AUS Open 2023: 'జొకోవిచ్‌.. మీ తండ్రి చేసిన పని సిగ్గుచేటు'

26 Jan, 2023 13:45 IST|Sakshi

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో సెమీస్‌కు దూసుకెళ్లి జోష్‌ మీదున్న జొకోవిచ్‌కు అతని తండ్రి రూపంలో చేదు అనుభవం ఎదురైంది. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా టోర్నీలో రష్యా, బెలారస్‌కు చెందిన జెండాలను నిర్వాహకులు నిషేధించారు. తాజాగా రష్యా జెండా.. జొకోవిచ్‌ తండ్రి సర్డాన్ జోకొవిచ్‌ను చిక్కుల్లో పడేసింది. స్టేడియాల్లోకి జెండాలు నిషేధం కావడంతో రష్యా మద్దతుదారులు.. స్టేడియం బయట తమ దేశ జెండాలతో  నిరసనలు చేస్తున్నారు.

ఇదే సమయంలో బుధవారం జొకోవిచ్‌ క్వార్టర్స్‌ మ్యాచ్‌ చూసేందుకు అతని తండ్రి సర్డాన్‌ జొకోవిచ్‌ రాడ్‌లివర్‌ ఎరినాకు వచ్చాడు. ఈ సమయంలో రష్యా జెండాలు పట్టుకున్న అభిమానులతో కలిసి ఫోటోలు దిగాడు. ఈ ఫోటోల వ్యవహారం పెద్ద దుమారాన్ని రేపింది. అంతేకాదు రష్యా వర్ధిల్లాలి అనే నినాదం చేయడం.. మ్యాచ్ కు జెడ్ అనే అక్షరం ఉన్న టీషర్ట్ వేసుకొని వచ్చిన వ్యక్తితో కనిపించడం జొకోవిచ్‌ తండ్రిని మరింత వివాదంలోకి నెట్టింది. ఆ తర్వాత పుతిన్ ఫొటో ఉన్న రష్యా జెండా పట్టుకున్న ఓ వ్యక్తి పక్కనే సర్డాన్ జోకొవిచ్ నిలబడిన వీడియో ఒకటి యూట్యూబ్ లో కనిపించింది.

సాధారణంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో ఆయా దేశాల జెండాలు పట్టుకోవడం తప్పేమీ కాదు. అయితే ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో రష్యాతోపాటు బెలారస్ జెండాలను నిషేధించారు. మ్యాచ్ చూడటానికి రష్యా జెండాలతో వచ్చిన నలుగురు వ్యక్తులను వెంటనే స్టేడియం నుంచి బయటకు పంపించేశారు. అయితే ఇప్పుడో స్టార్ ప్లేయర్ తండ్రే ఇలా నిరసనకారులకు మద్దతుగా నినాదాలు చేయడం కొత్త వివాదానికి దారి తీసింది. సర్డాన్ జోకొవిచ్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి''. జొకోవిచ్‌.. మీ తం‍డ్రి చేసిన పని సిగ్గు చేటు'' అంటూ కొందరు తీవ్రంగా స్పందించారు.

చదవండి: Hulk Hogan: అసభ్యకర ట్వీట్‌ చేసిన రెజ్లింగ్‌ స్టార్‌.. ఆపై తొలగింపు

టాప్‌లెస్‌గా దర్శనం.. 'అలా చూడకు ఏదో అవుతుంది'

మరిన్ని వార్తలు