-

Asia Cup 2022 SL Vs AFG : 'ఇదేం చెత్త అంపైరింగ్‌.. కళ్లు కనిపించడం లేదా'

27 Aug, 2022 21:19 IST|Sakshi
PC: crictracker

ఆసియాకప్‌-2022లో భాగంగా శ్రీలంక- ఆఫ్గానిస్తాన్‌ తొలి మ్యాచ్‌లో థర్డ్‌ అంపైర్‌ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. శ్రీలంక ఇన్నింగ్స్‌ 2 ఓవర్‌ వేసిన నవీన్‌ ఉల్‌ హక్‌ బౌలింగ్‌లో బంతి పాతుమ్ నిస్సంక బ్యాట్‌కు దగ్గరగా వెళ్తూ వికెట్‌ కీపర్‌ చేతికి వెళ్లింది. వెంటనే బౌలర్‌తో పాటు వికెట్‌ కీపర్‌ కూడా క్యాచ్‌కు అప్పీల్‌ చేశాడు. అయితే ఫీల్డ్‌ అంపైర్‌ అనిల్‌ చౌదరి వెంటనే ఔట్‌ అని వేలు పైకిత్తాడు.

ఈ క్రమంలో నిస్సంక నాన్‌ స్ట్రైకింగ్‌లో ఉన్న గుణతిలకతో చర్చించి రివ్యూకు వెళ్లాడు. అయితే రిప్లేలో బ్యాట్‌ను బంతి దాటే సమయంలో ఎటువంటి స్పైక్‌ కనిపించలేదు. అయినప్పటికీ థర్డ్‌ అంపైర్‌ మాత్రం బంతి బ్యాట్‌కు తాకినట్లు కన్పించింది అంటూ ఔట్‌గా ప్రకటించాడు.  థర్డ్‌ అంపైర్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో బ్యాటర్‌తో పాటు డగౌట్‌లో ఉన్న శ్రీలంక జట్టు మేనేజ్‌మెంట్‌ కూడా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. థర్డ్‌ అంపైర్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై శ్రీలంక అభిమానులు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. "ఇదేం చెత్త అంపైరింగ్‌రా.. కళ్లు కనిపించడం లేదా" అంటూ కామెంట్‌ చేశాడు.

మరిన్ని వార్తలు