Commonwealth Games 2022: న్యూస్‌ మేకర్‌.. జూడో ధీర

4 Aug, 2022 03:23 IST|Sakshi

కామన్‌వెల్త్‌ క్రీడలలో సుశీలా దేవి లిక్మబమ్‌  రజత పతకం సాధించింది. 48 కేజీల జూడో ఫైనల్స్‌లో హోరాహోరీ పోరాడి రెండో స్థానంలో నిలిచింది. సుశీలా దేవి ఎన్నో ఆటుపోట్లు
ఎదుర్కొని ఈ స్థాయికి చేరింది. డిప్రెషన్‌ను జయించి ప్రత్యర్థిని గెలిచింది. మణిపూర్‌ ఖ్యాతిని పెంచిన మరో వనిత సుశీలా దేవి పరిచయం...

ప్రత్యర్థిని నాలుగు వైపుల నుంచి ముట్టడించాలని అంటారు. జూడోలో కూడా నాలుగు విధాలుగా ప్రత్యర్థిని ముట్టడించవచ్చు. త్రోయింగ్, చోకింగ్, లాకింగ్, హోల్డింగ్‌ అనే నాలుగు పద్ధతులతో ప్రత్యర్థిపై గెలుపు సాధించాల్సి ఉంటుంది. బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక కామన్వెల్త్‌ గేమ్స్‌– 2022లో మహిళా జూడో 48 కేజీల విభాగంలో సోమవారం జరిగిన ఫైనల్స్‌లో సుశీలా దేవి లిక్మబమ్‌ తన ప్రత్యర్థి దక్షిణాఫ్రికా జూడో క్రీడాకారిణి మిషిలా వైట్‌బూయీ మీద ఈ నాలుగు విధాలా దాడి చేసినా ప్రత్యేక పాయింట్ల విషయంలో వెనుకబడింది. ఫలితంగా రెండో స్థానంలో నిలబడింది. అయినప్పటికీ భారత దేశానికి మహిళా జూడోలో రజతం సాధించిన క్రీడాకారిణిగా ఆమె ప్రశంసలను పొందుతోంది. అయితే ఈ రజతంతో ఆమె సంతోషంగా లేదు. ‘నేను అన్ని విధాలా గోల్డ్‌ మెడల్‌కు అర్హురాలిని. మిస్‌ అయ్యింది’ అని కొంత నిరాశ పడుతోంది. కాని సుశీలా ఎదుర్కొన్న ఆటుపోట్లను చూస్తే దాదాపుగా జూడో నుంచి బయటికొచ్చేసి తిరిగి ఈ విజయం సాధించడం సామాన్యం కాదని అనిపిస్తుంది.

మేరీకోమ్‌ నేల నుంచి
మణిపూర్‌ అంటే మేరీకోమ్‌ గుర్తుకొస్తుంది. 27 ఏళ్ల సుశీలా దేవిది కూడా మణిపూరే. తండ్రి మనిహర్, తల్లి చవోబి. నలుగురు పిల్లల్లో రెండో సంతానం సుశీలాదేవి. చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉండే సుశీలాను చూసి ఆమె మేనమామ దినిక్‌ తనలాగే అంతర్జాతీయ స్థాయి జూడో క్రీడాకారిణి చేయాలనుకున్నాడు. అప్పటికే సుశీలాదేవి అన్న శైలాక్షి కూడా జూడో నేర్చుకుంటూ ఉండటంతో ఎనిమిదేళ్ల వయసు నుంచే సుశీలకు జూడో మీద ఆసక్తి పుట్టింది. ప్రాక్టీసు కోసం మేనమామ ఇంఫాల్‌ లోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) కేంద్రానికి రోజూ రమ్మంటే సుశీల వాళ్ల ఇంటి నుంచి అది సుమారు 10 కిలోమీటర్లు అయినా రోజూ అన్నా చెల్లెళ్లు సైకిల్‌ తీసుకుని కొండలు, గుట్టలు దాటుతూ సాయ్‌ కేంద్రానికి చేరుకునేవారు. అలా ఆమె శిక్షణ మొదలయ్యింది. చెప్పాల్సిన విషయం ఏమంటే అన్న క్రమంగా జూడోలో వెనకబడితే చెల్లెలు పేరు తెచ్చుకోవడం మొదలెట్టింది. దానికి కారణం మహిళా జూడోలోకి ప్రవేశించే క్రీడాకారిణులు తక్కువగా ఉండటమే.

