Commonwealth Games 2022: ‘కాలం’ కలిసి రాలేదు

7 Aug, 2022 05:50 IST|Sakshi

సెమీస్‌లో ఆసీస్‌ చేతిలో భారత్‌ ఓటమి

‘స్టాప్‌వాచ్‌’ తప్పిదంతో జట్టుకు నష్టం

న్యూజిలాండ్‌తో కాంస్యం కోసం పోరు 

ఆస్ట్రేలియాతో సెమీస్‌ పోరులో భారత మహిళలు అసమానంగా పోరాడారు. ఆరంభంలోనే ఆధిక్యం కోల్పోయినా ఆ తర్వాత కోలుకొని సత్తా చాటారు. చివర్లో ఎదురుదాడికి దిగి లెక్క సరి చేశారు కూడా. దాంతో ఫలితం పెనాల్టీ షూటౌట్‌కు చేరింది. అక్కడా ప్రత్యర్థి తొలి ప్రయత్నాన్ని కీపర్‌ సవిత అద్భుతంగా అడ్డుకోగలిగింది. ఇదే జోరు కొనసాగిస్తే విజయం సాధించడం ఖాయమనిపించింది.

కానీ ఇక్కడే రిఫరీ భారత్‌ను దెబ్బ కొట్టింది. ‘గడియారం గంట కొట్టలేదంటూ’ మొదటి గోల్‌ ప్రయత్నంలో లెక్కలోకి రాదంది. మళ్లీ పెనాల్టీ తీసుకునేందుకు ఆసీస్‌కు అవకాశం కల్పించింది. దాంతో ఏకాగ్రత చెదిరిన మన మహిళలు ఒక్కసారిగా ఆత్మవిశ్వాసం కోల్పోయారు. షూటౌట్‌లో తడబడి చివరకు ఓటమి పక్షాన నిలిచారు. భారత్‌ పరాజయానికి ఆటలో వైఫల్యంకంటే అసమర్థ రిఫరీనే కారణమనడంలో సందేహం లేదు.
   
బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ క్రీడల మహిళల హాకీలో భారత జట్టు సెమీఫైనల్లో ఓటమిపాలైంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన సెమీస్‌లో ఆస్ట్రేలియా పెనాల్టీ షూటౌట్‌లో 3–0 తేడాతో భారత్‌ను ఓడించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1–1తో సమంగా నిలవడంతో పెనాల్టీ షూటౌట్‌ అనివార్యమైంది. మ్యాచ్‌ 10వ నిమిషంలో ఆస్ట్రేలియా తరఫున రెబెకా గ్రీనర్‌ గోల్‌ చేయగా, 49వ నిమిషంలో భారత్‌ తరఫున వందనా కటారియా గోల్‌ నమోదు చేసింది.

తొలి క్వార్టర్‌లో వెనుకబడిన భారత జట్టు తర్వాతి రెండు క్వార్టర్‌లలో దూకుడుగా ఆడింది. గోల్‌ లేకపోయినా ఆసీస్‌పై ఆధిపత్యం ప్రదర్శించగలిగింది. అదే ఊపులో చివరి క్వార్టర్‌లో గోల్‌తో స్కోరు సమం చేసింది. పెనాల్టీ షూటౌట్‌లో ఆస్ట్రేలియా నుంచి ఆంబ్రోసియా మలోన్, కైట్లిన్‌ నాబ్స్, ఎమీ లాటన్‌ గోల్స్‌ చేయగా... భారత్‌ నుంచి లాల్‌రెమ్‌సియామి, నేహ, నవనీత్‌ కౌర్‌ విఫలమయ్యారు. కాంస్యం కోసం నేడు జరిగే పోరులో న్యూజిలాండ్‌తో భారత్‌ తలపడుతుంది.  

ఏం జరిగింది...
తొలి పెనాల్టీని మలోన్‌ తీసుకోగా, భారత కీపర్‌ సవిత దానిని గోల్‌ కాకుండా సమర్థంగా అడ్డుకోగలిగింది. అంతా ముగిసిన తర్వాత అది చెల్లదని, మళ్లీ పెనాల్టీ తీసుకోవాలని రిఫరీ ఆదేశించింది. పెనాల్టీ సమయం గరిష్టంగా 8 సెకన్లు చూపించే ‘స్టాప్‌వాచ్‌’ టైమర్‌ స్టార్ట్‌ కాలేదని, దానికి ముందే పెనాల్టీ తీసుకున్నందున గుర్తించలేమని రిఫరీ ప్రకటించింది. నిబంధనల ప్రకారమైతే  మైదానంలో ఉండే టెక్నికల్‌ అఫీషియల్‌ ముందుగా చేయి పైకెత్తుతారు.

ఆ తర్వాత చేతిని కిందికి దించితే ‘టైమర్‌’ ప్రారంభమవుతుంది. అదే సమయంలో రిఫరీ విజిల్‌ వేస్తే పెనాల్టీ తీసుకోవాలి. అయితే ఈ టెక్నికల్‌ అఫీషియల్‌ చేతికి కిందకు దించలేదు. ఇది పూర్తిగా ఆమె తప్పు. దాంతో స్టాప్‌వాచ్‌ను మరో అధికారిణి స్టార్ట్‌ చేయలేదు. దానిని గుర్తించి ‘నో నో’ అనే లోపే పెనాల్టీ ముగిసిపోయింది. దీనిని ఆమె వివరించడంతో రిఫరీ మళ్లీ పెనాల్టీ తీసుకోవాల్సిందిగా కోరింది.  

మా ఓటమికి దీనిని సాకుగా చెప్పను. అయితే మొదటి పెనాల్టీని ఆపితే సహజంగానే వచ్చే ఉత్సాహం ఆ తర్వాత నీరుగారిపోయింది. అందరం చాలా నిరాశ చెందాం. తాము పెనాల్టీని కోల్పోయామని గుర్తించిన ఆస్ట్రేలియా జట్టు కూడా ఫిర్యాదు చేయలేదు. అలాంటప్పుడు రిఫరీ ఎందుకు కల్పించుకోవాలి. అధికారులు ఆటతో పాటు ముడిపడి ఉండే భావోద్వేగాలని అర్థం చేసుకోలేరు.          
  –భారత కోచ్‌ జేనెక్‌ స్కాప్‌మన్‌  
 

మరిన్ని వార్తలు