Commonwealth Games 2022: పసిడి పట్టు.. ఆరు పతకాలతో మెరిసిన భారత రెజ్లర్లు

6 Aug, 2022 03:52 IST|Sakshi

స్వర్ణాలు గెలిచిన బజరంగ్, సాక్షి, దీపక్‌

అన్షు మలిక్‌కు రజతం

కాంస్యాలు సాధించిన దివ్య, మోహిత్‌  

అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ భారత రెజ్లర్లు కామన్వెల్త్‌ గేమ్స్‌లో శుక్రవారం ఆరు పతకాలతో అదరగొట్టారు. స్టార్‌ రెజ్లర్లు బజరంగ్‌ పూనియా, దీపక్‌ పూనియా, సాక్షి మలిక్‌ స్వర్ణ పతకాలతో సాధించగా... అన్షు మలిక్‌ రజతం... దివ్య కక్రాన్, మోహిత్‌ గ్రెవాల్‌ కాంస్య పతకాలు సంపాదించారు. బ్యాడ్మింటన్, టేబుల్‌ టెన్నిస్‌ ఈవెంట్స్‌లోనూ భారత క్రీడాకారులు రాణించి పతకాల దిశగా మరో అడుగు ముందుకేశారు.  

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత రెజ్లర్లు మరోసారి తమ ‘పట్టు’ చాటుకున్నారు. రెజ్లింగ్‌ ఈవెంట్‌ తొలి రోజు బరిలో దిగిన ఆరు వెయిట్‌ కేటగిరీల్లోనూ పతకాలతో మెరిశారు. పురుషుల ఫ్రీస్టయిల్‌ విభాగంలో బజరంగ్‌ పూనియా (65 కేజీలు), దీపక్‌ పూనియా (86 కేజీలు) పసిడి పతకాలు సాధించగా... మోహిత్‌ గ్రెవాల్‌ (125 కేజీలు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మహిళల ఫ్రీస్టయిల్‌ విభాగంలో రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సాక్షి మలిక్‌ (62 కేజీలు) మూడో ప్రయత్నంలో కామన్వెల్త్‌ గేమ్స్‌లో బంగారు పతకాన్ని సాధించగా... అన్షు (57 కేజీలు) రజతం... దివ్య కక్రాన్‌ (68 కేజీలు) కాంస్యం సొంతం చేసుకున్నారు.  

కేవలం రెండు పాయింట్లు ఇచ్చి...
పురుషుల 65 కేజీల విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ బజరంగ్‌కు ఏదశలోనూ పోటీ ఎదురుకాలేదు. లాచ్లాన్‌ మౌరిస్‌ మెక్‌నీల్‌ (కెనడా)తో జరిగిన ఫైనల్లో బజరంగ్‌ 9–2తో గెలిచి స్వర్ణం దక్కించుకున్నాడు. తొలి రౌండ్‌లో లోవీ బింగామ్‌ (నౌరూ)పై, క్వార్టర్‌ ఫైనల్లో జీన్‌ గలియాన్‌ (మారిషస్‌)పై, సెమీఫైనల్లో జార్జి రామ్‌ (ఇంగ్లండ్‌)పై బజరంగ్‌ గెలిచాడు. స్వర్ణం గెలిచే క్రమంలో బజరంగ్‌ తన ప్రత్యర్థులకు కేవలం రెండు పాయింట్లు మాత్రమే ఇవ్వడం విశేషం.

తొలిసారి కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొన్న దీపక్‌ పూనియా ఫైనల్లో 3–0తో మొహమ్మద్‌ ఇనామ్‌ (పాకిస్తాన్‌)పై గెలిచాడు. సెమీఫైనల్లో దీపక్‌ 3–1తో అలెగ్జాండర్‌ మూర్‌ (కెనడా)పై, క్వార్టర్‌ ఫైనల్లో 10–0తో కసెబామా (సియరీ లియోన్‌)పై, తొలి రౌండ్‌లో 10–0తో మాథ్యూ ఒక్జెనామ్‌ (న్యూజిలాండ్‌)పై విజయం సాధించాడు. 125 కేజీల కాంస్య పతక పోరులో మోహిత్‌ గ్రెవాల్‌ ‘బై ఫాల్‌’ పద్ధతిలో ఆరోన్‌ జాన్సన్‌ (జమైకా)పై గెలుపొందాడు.  

సూపర్‌ సాక్షి...
మహిళల 62 కేజీల విభాగం ఫైనల్లో సాక్షి మలిక్‌ ‘బై ఫాల్‌’ పద్ధతిలో కెనడా రెజ్లర్‌ అనా పౌలా గోడినెజ్‌ను ఓడించి తొలిసారి ఈ క్రీడల్లో స్వర్ణం సాధించింది. 2014 గ్లాస్గో గేమ్స్‌లో రజతం, 2018 గోల్డ్‌కోస్ట్‌ గేమ్స్‌లో కాంస్యం నెగ్గిన సాక్షి మూడో ప్రయత్నంలో పసిడి పతకాన్ని ముద్దాడింది. ఫైనల్లో ఒకదశలో సాక్షి 0–4తో వెనుకబడింది. అయితే ఆ తర్వాత పుంజుకొని అనా పౌలా భుజాన్ని కొన్ని సెకన్లపాటు మ్యాట్‌కు అట్టిపెట్టి ‘బై ఫాల్‌’ పద్ధతిలో విజయాన్ని అందుకుంది. 57 కేజీల ఫైనల్లో అన్షు మలిక్‌ 3–7తో ఒడునాయో అడెకురోయె (నైజీరియా) చేతిలో ఓడిపోయింది. 68 కేజీల విభాగం కాంస్య పతక పోరులో దివ్య కక్రాన్‌ కేవలం 20 సెకన్లలో తన ప్రత్యర్థి టైగర్‌ లిలీ లెమాలి (టోంగా)పై గెలిచింది.

మరిన్ని వార్తలు