CPL 2021: డుప్లెసిస్‌ ఊచకోత.. 51 బంతుల్లోనే శతక్కొట్టుడు..

5 Sep, 2021 13:23 IST|Sakshi

సెయింట్‌ కిట్స్‌: కరీబియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ 2021లో భాగంగా సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెయింట్‌ లూసియా కింగ్స్‌ ఓపెనర్‌, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఫాప్‌ డుప్లెసిస్‌ ఉగ్రరూపం దాల్చాచాడు. 51 బంతుల్లోనే శతక్కొట్టి ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ ఇన్నింగ్స్‌లో డుప్లెసిస్‌.. 60 బంతుల్లో 13 ఫోర్లు, 5 భారీ సిక్సర్ల సాయంతో 120 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఎండ్‌లో రోస్టన్‌ ఛేజ్‌(31 బంతుల్లో 64 నాటౌట్‌; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగడంతో సెయింట్‌ లూసియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 224 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. 

అనంతరం ఛేదనలో సెయింట్‌ కిట్స్‌ 16.5 ఓవర్లలో కేవలం 124 పరుగులు మాత్రమే చేసి చాప చాట్టేయడంతో ప్రత్యర్ధి 100 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇటీవలే రాజస్థాన్‌ రాయల్స్‌ ఎంచుకున్న విధ్వంసకర వీరుడు ఎవిన్‌ లూయిస్‌(42 బంతుల్లో 73; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) ఒంటిరి పోరాటం చేశాడు.సెయింట్‌ లూసియా బౌలర్లు అల్జరీ జోసఫ్‌(3/27), కీమో పాల్‌(3/23) ప్రత్యర్ధి పతనాన్ని శాసించగా, వాహబ్‌ రియాజ్, రోస్టన్‌ ఛేజ్‌, కెస్రిక్‌ విలియమ్స్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

ఇదిలా ఉంటే, ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించే డుప్లెసిస్‌.. శతక్కొట్టడంతో సీఎస్‌కే ఆభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. సెప్టెంబర్‌ 19 నుంచి మొదలయ్యే ఐపీఎల్‌ సెకెండ్‌ లెగ్‌ మ్యాచ్‌ల్లో కూడా డుప్లెసిస్‌ ఇదే తరహాలో రాణించాలని ఆశిస్తున్నారు. దుబాయ్‌ వేదికగా సెప్టెంబర్‌ 19న జరిగే మ్యాచ్‌లో సీఎస్‌కే.. ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. 
చదవండి: గాయం వేధిస్తున్నా పెయిన్‌ కిల్లర్‌ తీసుకుని మరీ ఆడాడు..
 

మరిన్ని వార్తలు