‘బయో బబుల్‌’ కోసం రూ. 159 కోట్లు

5 Sep, 2020 08:23 IST|Sakshi

వెచ్చించనున్న క్రికెట్‌ ఆస్ట్రేలియా 

మెల్‌బోర్న్‌: కరోనాతో ఆర్థికంగా కుదేలైన క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌తో పాటు బిగ్‌బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌) కోసం అత్యధిక మొత్తం ఖర్చు చేసేందుకు సిద్ధమైంది. ఈ టోర్నీలు నిర్విఘ్నంగా జరిగేందుకు వీలుగా కోవిడ్‌–19 బయో బబుల్‌ బడ్జెట్‌ను భారీగా పెంచింది. 30 మిలియన్‌ ఆస్ట్రేలియా డాలర్లు (రూ.159 కోట్లు) బయో బబుల్‌ నిర్వహణ కోసమే వినియోగించనున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది చివర్లో 4 టెస్టుల సిరీస్‌ కోసం ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటించనుంది. దీనితో పాటు బిగ్‌ బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌)ను సురక్షిత పరిస్థితుల్లో నిర్వహించేందుకు సీఏ ఈ భారీ మొత్తాన్ని కేటాయించింది.

నిజానికి బ్రాడ్‌కాస్టర్‌ ‘చానెల్‌ సెవెన్‌’తో తమ ఒప్పందాన్ని నిలుపుకునేందుకే సీఏ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. చానెల్‌ సెవెన్, సీఏల మధ్య 300 మిలియన్‌ డాలర్ల (రూ. 1592 కోట్లు) ప్రసార హక్కుల ఒప్పందం ఉంది. అయితే  అత్యంత ప్రేక్షకాదరణ ఉండే బీబీఎల్‌ను తాజా పరిస్థితుల్లో సీఏ నిర్వహించదేమోనన్న అనుమానంతో ఈ ఒప్పందం నుంచి తప్పుకునేందుకు చానెల్‌ సెవెన్‌ సిద్ధమైంది. ఇదే జరిగితే సీఏకు భారీ నష్టం వాటిల్లుతుంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెండు టోర్నీలను సురక్షితంగా నిర్వహించేందుకు తొలుత 10 మిలియన్‌ డాలర్లు (రూ. 53 కోట్లు)గా ఉన్న బయో బబుల్‌ బడ్జెట్‌ను 30 మిలియన్‌ డాలర్లకు పెంచింది.   
(చదవండి: కార్తీక దీపం కోసం ‘ఐపీఎల్ టైమింగ్ మార్చండి')

మరిన్ని వార్తలు