Commonwealth Games 2022: బ్యాడ్మింటన్, టీటీలో జోరు

30 Jul, 2022 02:48 IST|Sakshi

 క్రికెట్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి  

కామన్వెల్త్‌ క్రీడల తొలి రోజు భారత్‌ ప్రదర్శన

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ క్రీడల్లో మొదటి రోజు భారత ఆటగాళ్ల ప్రదర్శన అంచనాలకు అనుగుణంగానే సాగింది. బలహీన జట్లపై భారత బ్యాడ్మింటన్, టేబుల్‌ టెన్నిస్‌ టీమ్‌లు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించగా... హాకీలోనూ ఘన విజయం దక్కింది. ఊహించినట్లుగానే స్విమ్మింగ్, సైక్లింగ్‌వంటి క్రీడల్లో మనోళ్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఓవరాల్‌గా ఆస్ట్రేలియా అగ్ర స్థానంతో రోజును ముగించింది.

భారత్‌ ఫలితాలు
మహిళల క్రికెట్‌: తొలిసారి కామన్వెల్త్‌ క్రీడల్లో ప్రవేశపెట్టిన మహిళల క్రికెట్‌లో భారత్‌కు తొలి మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది. ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ముందుగా భారత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (34 బంతుల్లో 52; 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ సాధించగా, షఫాలీ వర్మ (33 బంతుల్లో 48; 9 ఫోర్లు) కూడా దూకుడుగా ఆడింది. అనంతరం ఆస్ట్రేలియా 19 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. పేసర్‌ రేణుకా సింగ్‌ (4/18) దెబ్బకు ఆసీస్‌ 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే గార్డ్‌నర్‌ (35 బంతుల్లో 52 నాటౌట్‌; 9 ఫోర్లు), గ్రేస్‌ హారిస్‌ (20 బంతుల్లో 37; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టును గెలిపించారు.

బ్యాడ్మింటన్‌: మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌ 5–0 తేడాతో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ 21–7, 21–12తో మురాద్‌ అలీపై, మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు 21–7, 21–6తో మహూర్‌ షహజాద్‌పై విజయం సాధించారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌–చిరాగ్‌ జోడి 21–12, 21–9 మురాద్‌ అలీ–ఇర్ఫాన్‌ సయీద్‌ను, మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్‌ – ట్రెసా జాలీ 21–4, 21–5తో మహూర్‌ షహజాద్‌–గజాలా సిద్దిఖ్‌ను ఓడించగా... మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సుమీత్‌ రెడ్డి–పొన్నప్ప ద్వయం 21–9, 21–12తో ఇర్ఫాన్‌–గజాలా సిద్ధిక్‌పై ఆధిక్యం ప్రదర్శించింది.  

టేబుల్‌ టెన్నిస్‌: మహిళల టీమ్‌ విభాగంలో ముందుగా దక్షిణాఫ్రికాను 3–0తో, ఆపై ఫిజీని 3–0తో భారత్‌ చిత్తు చేసింది. పురుషుల టీమ్‌ విభాగంలో ముందుగా 3–0 తేడాతో బార్బడోస్‌పై నెగ్గింది.
∙ పురుషుల బాక్సింగ్‌ (63.5 కేజీలు) లో శివ థాపా 5–0తో సులేమాన్‌ బలూచ్‌ (పాకిస్తాన్‌)ను చిత్తు చేసి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు.  

స్విమ్మింగ్‌:  పురుషుల స్విమ్మింగ్‌లో శ్రీహరి నటరాజ్‌ (100 మీ. బ్యాక్‌స్ట్రోక్‌)లో సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. 54.68 సెకన్ల టైమింగ్‌తో రేస్‌ను పూర్తి చేసిన అతను ముందంజ వేశాడు. అయితే మరో ఇద్దరు భారత స్విమ్మర్లు విఫలమయ్యారు. సజన్‌ ప్రకాశ్‌ (50 మీ. బటర్‌ఫ్లయ్‌) హీట్స్‌లో 8వ స్థానంలో, కుశాగ్ర రావత్‌ (400 మీటర్ల ఫ్రీస్టయిల్‌) ఆఖరి స్థానంలో నిలిచి నిష్క్రమించారు.

సైక్లింగ్‌: మూడు ఈవెంట్లలోనూ భారత సైక్లిస్ట్‌లు ఫైనల్‌ చేరడంలో విఫలమయ్యారు. పురుషుల స్ప్రింట్‌ టీమ్‌ ఈవెంట్‌లో రొనాల్డో, రోజిత్, బెక్‌హామ్, ఎల్కొటొచొంగో బృందం క్వాలిఫికేషన్‌లో ఆరో స్థానంలో నిలవగా... శశికళ, త్రియాశ, మయూరి సభ్యులుగా ఉన్న మహిళల స్ప్రింట్‌ టీమ్‌ కూడా ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. విశ్వజీత్, వెంకప్ప, దినేశ్‌ సభ్యులైన 4000 మీటర్ల పర్సా్యట్‌ టీమ్‌ కూడా ఆరో స్థానంలో నిలిచింది.  

ట్రయథ్లాన్‌: భారత్‌నుంచి పేలవ ప్రదర్శన
నమోదైంది. పురుషుల వ్యక్తిగత స్ప్రింట్‌ ఫైనల్లో ఆదర్శ్‌ మురళీధరన్‌ 30వ స్థానంలో, విశ్వనాథ్‌ యాదవ్‌ 33 స్థానంలో నిలిచి నిష్క్రమించగా... మహిళల వ్యక్తిగత స్ప్రింట్‌ ఫైనల్లో ప్రజ్ఞా మోహన్‌ 26వ స్థానంతో, సంజన జోషి 28వ స్థానంతో సరిపెట్టుకున్నారు.

హాకీ: మహిళల లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 5–0తో ఘనాను చిత్తు చేసింది. భారత్‌ తరఫున గుర్జీత్‌ కౌర్‌ (3వ నిమిషం, 39వ ని.), నేహ (28వ ని.), సంగీతా కుమారి (36వ ని.), సలీమా టెటె (56వ ని.) గోల్స్‌ సాధించారు.

ఇంగ్లండ్‌ ఖాతాలో తొలి స్వర్ణం
బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ క్రీడల్లో తొలి స్వర్ణం ఆతిథ్య ఇంగ్లండ్‌ ఖాతాలో చేరింది. పురుషుల ట్రయాథ్లాన్‌లో ఇంగ్లండ్‌కు చెందిన అలెక్స్‌ యీ విజేతగా నిలిచాడు. 50 నిమిషాల 34 సెకన్లలో పరుగు పూర్తి చేసిన యీ అగ్ర స్థానం అందుకోగా...హేడెన్‌ విల్డ్‌ (న్యూజిలాండ్‌), మాథ్యూ హాజర్‌ (ఆస్ట్రేలియా) రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. తొలి రోజు ఆస్ట్రేలియా 2 స్వర్ణాలు, 1 కాంస్యం సాధించగా...ఇంగ్లండ్‌ 1 స్వర్ణం సహా మొత్తం 5 పతకాలు గెలుచుకుంది. స్కాట్లాండ్, బెర్ముడా ఖాతాలో కూడా ఒక్కో స్వర్ణం చేరాయి. 

మరిన్ని వార్తలు