Commonwealth Games 2022: క్రికెట్‌లో కనకంపై గురి

7 Aug, 2022 05:58 IST|Sakshi

ఫైనల్‌ చేరిన భారత మహిళల జట్టు

సెమీస్‌లో ఇంగ్లండ్‌పై 4 పరుగులతో విజయం

బర్మింగ్‌హామ్‌: తొలిసారిగా కామన్వెల్త్‌ క్రీడల్లో ప్రవేశపెట్టిన మహిళల టి20 క్రికెట్‌లో భారత జట్టు సత్తా చాటింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరుస్తూ హర్మన్‌ప్రీత్‌ బృందం ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఫలితంగా స్వర్ణం లేదా రజత పతకం గెలుచుకోవడం ఖాయమైంది. శనివారం ఆసక్తికరంగా జరిగిన తొలి సెమీఫైనల్లో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టుపై భారత్‌ 4 పరుగుల తేడాతో గెలిచింది.

టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. స్మృతి మంధాన (32 బంతుల్లో 61; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో చెలరేగగా, జెమీమా రోడ్రిగ్స్‌ (31 బంతుల్లో 44 నాటౌట్‌; 7 ఫోర్లు) రాణించింది. మహిళల అంతర్జాతీయ టి20ల్లో భారత్‌ తరఫున వేగవంతమైన అర్ధ సెంచరీ (23 బంతుల్లో)ని స్మృతి నమోదు చేయడం విశేషం. అనంతరం ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులే చేయగలిగింది.

నాట్‌ సివర్‌ (43 బంతుల్లో 41; 2 ఫోర్లు, 1 సిక్స్‌), డానీ వ్యాట్‌ (27 బంతుల్లో 35; 6 ఫోర్లు), ఎమీ జోన్స్‌ (24 బంతుల్లో 31; 3 ఫోర్లు) రాణించారు. సివర్, జోన్స్‌ నాలుగో వికెట్‌కు 54 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్‌ సునాయాసంగా విజయం దిశగా సాగుతున్నట్లు అనిపించింది. చేతిలో 7 వికెట్లతో 17 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన స్థితిలో జోన్స్‌ రనౌట్‌ కాగా... ఆ తర్వాత 8 బంతుల్లో 14 పరుగులు చేయాల్సి ఉండగా సివర్‌ రనౌట్‌ కావడం జట్టును దెబ్బ తీసింది.

ఆఖరి ఓవర్లో గెలుపు కోసం 14 పరుగులు చేసే ప్రయత్నంలో ఇంగ్లండ్‌ 9 పరుగులు మాత్రమే రాబట్టగలిగింది. స్పిన్నర్లు స్నేహ్‌ రాణా (2/28), దీప్తి శర్మ (1/18) ప్రత్యర్థిని కట్టడి చేయడంలో సఫలమయ్యారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య రెండో సెమీఫైనల్‌ విజేతతో తుది పోరులో భారత తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం నేడు రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ఫైనల్‌ మొదలవుతుంది. కాంస్య పతక మ్యాచ్‌ మధ్యాహ్నం గం. 3:30 నుంచి జరుగుతుంది.  

అప్పుడు పతకం రాలేదు
కామన్వెల్త్‌ క్రీడల్లో గతంలో ఒకే ఒకసారి (1998; కౌలాలంపూర్‌) క్రికెట్‌ పోటీలు నిర్వహించారు. పురుషుల టీమ్‌తో వన్డే ఫార్మాట్‌లో అజయ్‌ జడేజా నాయకత్వంలో భారత్‌ బరిలోకి దిగింది. సచిన్, కుంబ్లే, లక్ష్మణ్, హర్భజన్, రాబిన్‌ సింగ్, ఎమ్మెస్కే ప్రసాద్‌ లీగ్‌ దశలో 3 మ్యాచ్‌లూ ఆడారు. గ్రూప్‌ ‘బి’లో ఉన్న భారత జట్టు... కెనడాపై గెలిచి
ఆస్ట్రేలియా చేతిలో ఓడగా, ఆంటిగ్వా అండ్‌ బార్బుడాతో జరిగిన మ్యాచ్‌లో వర్షం కారణంగా ఫలితం రాలేదు. దాంతో సెమీస్‌ చేరకుండానే టీమిండియా నిష్క్రమించింది.

మరిన్ని వార్తలు