CWG 2022: ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్విమ్మర్‌.. తొలి పతకం దక్కేనా!

30 Jul, 2022 11:23 IST|Sakshi

భారత స్టార్‌ స్విమ్మర్‌ శ్రీహరి నటరాజ్‌ కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో అదరగొట్టాడు. పురుషుల స్విమ్మింగ్‌ 100 మీ బ్యాక్‌స్ట్రోక్‌ ఈవెంట్‌లో తొలిసారి ఫైనల్లో ప్రవేశించాడు. భారత కాలమాన ప్రకారం శనివారం తెల్లవారుజామున జరిగిన 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ ఈవెంట్‌ సెమీఫైనల్‌ హాట్‌-2లో రేసును 54.55 సెకన్లలో పూర్తి చేసిన నటరాజ్‌ నాలుగో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా ఏడో ప్లేయర్‌గా ఫైనల్లో అడుగుపెట్టిన నటరాజ్‌ పతకంపై ఆశలు పెంచాడు. ఇక ఫైనల్‌ రేసు ఆదివారం జరగనుంది.

కాగా బెంగళూరుకు చెందిన నటరాజ్‌ కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో ఫైనల్‌ చేరిన నాలుగో భారత స్విమ్మర్‌గా నిలిచాడు. ఇంతకముందు 2010 కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో సందీప్‌ సెజ్వాల్‌, విరాద్వాల్‌ కాదేలు ఫైనల్‌ చేరగా.. 2018లో సాజన్‌ ప్రకాశ్‌ ఫైనల్లో అడుగుపెట్టినప్పటికి పతకాలు సాధించలేకపోయారు. మరి ఈసారైనా నటరాజ్‌ మెరిసి పతకం తెస్తాడని భారత అభిమానులు ఎదురుచూస్తున్నారు.  అయితే మరో ఇద్దరు భారత స్విమ్మర్లు విఫలమయ్యారు. సజన్‌ ప్రకాశ్‌ (50 మీ. బటర్‌ఫ్లయ్‌) హీట్స్‌లో 8వ స్థానంలో, కుశాగ్ర రావత్‌ (400 మీటర్ల ఫ్రీస్టయిల్‌) ఆఖరి స్థానంలో నిలిచి నిష్క్రమించారు.

చదవండి: Common Wealth Games 2022: కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో 14 ఏళ్ల భారత క్రీడాకారిణి సంచలనం


 

మరిన్ని వార్తలు