T20 WC 2022: జింబాబ్వే కొత్త చరిత్ర.. 15 ఏళ్లలో తొలిసారి

21 Oct, 2022 18:54 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌లో జింబాబ్వే కొత్త చరిత్ర సృష్టించింది.ఈ మెగాటోర్నీ ఆరంభమైన 15 ఏళ్లలో జింబాబ్వే తొలిసారి సూపర్‌-12 స్టేజ్‌లో అడుగుపెట్టింది.  సూపర్‌-12కు చేరడం మనకు పెద్ద విషయం కాకపోవచ్చు.. కానీ జింబాబ్వేకు మాత్రం ఇది పెద్ద ఘనత అని చెప్పొచ్చు. ఎందుకంటే జింబాబ్వే సరైన క్రికెట్‌ ఆడి దశాబ్దంన్నర గడిచిపోయింది. ఈ దశాబ్దంన్నరలో జింబాబ్వే జట్టు ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడింది. ఎంతలా అంటే క్రికెటర్లకు కనీసం షూస్‌, జీతాలు చెల్లించలేని పరిస్థితి. అలాంటి స్థితి నుంచి ఇవాళ అందరూ మెచ్చుకునే స్థాయికి ఎదిగింది.

ఈ మధ్య కాలంలో చూసుకుంటే జింబాబ్వే క్రికెట్‌లో పునర్‌వైభవం స్పష్టంగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్‌ను ఓడించిన జింబాబ్వే.. ఆ తర్వాత టీమిండియాకు చెమటలు పట్టించింది. ముఖ్యంగా సికందర్‌ రజా, క్రెయిగ్‌ ఇర్విన్‌, సీన్‌ విలియమ్స్‌, రియాన్‌ బర్ల్‌ సహా కొంతమంది ఆటగాళ్లు జింబాబ్వేను పటిష్టంగా తయారు చేశారు. 

టి20 ప్రపంచకప్‌ ఆరంభమైన నాటి నుంచి జింబాబ్వే క్వాలిఫయింగ్‌ పోరులోనే వెనుదిరుగుతూ వస్తుంది. 2007, 2010, 2012, 201,2016 వరల్డ్‌కప్‌లు ఆడిన జింబాబ్వే గ్రూఫ్‌ దశకే పరిమితమైంది. ఇక 2009, 2021 ప్రపంచకప్‌లకు జింబాబ్వే కనీసం అర్హత కూడా సాధించలేదు. ఇదే జింబాబ్వే ఒకప్పుడు క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌ల్లోనే వెనుదిరిగిన జింబాబ్వే ఏడాది తిరగకుండానే జరిగిన టి20 ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ పోరులో ఇవాళ ఒక్క ఓటమి కూడా లేకుండా గ్రూఫ్‌ టాపర్‌గా నిలిచింది. సగర్వంగా సూపర్‌-12లో అడుగుపెట్టింది. ఇండియా, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌ లాంటి జట్లున్న గ్రూఫ్‌-2లో ఉన్న జింబాబ్వేను తక్కువ అంచనా వేస్తే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది.

ఇక జింబాబ్వే తొలిసారి టి20 ప్రపంచకప్‌లో సూపర్‌-12కు అర్హత సాధించడంపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ''కప్‌ గెలుస్తుందో లేదో తెలియదు కానీ మనసులు మాత్రం గెలిచేసింది.'' అంటూ కామెంట్స్‌ చేశారు. ఐసీసీ కూడా జింబాబ్వే సూపర్‌-12కు అర్హత సాధించడంపై ఆనందం వ్యక్తం చేస్తూ వారి విన్నింగ్‌ మూమెంట్‌ను షేర్‌ చేసింది. ''తొలిసారి జింబాబ్వే సూపర్‌-12 స్టేజీకి అర్హత సాధించింది. ఇది వారికి చాలా గొప్ప విజయం''అంటూ క్యాప్షన్‌ జత చేసింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. శుక్రవారం స్కాట్లాండ్‌తో జరిగిన క్వాలిఫయింగ్‌ పోరులో జింబాబ్వే ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. జట్టులో సీనియర్‌ ఆటగాళ్లైన కెప్టెన్‌ క్రెయిగ్‌ ఇర్విన్‌, సికందర్‌ రజాలు తమ విలువేంటో చూపిస్తూ జట్టును గెలిపించారు. వారిద్దరి మెరుపులతో 133 పరుగుల లక్ష్యాన్ని జింబాబ్వే మరో 9 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.

A post shared by ICC (@icc)

చదవండి: భారత్‌-పాక్‌ మ్యాచ్‌.. వీళ్లు ఎదురుపడితే మజానే వేరు

మరిన్ని వార్తలు