Cincinnati Open 2022: తొలి రౌండ్‌లోనే సెరెనాకు చుక్కెదురు

18 Aug, 2022 04:41 IST|Sakshi

సిన్సినాటి: తన టెన్నిస్‌ కెరీర్‌ చరమాంకంలో ఉందని అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌ తన ఆటతీరుతో నిరూపించింది. ఇటీవల టొరంటో ఓపెన్‌ టోర్నీలో రెండో రౌండ్‌లోనే నిష్క్రమించిన 40 ఏళ్ల సెరెనా తాజాగా సిన్సినాటి ఓపెన్‌ టోర్నీలో తొలి రౌండ్‌లోనే ఓటమి పాలైంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సెరెనా 4–6, 0–6తో బ్రిటన్‌ టీనేజర్, గత ఏడాది యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ ఎమ్మా రాడుకాను చేతిలో పరాజయం పాలైంది. యూఎస్‌ ఓపెన్‌ తర్వాత టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతానని ఇటీవల సెరెనా ఒక మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. 1995లో ప్రొఫెషనల్‌గా మారిన సెరెనా ఇప్పటివరకు 23 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ సాధించింది.

19 ఏళ్ల రాడుకానుతో జరిగిన మ్యాచ్‌లో సెరెనా రెండో సెట్‌లో ఒక్క గేమ్‌ కూడా గెలవలేకపోయింది. సెరెనాపై ఒక సెట్‌ను 6–0తో గెలిచిన పదో ప్లేయర్‌గా రాడుకాను ఘనత వహించింది. 2017లో జొహనా కొంటా (బ్రిటన్‌) చేతిలో చివరిసారి సెరెనా ఒక సెట్‌ను 0–6తో కోల్పోయింది. సిమోనా హలెప్‌ (రొమేనియా), అనాబెల్‌ మెదీనా గారిగెస్‌ (స్పెయిన్‌), వీనస్‌ విలియమ్స్‌ (అమెరికా), ప్యాటీ ష్నిదెర్‌ (స్విట్జర్లాండ్‌), జస్టిన్‌ హెనిన్‌ (బెల్జియం), జెలెనా జంకోవిచ్‌ (సెర్బియా), మేరీజో ఫెర్నాండెజ్‌ (అమెరికా), అలెక్సియా డెషామ్‌ బాలెరెట్‌ (ఫ్రాన్స్‌) కూడా సెరెనాపై ఒక సెట్‌ను 6–0తో గెలిచారు.   
 

మరిన్ని వార్తలు