Big Bash League: డేవిడ్‌ వార్నర్‌కు భారీ ఆఫర్‌.. 'ఆ లీగ్‌'లో ఆడించేందుకు విశ్వ ప్రయత్నాలు

3 Aug, 2022 15:36 IST|Sakshi

David Warner: ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ను బిగ్ బాష్ లీగ్‌లో (బీబీఎల్‌) ఆడించే నిమిత్తం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) భారీ ఆఫర్‌తో ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. వార్నర్‌ బీబీఎల్‌లో ఆడేందుకు ఒప్పుకుంటే 5 లక్షల డాలర్ల వరకు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఏకు చెందిన కీలక ప్రతినిధి వెల్లడించారు. నివేదికల ప్రకారం..​బీబీఎల్ అఫీషియల్‌ బ్రాడ్ కాస్టర్ అయిన ఛానెల్ 7తో క్రికెట్ ఆస్ట్రేలియాకు న్యాయపరమైన చిక్కులు ఏర్పడ్డాయి. ఛానల్ 7తో ఒప్పందం సమయంలో బీబీఎల్‌ భారీ సంఖ్యలో వ్యూయర్ షిప్ దక్కించుకుంటుందని సీఏ హామీ ఇచ్చింది. 

అయితే ఊహించిన దాంట్లో సగం వ్యూయర్ షిప్ కూడా రాకపోవడంతో సీఏపై ఛానల్‌ 7 దావా వేసింది. బీబీఎల్‌లో క్వాలిటీ ఆటగాళ్లు లేరని, అందు వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని ఛానల్ 7 వాదిస్తుంది. దీంతో సీఏ దిద్దుబాటు చర్యలకు సిద్ధమైంది. డేవిడ్‌ వార్నర్‌ లాంటి స్టార్‌ ఆటగాళ్లను బీబీఎల్‌ బరిలోకి దించితే వ్యూయర్ షిప్ భారీగా పెరుగుతుందని భావిస్తుంది. ఇందుకోసం వార్నర్‌కు ఊహకందని భారీ మొత్తం ఆఫర్‌ చేయాలని నిర్ణయించుకుంది. అంతర్జాతీయ షెడ్యూల్‌, తదితర కారణాల వల్ల వార్నర్‌ ఇప్పటివరకు కేవలం మూడే మూడు బీబీఎల్‌ మ్యాచ్‌లు ఆడాడు. అతను చివరిసారిగా బీబీఎల్‌ 2014 సీజన్‌లో కనిపించాడు. 

ఇదిలా ఉంటే, వార్నర్‌ వచ్చే ఏడాది బీబీఎల్‌ సమయానికి యూఏఈలో జరిగే టీ20 లీగ్‌లో ఆడాలని భావిస్తున్నట్లు అతని మేనేజర్‌ తెలిపాడు. యూఏఈ లీగ్‌లో పాల్గొనే ఆరు జట్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ముగిసిన ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వార్నర్‌కు యూఏఈ లీగ్‌లోని ఫ్రాంచైజీలు కూడా భారీ మొత్తంలో ఆఫర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వార్నర్‌ బీబీఎల్‌ను కాదని యూఏఈ లీగ్‌లో ఆడితే బీబీఎల్‌ ప్రసారదారు ఛానల్‌ 7కు భారీ నష్టం వస్తుందని అంచనా. ఆసీస్‌ ప్రేక్షకులు వార్నర్‌ కోసం బీబీఎల్‌ను కాదని యూఏఈ లీగ్‌ను చూసే అవకాశాలే ఎక్కువ. 
చదవండి: అదరగొట్టిన సూర్యకుమార్‌.. నెం1 స్థానానికి చేరువలో!

మరిన్ని వార్తలు