Ball Tampering: మళ్లీ తెరపైకి ‘ట్యాంపరింగ్‌’

18 May, 2021 05:56 IST|Sakshi

బాన్‌క్రాఫ్ట్‌ వ్యాఖ్యలపై సీఏ విచారణ

మెల్‌బోర్న్‌: మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేసిన ‘బాల్‌ ట్యాంపరింగ్‌’ వివాదం మరోసారి ముందుకు వచ్చింది. కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ట్యాంపరింగ్‌కు పాల్పడిన ఘటనలో స్టీవ్‌ స్మిత్, డేవిడ్‌ వార్నర్, కామెరాన్‌ బాన్‌క్రాఫ్ట్‌లపై ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు (సీఏ) నిషేధం విధించింది. వారి శిక్ష ముగిసి మళ్లీ మైదానంలోకి దిగడంతో అంతా ముగిసిపోయినట్లు భావించగా... బాన్‌క్రాఫ్ట్‌ తాజా వ్యాఖ్యలతో ఆ వివాదాన్ని మళ్లీ రేపాడు.

‘బాల్‌ ట్యాంపరింగ్‌ గురించి బౌలర్లకు తెలుసా’ అంటూ అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ బాన్‌క్రాఫ్ట్‌...‘దాని గురించి ప్రత్యేకంగా చెప్పాలా’ అన్నాడు. దాంతో ఇందులో ఆసీస్‌ బౌలర్లకు కూడా భాగం ఉందని కొత్తగా చర్చ మొదలైంది. బాన్‌క్రాఫ్ట్‌ వ్యాఖ్యలపై సీఏ వెంటనే స్పందించింది.

2018లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎవరి వద్దనైనా ఇంకా అదనపు సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని... అవసరమైతే దీనిపై పునర్విచారణ చేస్తామని కూడా ప్రకటించింది. అంతే కాకుండా అవినీతి నిరోధానికి సంబంధించిన సీఏ ప్రత్యేక బృందం (ఇంటిగ్రిటీ యూనిట్‌) వెంటనే బాన్‌క్రాఫ్ట్‌తో మాట్లాడింది. నాడు ఇచ్చిన వాంగ్మూలంకంటే అదనంగా ఇంకా ఏమైనా చెప్పేది ఉందా అంటూ ప్రశ్నించింది.

ఆశ్చర్యమేమీ లేదు: క్లార్క్‌  
బాన్‌క్రాఫ్ట్‌ చేసిన వ్యాఖ్యలపై కొందరు ఒక్కసారిగా ఏదో అనూహ్యం జరిగిపోయినట్లు స్పందిస్తున్నారని,  అయితే ఇందులో అంతగా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదని ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ వ్యాఖ్యానించాడు. ‘బంతిని ట్యాంపరింగ్‌ చేసిన విషయం జట్టులో ముగ్గురు ఆటగాళ్లకే తెలుసంటే ఎలా నమ్ముతాం. బంతిని షైనింగ్‌ చేసిన తర్వాత ఎవరైనా బౌలర్‌ వద్దకే విసురుతారు. వారికి ఆ తేడా అర్థం కాదా. అలాంటి ఘటన ఒక్కసారిగా ఏమీ జరిగిపోదు. దానికి ముందు ఎంతో ప్రణాళిక ఉండే ఉంటుంది. అందులో ఎవరెవరు భాగస్వాములో తెలియాలి కదా. అయితే ఆసీస్‌ బోర్డు ఈ విషయంలో అసలు నిజాలను దాటి పెట్టేందుకే ప్రయత్నించింది’ అని క్లార్క్‌ ఘాటుగా విమర్శించాడు.

మరిన్ని వార్తలు