Adudam Andhra: మహత్తర క్రీడా యజ్ఞం.. తొలి అడుగు విజయవంతం

13 Feb, 2024 11:32 IST|Sakshi

గ్రామస్థాయి నుంచి యువతలో క్రీడా స్ఫూర్తిని నింపుతూనే.. ఆరోగ్య విషయంలో ఆటలు ఎంత కీలకమో వివరిస్తూ.. ఆటలను జీవన శైలిలో భాగంగా మారుస్తూ.. గ్రామ, వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మట్టిలో మాణిక్యాలను వెలికితీయడం...

ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడం.. అంతటికే పరిమితంగాక.. వారిని జాతీయ, అంతర్జాతీయ వేదికపై నిలిపేందుకు జగనన్న ప్రభుత్వం చేపట్టిన బృహత్తర క్రీడా యజ్ఞం.. ‘‘ఆడుదాం ఆంధ్రా’’.

ఈ మహా క్రీడా సంబరంలో భాగంగా గ్రామ,వార్డు సచివాలయ స్థాయిలో మొత్తం 3.30 లక్షలు, మండలస్థాయిలో 1.24 లక్షలు, నియోజకవర్గస్థాయిలో 7,346, జిల్లాస్థాయిలో 1,731, రాష్ట్రస్థాయిలో 260 మ్యాచ్‌లు నిర్వహించింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం..

క్రీడాకారులకు దాదాపు రూ.37 కోట్ల విలువైన స్పోర్ట్స్ కిట్లు అందించడమే గాకుండా.. రూ.12.21 కోట్ల మేర నగదు బహుమతులు.. మరెన్నో ఆకర్షణీయమైన బహుమతులను అందించేందుకు ప్రణాళికలు రచించింది.

టాలెంట్‌ హంట్‌
రాష్ట్రస్థాయికే పరిమితం కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన క్రీడాకారులు రాణించేలా మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేసింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తో పాటు వివిధ క్రీడా విభాగాలకు సంబంధించిన అసోసియేషన్లు, ప్రో కబడ్డీ, బ్లాక్ హాక్స్ వాలీబాల్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వంటి ఫ్రాంచైజీలను టాలెంట్‌ హంట్‌కు ఆహ్వానించింది. తద్వారా ప్రతిభ గల క్రీడాకారులను ఎంపిక చేసి, వారికి శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇచ్చి, జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొనేలా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది.

మొదటి ప్రయత్నంలోనే విజయవంతం
ఇలా ఆడుదాం ఆంధ్రా ద్వారా.. వ్యాయామ ఆవశ్యకత, ఆరోగ్యపరంగా అది ఎంత కీలకమో గ్రామస్థాయి నుంచి  చైతన్యం కల్పిస్తూ. మరోవైపు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో యువ క్రీడాకారుల ప్రతిభకు సానపట్టి, క్రీడా ఆణిముత్యాలను దేశానికి అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న జగనన్న ప్రభుత్వం.. మొదటి ప్రయత్నంలోనే విజయవంతమైందని చెప్పవచ్చు.

నిదర్శనం ఇదే
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 25,40,972 మంది  క్రీడాకారులు ఈ క్రీడా యజ్ఞంలో  భాగం కావడమే ఇందుకు నిదర్శనం. ఈ పోటీలను  80 లక్షల మంది వీక్షించడం ఆడుదాం ఆంధ్రాకు దక్కిన ఆదరణకు తార్కాణం.

మేటి ఆటగాళ్లు తాము సైతం అంటూ
రాష్ట్రం నుంచి టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్న క్రికెటర్‌ కోన శ్రీకర్‌ భరత్‌, టెన్నిస్‌ స్టార్‌ సాకేత్‌ మైనేని, బ్యాడ్మింటన్‌ స్టార్‌ సాత్విక్‌ సాయిరాజ్‌, ఒలింపిక్‌ పతకాల విజేత పీవీ సింధు  వంటి  మేటి ప్లేయర్లు కూడా ఈ కార్యక్రమం ప్రాధాన్యతను వివరించడంలో భాగం కావడం విశేషం. 

ఇక మొత్తంగా 17,59,263 మంది పురుష, 7,81,709 మంది మహిళా ప్లేయర్లు ఈ క్రీడా సంబరంలో పాలుపంచుకున్నారు. కాగా ఆడుదాం ఆంధ్రా మొదటి సీజన్‌ విజయవంతంగా పూర్తవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఈ మెగా టోర్నీని నిర్వహించాలని నిర్ణయించింది. మట్టిలో మాణిక్యాలను వెలికితీసే ఈ బృహత్తర కార్యక్రమం కొనసాగేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది కూడా!

50 రోజుల పండుగ.. విశాఖలో ముగింపు వేడుకలు
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 రోజుల పాటు నిర్వహించిన ఈ ఆటల పండుగ తుది అంకానికి చేరుకుంది. విశాఖపట్నంలో ఈ మెగా టోర్నీ ముగింపు వేడుకలు మంగళవారం జరుగనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

పీఎం పాలెంలోని వైఎస్సార్‌ క్రికెట్‌ స్టేడియానికి వెళ్లి క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను ఆయన వీక్షిస్తారు. ఆ తర్వాత క్రీడాకారులు, క్రీడల ఆవశ్యకతను ఉద్దేశించి సీఎం జగన్‌ ప్రసంగిస్తారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు. ఇలా ఈ క్రీడా సంబరంలోని తొలి ఎడిషన్‌ పూర్తికానుంది.

చదవండి: ఆడుదాం ఆంధ్రా విజేతలు వీరే

whatsapp channel

మరిన్ని వార్తలు