భారత్‌తో టెస్టు.. ఆస్ట్రేలియా కీలక నిర్ణయం

11 Nov, 2020 08:09 IST|Sakshi

రారండోయ్‌... ప్రేక్షకులు!

సిడ్నీ: భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య జరిగే టెస్టు మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతిస్తూ క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 17 నుంచి అడిలైడ్‌ ఓవల్‌ మైదానంలో ఇరు జట్ల మధ్య తొలిసారిగా డే-నైట్‌ టెస్టు జరుగుతుంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇదే మొదటి మ్యాచ్‌ కాగా... ఈ పోరు చూసేందుకు సుమారు 27,000 మంది ప్రేక్షకులకు అంటే స్టేడియం సామర్థ్యంలో 50 శాతం మందికి అవకాశమిస్తామని సీఏ మంగళవారం ప్రకటించింది. కోవిడ్‌తో ఇప్పుడన్నీ క్రికెట్‌ మ్యాచ్‌లు బయో బబుల్‌లో ప్రేక్షకుల్లేకుండా గప్‌చుప్‌గా నిర్వహిస్తున్నారు. వచ్చే నెలలో వీక్షకులు మైదానానికి వస్తే ‘మహమ్మారి’ తర్వాత ప్రేక్షకులు తిలకించే తొలి క్రికెట్‌ మ్యాచ్‌ అదే అవుతుంది. ‘అడిలైడ్‌ ఓవల్‌లో 50 శాతం మందికి అనుమతిస్తాం. టెస్టు జరిగే ఐదు రోజులూ 27 వేల టికెట్లను అందుబాటులో ఉంచుతాం’ అని సీఏ తమ క్రికెట్‌ వెబ్‌సైట్‌లో పేర్కొంది.
(చదవండి: ఇక... అమెజాన్‌ ప్రైమ్‌ క్రికెట్‌)

అయితే మెల్‌బోర్న్‌లో ‘బాక్సింగ్‌ డే’ (డిసెంబర్‌ 26 నుంచి 30 వరకు) టెస్టుకు మాత్రం కేవలం 25 శాతం మందినే అనుమతిస్తామని విక్టోరియా ప్రభుత్వం తెలిపింది. సిడ్నీలో మూడో టెస్టుకు 50 శాతం, బ్రిస్బేన్‌లో నాలుగో టెస్టుకు 75 శాతం ప్రేక్షకులకు అవకాశం కల్పించారు. పూర్తిస్థాయి క్రికెట్‌ సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియాలో పర్యటించేందుకు టీమిండియా నేడు దుబాయ్‌ నుంచి అక్కడికి బయలుదేరుతుంది. కరోనా ప్రొటోకాల్‌ (పరీక్షలు, క్వారంటైన్‌) అనంతరం ముందుగా మూడు వన్డేలు (నవంబర్‌ 27 నుంచి), తర్వాత మూడు టి20లు (డిసెంబర్‌ 4 నుంచి) ఆడుతుంది. పరిమిత ఓవర్ల సిరీస్‌లు ముగిశాక నాలుగు టెస్టుల సిరీస్‌ డిసెంబర్‌ 17 నుంచి ‘పింక్‌బాల్‌’ మ్యాచ్‌తో మొదలవుతుంది.
(చదవండి: ఐపీఎల్‌13 చాంపియన్‌.. ముంబై ఇండియన్స్‌)

>
మరిన్ని వార్తలు