Rahul Tripathi: 'కోహ్లి స్థానాన్ని అప్పగించాం.. ఇలాగేనా ఔటయ్యేది'

28 Jan, 2023 11:12 IST|Sakshi

టీమిండియా వన్డే సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేయగానే అభిమానులు పొగడ్తల వర్షం కురిపించారు. అలా వన్డే సిరీస్‌ ముగిసి ఇలా టి20 సిరీస్‌ ప్రారంభం కాగానే భారత్‌ ఓటమిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రికెట్‌లో ఆటగాళ్లకు, అభిమానులకు ఇది సాధారణమే. ఒక్క మ్యాచ్‌ ఓడిపోగానే టీమిండియాపై ఎక్కడలేని కోపాన్ని చూపిస్తారు అభిమానులు. ఆరోజు మ్యాచ్‌లో ఎవరి ప్రదర్శనైతే బాగుండదో వారికి సోషల్‌ మీడియాలో మూడినట్లే. అర్ష్‌దీప్‌ సింగ్‌ అత్యంత చెత్త బౌలింగ్‌తో ఇప్పటికే విమర్శలు మూటగట్టుకోగా.. తాజాగా రాహుల్‌ త్రిపాఠిని కూడా నెటిజన్లు ఆడేసుకున్నారు.

మ్యాచ్‌లో రాహుల్‌ త్రిపాఠి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇషాన్‌ కిషన్‌ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన త్రిపాఠి ఆరు బంతులెదుర్కొని ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. పైగా జాకబ్‌ డఫీ బౌలింగ్‌లో నిర్లక్ష్యంగా షాట్‌ ఆడి కీపర్‌ కాన్వేకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఇన్నాళ్లు టి20ల్లో మూడో స్థానంలో విరాట్‌ కోహ్లి వచ్చేవాడు. అతని బ్యాటింగ్‌తో టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు.

తాజాగా కోహ్లి టి20లకు క్రమంగా దూరమవుతున్న వేళ సూర్యకుమార్‌ ఆ స్థానాన్ని తీసుకున్నాడు. కానీ కివీస్‌తో తొలి టి20లో సూర్య నాలుగో స్థానంలో వస్తేనే కరెక్టని..  కోహ్లి స్థానంలో రాహుల్‌ త్రిపాఠిని పంపించారు. కానీ కష్టాల్లో ఉన్న టీమిండియాను గట్టెక్కించాల్సిన బాధ్యతను పక్కనబెట్టి నిర్లక్ష్యమైన షాట్‌ ఆడి డకౌట్‌ అవ్వడం అభిమానులను బాగా హర్ట్‌ చేసింది. అయితే ఇటీవలే శ్రీలంకతో సిరీస్‌లో త్రిపాఠి మూడో స్థానంలోనే వచ్చి బ్యాటింగ్‌లో మెరిశాడు. 

దీంతో త్రిపాఠిని టీమిండియా ఫ్యాన్స్‌ తమదైన శైలిలో ట్రోల్‌ చేశారు. ''కోహ్లి స్థానాన్ని అప్పగిస్తే ఇలాగేనా ఔటయ్యేది''.. ''త్రిపాఠిలో ఒక బ్యాటర్‌ కాకుండా జోకర్‌ కనబడుతున్నాడు''.. ''అతను తన టాలెంట్‌ను ఐపీఎల్‌ కోసం దాచుకుంటున్నట్లున్నాడు''.. అంటూ కామెంట్స్‌ చేశారు. అయితే మరికొందరు మాత్రం త్రిపాఠికి మద్దుతు తెలిపారు. ''లంకతో సిరీస్‌లో రాణించాడు కాబట్టే జట్టులో ఉన్నాడు.. ఇది అతనికి మూడో మ్యాచ్‌ మాత్రమే. వచ్చే మ్యాచ్‌లో రాణించే అవకాశం ఉంది.. ఒక్క మ్యాచ్‌కే తప్పు బట్టడం సరికాదు'' అంటూ పేర్కొన్నారు.

చదవండి: రెండేళ్ల తర్వాత పునరాగమనం.. వన్డే కెరీర్‌లో చెత్త రికార్డు

ఒకే ఓవర్లో 27 పరుగులు; అర్ష్‌దీప్‌ ఖాతాలో అత్యంత చెత్త రికార్డు

మరిన్ని వార్తలు