Commonwealth Games 2022 : టీమిండియాకు భారీ షాక్.. ఇద్దరు క్రికెటర్లకు కోవిడ్‌

26 Jul, 2022 21:30 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌ వేదికగా ఈనెల (జులై) 28 నుంచి ప్రారంభంకానున్న కామన్వెల్త్ గేమ్స్‌కు ముందు భారత మహిళా క్రికెట్‌ జట్టుకు భారీ షాక్‌ తగిలింది. టీమిండియాలోని ఇద్దరు ఆటగాళ్లు కోవిడ్ బారిన పడినట్లు జట్టు యాజమాన్యం మంగళవారం ప్రకటించింది. ఆదివారం (జులై 24) జట్టు బర్మింగ్‌హామ్‌కు బయల్దేరాక టీమిండియా మేనేజ్‌మెంట్‌ ఈ విషయాన్ని ఇవాళ వెల్లడించింది. అయితే ఆ ఇద్దరి పేర్లను చెప్పేందుకు నిరాకరించింది. 

కోవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత ఆ ఇద్దరు బర్మింగ్‌హామ్‌లో జట్టుతో కలుస్తారని తెలిపింది. కాగా, కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో మహిళల క్రికెట్‌కు తొలిసారి ప్రాతినిధ్యం లభించిన విషయం తెలిసిందే. జులై 29న టీమిండియా తమ తొలి పోరులో పటిష్టమైన ఆసీస్‌ను ఢీకొట్టాల్సి ఉంది. అనంతరం భారత్‌ జులై 31న పాకిస్థాన్‌తో..  ఆగస్ట్‌ 3న బార్బడోస్‌తో తలపడాల్సి ఉంది. మొత్తం 8 జట్లు పాల్గొనే ఈ క్రీడల్లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బార్బడోస్‌, భారత్‌ ఓ గ్రూప్‌ (ఏ)లో.. ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు మరో గ్రూప్‌లో (బి) ఉన్నాయి.
చదవండి: CWG 2022: క్రికెట్‌లో గోల్డ్ మెడల్ సాధించగల సత్తా ఉన్న మూడు జట్లు ఇవే..!

మరిన్ని వార్తలు