Commonwealth Games: తప్పనిసరి క్రీడాంశాలుగా అథ్లెటిక్స్, అక్వాటిక్స్‌

13 Oct, 2021 08:32 IST|Sakshi

Commonwealth Games: 2026- 2030 Roadmap(London): భవిష్యత్‌లో జరిగే కామన్వెల్త్‌ గేమ్స్‌ (సీడబ్ల్యూజీ)లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మేరకు కామన్వెల్త్‌ గేమ్స్‌ సమాఖ్య (సీజీఎఫ్‌) 2026–2030కు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను జనరల్‌ అసెంబ్లీలో అమోదించింది. దీని ప్రకారం 2026 నుంచి జరిగే సీడబ్ల్యూజీలో క్రీడాంశాల సంఖ్య తగ్గనుంది. వచ్చే ఏడాది బర్మింగ్‌హామ్‌ గేమ్స్‌లో 20 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి. 2026 నుంచి క్రీడాంశాల సంఖ్య 15కు తగ్గనుంది.

వీటిలో అథ్లెటిక్స్, అక్వాటిక్స్‌ (స్విమ్మింగ్‌) మాత్రం తప్పనిసరిగా ఉంటాయి. ఇక మిగిలిన క్రీడాంశాలను కొనసాగించే నిర్ణయాన్ని ఆతిథ్య దేశానికి తీసుకునే వెసులుబాటును కల్పించింది. ఆప్షనల్‌ గ్రూప్‌లో ఉన్న క్రికెట్, 3x3 బాస్కెట్‌బాల్, బీచ్‌ వాలీబాల్‌లను కోర్‌ గ్రూప్‌లోకి మారుస్తూ సీజీఎఫ్‌ తీర్మానించింది.

కాగా గేమ్స్‌ నిర్వహణ వ్యయాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీజీఎఫ్‌ అధ్యక్షురాలు డెమె లూసీ మార్టిన్‌ తెలిపారు. తాజా మార్పులతో గేమ్స్‌కు ఆతిథ్యమిచ్చే దేశాలకు లబ్ధి జరగనుంది. తాము ఏ క్రీడాంశాల్లో పతకాలను ఎక్కువగా గెలవగలమో వాటికి ఆ దేశాలు పెద్ద పీట వేస్తాయి. 2026 కామన్వెల్త్‌ గేమ్స్‌ వేదిక ఇంకా ఖరారు కాలేదు. 

చదవండి: Gautam Gambhir: 'మిస్టరీ' అంటారు.. మరి ఇన్నేళ్లుగా ఎలా ఆడుతున్నాడు

మరిన్ని వార్తలు