రికార్డు స్థాయిలో ఐదోసారి ఫైనల్‌కు చేరిన పోలార్డ్‌ టీమ్‌

21 Sep, 2023 18:58 IST|Sakshi

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో విండీస్‌ దిగ్గజ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పోలార్డ్‌ నేతృత్వం వహిస్తున్న ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ జట్టు రికార్డు స్థాయిలో ఐదోసారి ఫైనల్‌కు చేరింది. ఈ లీగ్‌లో నైట్‌రైడర్స్‌తో పాటు అమెజాన్‌ వారియర్స్‌ కూడా ఐదుసార్లు ఫైనల్స్‌కు చేరినప్పటికీ, ఆ జట్టు ఒక్కసారి కూడా టైటిల్‌ సాధించలేకపోయింది. అయితే నైట్‌రైడర్స్‌ ఇప్పటివరకు ఆడిన నాలుగు ఫైనల్స్‌లో విజయాలు సాధించి, రికార్డు స్థాయిలో ఐదో టైటిల్‌పై కన్నేసింది. సీపీఎల్‌లో అత్యధిక టైటిల్స్‌ (4) రికార్డు నైట్‌రైడర్స్‌ పేరిటే ఉంది. నైట్‌రైడర్స్‌ తర్వాత జమైకా తల్లావాస్‌ మూడు సార్లు, బార్బడోస్‌ రాయల్స్‌ రెండు సార్లు, సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పేట్రియాట్స్‌ ఓసారి సీపీఎల్‌ టైటిల్‌ సాధించాయి. 

ప్రస్తుతం జరుగుతున్న 2023 ఎడిషన్‌ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన నైట్‌రైడర్స్‌, క్వాలిఫయర్‌ 1లో గయానా అమెజాన్‌ వారియర్స్‌పై విజయం సాధించి, నేరుగా ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. ఇవాళ (సెప్టెంబర్‌ 21) జరిగిన క్వాలిఫయర్‌ 1 మ్యాచ్‌లో ఆ జట్టు అమెజాన్‌ వారియర్స్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన వారియర్స్‌.. సైమ్‌ అయూబ్‌ (49), అజమ్‌ ఖాన్‌ (36) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. నైట్‌రైడర్స్‌ బౌలర్లలో వకార్‌ సలామ్‌ఖీల్‌, టెర్రెన్స్‌ హిండ్స్‌ చెరో 2 వికెట్లు.. అకీల్‌ హొస్సేన్‌, అలీ ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్‌రైడర్స్‌.. 18.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. చాడ్విక్‌ వాల్టన్‌ అజేయమైన 80 పరుగులతో నైట్‌రైడర్స్‌ను గెలిపించాడు. పూరన్‌ (33), పోలార్డ్‌ (23) ఓ మోస్తరుగా రాణించారు. వారియర్స్‌ బౌలర్లలో డ్వేన్‌ ప్రిటోరియస్‌ 2, ఇమ్రాన్‌ తాహిర్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. జమైకా తల్లావాస్‌, అమెజాన్‌ వారియర్స్‌ మధ్య సెప్టెంబర్‌ 23న జరిగే రెండో క్వాలిఫయర్‌ విజేతతో నైట్‌రైడర్స్‌ ఫైనల్స్‌లో తలపడుతుంది. ఈ మ్యాచ్‌ సెప్టెంబర్‌ 25న జరుగనుంది. 

మరిన్ని వార్తలు