అజహరుద్దీన్, అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యుల మధ్య వివాదం!

8 Sep, 2020 09:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సరిగ్గా ఏడాది క్రితం వారంతా కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు, ఘన విజయం సాధించారు. కానీ ఇప్పుడు మాత్రం అంతర్గత విభేదాలతో రచ్చకెక్కుతున్నారు. హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ)లో తాజా పరిస్థితి ఇది. అధ్యక్షుడు మొహమ్మద్‌ అజహరుద్దీన్‌కు, ఇతర అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులకు మధ్య గత కొంత కాలంగా సాగుతున్న వివాదం చివరకు పోలీస్‌ స్టేషన్‌ దాకా చేరింది. హెచ్‌సీఏ సభ్యులు తనను బహిరంగంగా తిట్టారంటూ అజహర్‌ ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోశాధికారి సురేందర్‌ అగర్వాల్, మరో సభ్యుడు మొయిజుద్దీన్‌లపై పోలీసులు సెక్షన్‌ 504, 506ల కింద కేసులు నమోదు చేశారు.

అసోసియేషన్‌ పనికి సంబంధించి ఒక హెచ్‌సీఏ ఉద్యోగి సురేందర్‌ అగర్వాల్‌ వద్దకు వెళ్లగా... ఆయనతో పాటు మరి కొందరు కలిసి సదరు ఉద్యోగితో పాటు అజహర్‌ను కూడా బూతులు తిట్టడంతో వివాదం ముదిరినట్లు తెలిసింది. దాంతో తనను దూషించారంటూ అజహర్‌ వర్గం పోలీసులను ఆశ్రయించింది. దీనికి సంబంధించి సోమవారం పోలీసులు విచారణ జరిపే క్రమంలో ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కూడా కొంత గొడవ జరిగింది. ఇరు వర్గాలకు చెందిన వారు అక్కడి రావడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. మరోవైపు సురేందర్‌ అగర్వాల్‌పై ఇంకో కేసు కూడా నమోదైంది. హెచ్‌సీఏ క్లబ్‌లకు రూ. 50 వేలు ఇస్తున్నామంటూ తమకు మాత్రం ఇవ్వలేదని, నిధులను కోశాధికారి సురేందర్‌ దుర్వినియోగం చేశారంటూ షాలీమార్‌ క్రికెట్‌ క్లబ్‌ యజమాని ఎజాజ్‌ అలీ ఖురేషీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అదే కారణమా... 
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జస్టిస్‌ లోధా కమిటీ సిఫారసులను అన్ని రాష్ట్ర క్రికెట్‌ సంఘాలు అమలు చేయాల్సి ఉంది. ఈ విషయంలో అజహర్‌కు, ఇతర సభ్యులకు మధ్య విభేదాలు మొదలైనట్లు సమాచారం. హెచ్‌సీఏలో వివాదాల పరిష్కారం కోసం జస్టిస్‌ దీపక్‌ వర్మను అజహర్‌ అంబుడ్స్‌మన్‌ నియమించారు. ఇది కమిటీలో ఇతర సభ్యులకు నచ్చలేదు. తమతో ఏమాత్రం సంప్రదించలేదని, ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని వారు చెబుతున్నారు.

అయితే గత ఏడాది కొత్త కార్యవర్గం ఎన్నికైన తర్వాత జరిగిన తొలి సమావేశంలోనే ఇందుకు అంగీకారం తెలిపారని, నాటి సమావేశం మినిట్స్‌లో కూడా ఇది ఉందనేది అజహర్‌ వాదన. రాబోయే ఏజీఎంలో ఆమోద ముద్ర వేసిన తర్వాతే అంబుడ్స్‌మన్‌ నియామకాన్ని అమల్లోకి తేవాలని అజహర్‌ వ్యతిరేక బృందం చెబుతోంది. అయితే కరోనా నేపథ్యంలో 200కు పైగా సభ్యులు హాజరయ్యే అవకాశం ఇప్పట్లో లేని నేపథ్యంలో ఏజీఎం సాధ్యం కాదంటున్న అజహర్‌... ఏడాది కాలంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడంతో అసోసియేషన్‌ ఎలా పని చేస్తుందనేది మరో వర్గం వాదన. ఇటీవల క్లబ్‌ల పూర్తి వివరాలు, యజమానుల వివరాలు తనకు ఇవ్వాలంటూ అజహర్‌ లేఖ రాయడం కూడా వివాదానికి కారణమైంది. అంబుడ్స్‌మన్‌ వస్తే కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌ కింద తమకు ఇబ్బందురు ఎదురు కావచ్చనే కారణంతోనే హెచ్‌సీఏలో పలువురు సభ్యులు అజహర్‌ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారని సమాచారం.

చదవండి: ‘టీ20ల్లో ఆ మార్పు చేసి చూడండి.. ’

మరిన్ని వార్తలు