Viral Video: వైడ్‌ ఇవ్వలేదన్న కోపంలో పోలార్డ్‌ ఏం చేశాడో చూడండి..

1 Sep, 2021 13:01 IST|Sakshi

సెయింట్ కిట్స్: కరీబియన్‌ ప్రీమియర్ లీగ్‌ (సీపీఎల్‌) 2021లో భాగంగా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, సెయింట్ లూసియా కింగ్స్ జట్ల మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 19వ ఓవర్ ఐదో బంతిని సెయింట్ లూసియా కింగ్స్ పేసర్‌ వాహబ్ రియాజ్ వేయగా సీఫెర్ట్ ఎదుర్కొన్నాడు. పూర్తిగా ఆఫ్ సైడ్ వెళ్లిన ఆ బంతిని(డబుల్‌ వైడ్‌) సీఫెర్ట్ కిందపడి మరి ఆడినా.. అందలేదు. కనీస క్రికెట్‌ పరిజ్ఞానం లేని వారు కూడా దీన్ని వైడ్‌గా ప్రకటిస్తారు. అయితే, ఫీల్డ్‌ అంపైర్ నిగెల్ డుగుయిడ్ ఈ బంతిని వైడ్‌గా ప్రకటించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 

దీనిపై నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న ట్రిన్‌బాగో కెప్టెన్ పొలార్డ్ తనదైన శైలిలో అసహనం వ్యక్తం చేశాడు. నిర్ధేశిత ప్రాంతంలో కాకుండా వికెట్లకు దూరంగా వెళ్లి 30 యార్డ్‌ సర్కిల్‌ దగ్గర నిలబడి తన నిరసన వ్యక్తం చేశాడు. ఈ మొత్తం తతంగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. వీడియో చూసిన అభిమానుల తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అంపైర్ తప్పిదాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయని కొందరంటుంటే.. వైడ్ బాల్ కూడా థర్డ్ అంపైరే చూసుకోవాలని మరికొందరు ట్వీటారు. మొత్తానికి అభిమానులు సదరు అంపైర్‌ నిర్ణయంపై మండిపడుతున్నారు. 

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్‌ (29 బంతుల్లో 41; 6 ఫోర్లు, సిక్స్‌), టిమ్ సీఫెర్ట్ (25 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. సెయింట్ లూసియా కింగ్స్ పేసర్ కేస్రిక్ విలియమ్స్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. లక్ష్య ఛేదనలో సెయింట్ లూసియా కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 131 పరుగులు మాత్రమే చేసి 27 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆండ్రీ ఫ్లెచర్ ( 55 బంతుల్లో 81; 6 ఫోర్లు, నాలుగ సిక్సర్లు) ఒంటరి పోరాటం వృధా అయ్యింది. రవి రాంపాల్ మూడు వికెట్లతో లూసియా కింగ్స్ పతనాన్ని శాసించాడు. 
చదవండి: ఏ దేశ క్రికెట్‌ జట్టైనా అఫ్గాన్‌లో పర్యటించవచ్చు: తాలిబన్‌ ప్రతినిధి
 

మరిన్ని వార్తలు