పాటియాలా శిక్షణ
సుశీల శిక్షణ ఇంఫాల్‌ నుంచి పాటియాలాలోని నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలె¯Œ ్సకు మారింది. అక్కడ అంతర్జాతీయ స్థాయిలో ఆడే మేరీకోమ్‌ వంటి ఆటగాళ్లను చూశాక ఆమెలో స్ఫూర్తి రగిలింది. తాను కూడా విశ్వవేదికపై మెరవాలని కలలు కని వాటిని సాకారం చేసుకునే దిశగా కృషి చేసింది. కోచ్‌ జీవన్‌ శర్మ ఆమెకు ద్రోణాచార్యుడి గా మారి శిక్షణ ఇచ్చాడు. 2008 జూనియర్‌ నేషనల్‌ చాంపియన్‌ షిప్‌లో పతకం సాధించడంతో ఆమె పేరు జూడోలో వినిపించడం మొదలెట్టింది. కొనసాగింపుగా ఆసియా యూత్‌ చాంపియన్‌ షిప్‌లో కూడా సుశీల పతకాలు సాధించింది.

కారు అమ్ముకుంది
క్రికెట్‌ తప్ప వేరే క్రీడలను పెద్దగా పట్టించుకోని స్పాన్సర్లు  భారత్‌లో అంతగా తెలియని జూడోను అసలు పట్టించుకోనేలేదు. పైగా మహిళా జూడో అంటే వారికి లెక్కలేదు. ప్రభుత్వం కూడా ఒలింపిక్స్, ఆసియా గేమ్స్, కామన్వెల్త్‌ గేమ్స్‌కు తప్ప వరల్డ్‌ ఛాంపియ¯Œ ్సకు పెద్దగా స్పాన్సర్షిప్‌ చేయదు. స్పాన్సర్లు లేకపోవడంతో తాను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న మొదటి కారును అమ్ముకుని ఆ పోటీలలో పాల్గొన్నది సుశీల. ‘నేను సంపాదించిందంతా జూడోలోనే ఖర్చు చేశాను. ఇంక నా దగ్గర  అమ్ముకోవడానికి ఏమీ మిగలలేదు. కానీ ఈ ఆటను నేను వీడను..’ అంటుంది సుశీల.
ఈ మెడల్‌తో ఆమె ఖ్యాతి మరింత పెరిగింది. ఇక ఆట కొనసాగింపు చూడాలి. సుశీల ప్రస్తుతం మణిపూర్‌ పోలీస్‌ శాఖలో ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తోంది.
 
2014 కామన్వెల్త్‌ విజయం
2014లో జరిగిన గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్‌లో రజతం సాధించడంతో సుశీల మీద అందరి అంచనాలు పెరిగాయి. ఆమె నుంచి ఒక ఒలింపిక్‌ పతకం ఖాయం అని భావించారు. అందుకు రిహార్సల్స్‌ వంటి 2018 ఆసియా క్రీడల్లో పాల్గొనాలని ఉత్సాహపడుతున్న సుశీలను గాయం బాధ పెట్టింది. ఆమె ఆ గేమ్స్‌లో పాల్గొనలేకపోవడంతో డిప్రెషన్‌ బారిన పడింది. ఆ తర్వాత వచ్చిన లాక్‌డౌన్, టోర్నీలు రద్దుకావడం ఇవన్నీ ఆమెను టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటానో లేదోననే స్థితికి తీసుకెళ్లాయి.

టోక్యో ఒలింపిక్స్‌లో అదృష్టవశాత్తు కాంటినెంటల్‌ కోటాలో స్థానం దొరికితే దేశం తరపున ఏకైక జూడో క్రీడాకారిణిగా పాల్గొన్నా ఫస్ట్‌ రౌండ్‌లోనే వెనుదిరగాల్సి వచ్చింది. 2019 ఆసియన్‌ ఓపెన్‌ ఛాంపియన్‌ షిప్‌లో సిల్వర్‌ మెడల్, 2019 లో కామన్వెల్త్‌ జూడో ఛాంపియన్‌ షిప్‌లో స్వర్ణం నెగ్గింది. అయితే 2018 కు ముందు ఆమె చేతికి గాయమైంది. దీంతో ఆమె ఏడు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఒలింపిక్స్‌ లో పాల్గొనాలన్న  ఆశలు ఆవిరవుతున్నట్టు అనిపించింది. కానీ ఆమె కుంగిపోలేదు. ఇంటికి వెళ్లి  మూడు నెలలు విరామం తీసుకుంది. తిరిగి 2018లో ఆసియా గేమ్స్‌ లో పాల్గొనలేకపోయినా 2019 లో హాంకాంగ్‌ వేదికగా జరిగిన హాంకాంగ్‌ ఓపెన్‌ లో బరిలోకి దిగింది.
 

మరిన్ని వార్తలు