AUS vs PAK: 'మా గుండె ఆగినంత పనైంది'.. అప్పుడు తిట్టినోళ్లే ఇవాళ పొగుడుతున్నారు

17 Mar, 2022 09:21 IST|Sakshi

టెస్టు క్రికెట్‌లో ఉండే మజా ఏంటో పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌ ద్వారా మరోసారి నిరూపితమైంది. పాకిస్తాన్‌ ఓటమి నుంచి తప్పించుకోవడం కష్టమేనన్న తరుణంలో ఆ జట్టు కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌(196 పరుగులు) చూపించిన తెగువ.. వికెట్‌కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ సెంచరీ, ఓపెనర్‌ అబ్దుల్లా షఫీక్‌ 96 పరుగులు.. వెరసి టెస్టు క్రికెట్‌లో ఉన్న మజాను చూపించారు. ఆఖరివరకు ఉత్కంఠగా సాగినప్పటికి పాకిస్తాన్‌ అద్బుత ఆటతీరుతో మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.

దీంతో క్రికెట్‌ అభిమానులు పాకిస్తాన్‌ ఆటను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ట్విటర్‌ వేదికగా పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌ చరిత్రలో నిలిచిపోతుందంటూ అభివర్ణించారు. ''మ్యాచ్‌ చివర్లో మా గుండె ఆగినంత పనైంది.. వాటే టెస్టు మ్యాచ్‌'' అంటూ ఒక అభిమాని పేర్కొన్నాడు. ''టెస్టు మ్యాచ్‌లో ఉండే మజా మరోసారి రుచి చూశాము.. పాకిస్తాన్‌ బ్యాటర్స్‌ తెగువ చూపించారు''.. ''నిజమైన టెస్టు క్రికెట్‌ అంటే ఇదే.. టెస్టు క్రికెట్‌లో ఉండే బ్యూటీ ఏ విధంగా ఉంటుందో మరోసారి చూశాం'' అంటూ కామెంట్స్‌ చేశారు.

అయితే సరిగ్గా వారం క్రితం ఇదే పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా మధ్య రావల్పిండి వేదికగా తొలి టెస్టు జరిగింది. ఆ మ్యాచ్‌ ఫేలవ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. నాసిరకం పిచ్‌ తయారు చేశారంటూ.. బౌలర్లకు సహకరించని పిచ్‌లు తయారు చేయడం ఏంటని.. పనికిమాలిన పిచ్‌లు తయారు చేయడం ఆపేయండి అంటూ పీసీబీని దుమ్మెత్తిపోశారు. అప్పుడు తిట్టిన నోళ్లే ఇప్పుడు పొగుతున్నారు. తొలి టెస్టు నుంచి పాఠాలు నేర్చుకున్న పీసీబీ రెండో టెస్టుకు మంచి పిచ్‌ను తయారు చేసి ప్రశంసలు పొందడం విశేషం.

ఇక 408 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం తర్వాత ఆస్ట్రేలియా సునాయాసంగా గెలుస్తుందనుకున్న మ్యాచ్‌ను వీరిద్దరు తమ అద్భుత బ్యాటింగ్‌తో రక్షించారు. 506 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి రోజు మ్యాచ్‌ ముగిసే సమయానికి పాక్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 171.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 443 పరుగులు సాధించింది.  బాబర్, రిజ్వాన్‌ల 115 పరుగుల ఐదో వికెట్‌  భాగస్వామ్యం తర్వాత ఈ జోడీని విడదీయడంలో ఆసీస్‌ సఫలమైంది. తర్వాతి బంతికే ఫహీమ్‌ (0)ను, కొద్ది సేపటికే సాజిద్‌ (9)ను అవుట్‌ చేసి ఆసీస్‌ పట్టు బిగించింది. అయితే మిగిలిన 8 ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టడంలో విఫలమైన కంగారూలు తీవ్రంగా నిరాశ చెందారు. ఇరు జట్ల మధ్య సోమవారం నుంచి లాహోర్‌లో మూడో టెస్టు జరుగుతుంది.    

చదవండి: Ranveer Singh: ఫుట్‌బాల్‌ మైదానంలో బాలీవుడ్‌ స్టార్‌ వింత ప్రవర్తన

Babar Azam: పాక్‌ వీరోచిత పోరాటం.. డబుల్‌ మిస్‌ అయినా కోహ్లిని అధిగమించిన బాబర్‌ ఆజమ్‌

>
మరిన్ని వార్తలు