'10 వేల పరుగులు పూర్తి చేయడం.. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్లే'

6 Jun, 2022 17:03 IST|Sakshi

టెస్టుల్లో 10,000 పరుగల మైలు రాయిని ఇంగ్లండ్‌ బ్యాటర్‌ జో రూట్‌ చేరుకున్న విషయం తెలిసిందే. లార్డ్స్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు సందర్భంగా జో రూట్‌ ఈ ఘనత సాధించాడు. తద్వారా టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఈ ఘనత సాధించిన 14వ ఆటగాడిగా రూట్‌ నిలిచాడు. అయితే ఈ అరుదైన ఘనత సాధించిన తొలి ఆటగాడిగా భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఉన్నాడు. కాగా తాజగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన చారిత్రాత్మకమైన నాక్‌ను గవాస్కర్ గుర్తుచేసుకున్నాడు. టెస్టుల్లో 10,000 పరుగులు పూర్తి చేయడం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్లే అతడు తెలిపాడు.

"ఈ ఘనత సాధించడానికి నాకు 57 పరుగులు అవసరమని తెలుసు. నేను సాధారణంగా స్కోర్‌బోర్డ్‌ని చూడను. అయితే నేను అర్ధసెంచరీ సాధించాక అహ్మదాబాద్‌ ప్రేక్షకులు చప్పట్లు కొట్టి అభినందించారు. చారిత్రక మైలురాయిని అందుకోవడానికి మరో ఏడు పరుగులు అవసరమని అప్పడే గ్రహించాను. టెస్టులో పది వేల పరుగులు సాధించడం అంత సులభం కాదు. కాబట్టి 10 వేల పరుగులు సాధిస్తే.. తొలి సారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్లే.

నేను 10,000 పరుగులను త్వరగా పూర్తి చేయాలని భావించాను. మిగితా ఆటగాళ్లు కూడా ఈ ఘనతతను సాధించడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ ఘనత సాధించినప్పడు మేము అహ్మదాబాద్‌లో ఉన్నాము. అయితే ఈ రికార్డును సెలబ్రేట్‌ చేసుకోవడానికి మా జట్టు కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ ప్రత్యేక అనుమతితో షాంపైన్‌ తీసుకుని వచ్చాడు. అయితే ప్రస్తుత సపోర్ట్ స్టాఫ్, స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్‌లు టెస్ట్ మ్యాచ్ మధ్యలో షాంపైన్ తాగడానికి అనుమతిస్తారో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు "అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు.
చదవండి: Test Cricket: రూట్‌ త్వరలోనే సచిన్‌ రికార్డు బద్దలు కొడతాడు: ఆసీస్‌ మాజీ కెప్టెన్‌

మరిన్ని వార్తలు