'ప్రయోగాలకు స్వస్తి పలకండి'.. బీసీసీఐపై ఫ్యాన్స్‌ ఆగ్రహం 

28 Jan, 2023 15:24 IST|Sakshi

వచ్చే టి20 వరల్డ్‌కప్‌ వరకు యువ జట్టును తయారు చేయాలనే లక్ష్యంతో బీసీసీఐ రోహిత్‌, కోహ్లి లాంటి సీనియర్లను రెస్ట్‌ పేరుతో పక్కనబెడుతూ వస్తుంది. గతేడాది టి20 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత దీనికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యాకు కెప్టెన్‌ బాధ్యతలు అప్పజెప్పింది. లంకతో సిరీస్‌ సందర్భంగా పెద్ద ఇబ్బందులు ఎదురుకాలేదు.

అయితే న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భాగంగా తొలి టి20లో టీమిండియా ఓటమితో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. రాంచీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండియా పూర్తిగా విఫలమైంది. పేసర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అర్ష్‌దీప్ సింగ్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, హార్ధిక్ పాండ్యాలు విఫలమయ్యారు.

బ్యాటర్లలో ఇషాన్ కిషన్, గిల్, రాహుల్ త్రిపాఠి, హార్ధిక్ పాండ్యా, దీపక్ హుడా అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు వెళ్లారు. వాషింగ్టన్ సుందర్, సూర్యకుమార్‌లు మాత్రమే పర్వాలేదనిపించారు. ఈ ఓటమికి అనుభవలేమీ ప్రధాన కారణమని.. ప్రయోగాలకు స్వస్తి పలికి రోహిత్‌, కోహ్లిలను టి20లకు ఎంపికచేయాలని  అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

''రోహిత్, కోహ్లీలను పక్కనపెట్టి.. టీమిండియా మూల్యం చెల్లించుకుంటుంది. బీసీసీఐ ప్రయోగాలు పక్కనబెట్టి..  ఇద్దరిని టి20లకు ఆడించాలి.'' అని కొందరు పేర్కొన్నారు. ''కివీస్‌తో తొలి టి20లో మన ఓపెనర్ల ఆటను చూశాక రోహిత్, కోహ్లీలు టీమ్ లోకి రావడమే మంచిదని.. ఈ ఇద్దరిని 2024 టి20 ప్రపంచకప్ వరకు కొనసాగిస్తే మంచిదని'' మరికొందరు డిమాండ్‌ చేశారు. ''రోహిత్, కోహ్లీ లేని టీమిండియాను ఊహించుకోలేకపోతున్నాం. ఈ మ్యాచ్ ద్వారా బీసీసీఐకి అర్థమై ఉండాలి. ఇగోలను పక్కనబెట్టి ఆ ఇద్దరినీ ఆడించండి.'' అంటూ కామెంట్స్ చేశారు.

చదవండి:  WC 2023: అలా అయితే వరల్డ్‌కప్‌-2024 వరకు కెప్టెన్‌గా రోహిత్‌: డీకే

'బిర్యానీ నచ్చలేదని రెస్టారెంట్‌కు వెళ్లడం మానేస్తామా'

మరిన్ని వార్తలు