థర్డ్‌ అంపైర్ చీటింగ్‌.. టీమిండియా క్రికెటర్‌కు అన్యాయం

1 Oct, 2022 21:46 IST|Sakshi

ఆసియాకప్‌ మహిళల టి20 టోర్నీలో టీమిండియా మహిళలు శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. శనివారం శ్రీలంక వుమెన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా వుమెన్స్‌ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్‌ బ్యాటింగ్‌లో మెరవగా.. బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో భారత మహిళల జట్టు విజయాన్ని అందుకుంది. అయితే మ్యాచ్‌ విజయం పక్కనబెడితే.. థర్డ్‌ అంపైర్‌ చీటింగ్‌కు టీమిండియా క్రికెటర్‌ పూజా వస్త్రాకర్‌కు అన్యాయంగా బలవ్వాల్సి వచ్చింది. రనౌట్‌ కాదని క్లియర్‌గా తెలుస్తున్నప్పటికి రిప్లేలో ఔటివ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది.

ఈ ఘటన టీమిండియా ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో చోటుచేసుకుంది. అచిని కౌలసూరియా వేసిన ఓవర్‌ ఐదో బంతిని పూజా వస్త్రాకర్‌ కవర్స్‌ దిశగా ఆడింది. సింగిల్‌ పూర్తి చేసిన పూజా రెండో పరుగు కోసం ప్రయత్నించింది. పూజా క్రీజులో బ్యాట్‌ పెట్టగానే కీపర్‌ బెయిల్స్‌ను ఎగురగొట్టింది. రిప్లేలో చూస్తే పూజా క్రీజుకు చేరినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ థర్డ్‌ అంపైర్‌ మాత్రం ఔట్‌ ఇవ్వడం షాక్‌కు గురిచేసింది.

ఇది చూసిన పూజాకు కాసేపు ఏమి అర్థం కాలేదు. థర్డ్‌ అంపైర్‌ పొరపాటున ఔట్‌ ఇచ్చాడేమోనని ఎదురుచూసింది. కానీ బిగ్‌స్క్రీన్‌లో ఎలాంటి మార్పు లేదు. దీంతో నిరాశగా పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలోనూ ఆమె స్క్రీన్‌నే చూడడం గమనార్హం. కామెంటేటర్లు కూడా థర్డ్‌ అంపైర్‌ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ''ఓ మై గుడ్‌నెస్‌ ఇట్స్‌ ఔట్‌.. హౌ'' అంటూ కామెంట్‌ చేయడం స్పష్టంగా వినిపించింది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ''పూజా వస్త్రాకర్‌ రనౌట్‌ కాదని క్లియర్‌గా తెలుస్తోంది. అసలు ఏ కోశానా థర్డ్‌ అంపైర్‌ ఔట్‌ ఇచ్చాడో అర్థం కావడం లేదు.. '' అంటూ కామెంట్‌ చేశారు. కాగా పూజా వస్త్రాకర్‌ ఔటైన తీరుపై టీమిండియా మాజీ డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ స్పందించాడు. ''థర్డ్‌ అంపైర్‌ది వెరీ పూర్‌ డెసిషన్‌. రనౌట్‌ కాదని క్లియర్‌గా తెలుస్తోంది.. బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద ఔట్‌ ఇచ్చి ఉంటాడు.'' అని పేర్కొన్నాడు.

ఇక​ మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా ఉమెన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. జేమీమా రోడ్రిగ్స్‌ 53 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 76 పరుగులతో రాణించగా.. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 33 పరుగులు చేసింది. లంక బౌలర్లలో రణసింగే మూడు వికెట్లు తీయగా.. సుగంధిక కుమారి, ఆటపట్టు చెరొక వికెట్‌ తీశారు

151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు 18.2 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలింది. లంక బ్యాటర్స్‌లో హాసిని పెరీరా 30 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. హర్షితా మాధవి 26 పరుగులు చేసింది. భారత మహిళా బౌలర్లలో హేమలత మూడు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ చెరో రెండు వికెట్లు తీయగా.. రాధా యాదవ్‌ ఒక వికెట్‌ తీసింది.

చదవండి: ప్రేమలో పడ్డ పృథ్వీ షా!.. గర్ల్‌ఫ్రెండ్‌ ఎవరంటే..

జెమీమా రోడ్రిగ్స్‌ విధ్వంసం.. ఆసియాకప్‌లో టీమిండియా మహిళలు శుభారంభం

మరిన్ని వార్తలు