూరు), హరిశంకర్‌ రెడ్డి (రూ. 20 లక్షలు – చెన్నై), హైదరాబాద్‌ జట్టునుంచి కె. భగత్‌ వర్మ (రూ. 20 లక్షలు – చెన్నై) ఎంపికయ్యారు.  


►  కైల్‌ జేమీసన్‌ (రూ. 15 కోట్లు – బెంగళూరు)
►  మ్యాక్స్‌వెల్‌ (రూ. 14.25 కోట్లు – బెంగళూరు)  
►  జాయ్‌ రిచర్డ్సన్‌ (రూ. 14 కోట్లు – పంజాబ్‌)
►  కృష్ణప్ప గౌతమ్‌ (రూ. 9.25 కోట్లు – చెన్నై)
►  రిలీ మెరిడిత్‌ (రూ. 8 కోట్లు – పంజాబ్‌)
►  మొయిన్‌ అలీ  (రూ. 7 కోట్లు – చెన్నై)   
 

మరిన్ని వార్తలు