థ్యాంక్యూ బీసీసీఐ.. మంచి గిఫ్ట్‌ ఇచ్చారు

20 Jan, 2021 16:41 IST|Sakshi

బ్రిస్బేన్‌: బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోపీని విజయవంతం చేసినందుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) బీసీసీఐకి థ్యాంక్స్‌ చెబుతూ ట్విటర్‌ వేదికగా లేఖను విడుదల చేసింది. కరోనా తర్వాత జరిగిన ఈ సిరీస్‌ను ఒక మరుపురానిదిగా మార్చినందుకు ప్రతీ ఒక్కరికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్‌లో విడుదల చేసిన ఈ లేఖపై సీఏ ఛైర్‌పర్సన్‌ ఎర్ల్ ఎడింగ్స్, సీఈవో నిక్‌ హోక్లీ సంతకాలు ఉన్నాయి. సీఏ రాసిన లేఖలో సారాంశం ఈ విధంగా ఉంది..

'కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ సిరీస్‌కు సహకరించిన బీసీసీఐకి ముందుగా థ్యాంక్స్‌. ఇక కఠినమైన కోవిడ్ నిబంధనలు.. బయో బబుల్ ఆంక్షల ప్రకారం ఆస్ట్రేలియా పర్యటనను విజయవంతంగా పూర్తి చేసినందుకు భారత ఆటగాళ్ళకు మా ప్రత్యేక ధన్యవాదాలు.. ప్రపంచవ్యాప్తంగా  మిలియన్‌కు పైగా ఈ సిరీస్‌ను వీక్షించారు. దీంట్లో బీసీసీఐ ప్రోత్పాహం మరువలేనిది..  వారి స్నేహం, నమ్మకం, నిబద్ధత ఇకపై కూడా అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం. ఇప్పటివరకు జరిగిన అన్ని బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోపీలలో దీనికి ఉన్నతమైన స్థానం ఉంటుంది. సిరీస్‌ సందర్భంగా ఎన్నో వివాదాలు.. సంతోషకర సంఘటనలు చాలానే చూశాం. సిరీస్‌లో ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. ఇరు జట్లు టీమ్‌ స్పిరిట్‌తో ముందుకు వెళ్లడం మంచి విషయంగా పరిగణించవచ్చు.కోహ్లి గైర్హాజరీలో టీమిండియాను ముందుకు నడిపించిన అజింక్యా రహానేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ పాట్‌ కమిన్స్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌(నాలుగో టెస్టు) రిషబ్‌ పంత్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, స్టీవ్‌ స్మిత్‌, శుబ్‌మన్‌ గిల్‌, కామెరాన్‌ గ్రీన్‌లకు మా అభినందనలు. ఇక చివరిగా మాకు మరిచిపోలేని సిరీస్‌ అందించినందుకు బీసీసీఐకి మరోసారి థ్యాంక్స్‌ అంటూ ముగించారు.చదవండి: 'నా కొడుకు సెంచరీ చేసుంటే బాగుండేది'

ఐపీఎల్‌ ముగిసిన తర్వాత నేరుగా ఆసీస్‌కు పయనమైన భారత జట్టు ముందుగా వన్డే సిరీస్‌తో మొదలుపెట్టింది. మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో ఆతిథ్య జట్టుకు కోల్పోయినా.. టీ20 సిరీస్‌ వచ్చేసరికి 2-1 తేడాతో టీమిండియా ఆసీస్‌పై ఆధిక్యతను కనబరిచింది. ఇక నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌ వేదికగా జరిగిన పింక్‌బాల్‌ టెస్టులో 36 పరుగులకే ఆలౌటైన టీమిండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇండియా ఆటతీరుపై విపరీతమైన ట్రోల్స్‌ వచ్చాయి. అయితే వీటన్నింటిని పట్టించుకోకుండా కోహ్లి గైర్హాజరీలో రహానే నాయకత్వంలో మెల్‌బోర్న్‌ టెస్టులో గెలిచి విమర్శలకు చెక్‌ పెట్టింది. సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఓటమి దిశగా పయనిస్తున్న టీమిండియాను అశ్విన్‌, హనుమ విహారిలు తమదైన ఓపికను ప్రదర్శించి జట్టును ఓటమి నుంచి గట్టెక్కించారు. ఇక నిర్ణయాత్మకంగా మారిన గబ్బా టెస్ట్‌లో టీమిండియా సరైన సమయంలో జూలు విదిల్చింది. ఆటలో భాగంగా 5వ రోజు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. గిల్‌, పుజారా, పంత్‌ రాణించడంతో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. అంతేగాక 32 ఏళ్లుగా గబ్బా మైదానంలో ఓటమి ఎరుగని ఆసీస్‌కు చెక్‌ పెట్టి రికార్డును తిరగరాసింది.చదవండి: ఈరోజుతో నా కల నెరవేరింది : పంత్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు