T20 World Cup 2022: భారత్‌, పాక్‌ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. వారం ముందే ఎలా చెప్తారు!

15 Oct, 2022 08:05 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌లో అక్టోబర్‌ 23న(ఆదివారం) టీమిండియా, పాకిస్తాన్‌లు అమితుమీ తేల్చుకోనున్నాయి. చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్‌ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. అయితే మ్యాచ్‌కు ఇంకా వారం సమయం ఉన్నప్పటికి ఆరోజు వర్షం పడే అవకాశం ఉందని.. అసలు మ్యాచ్‌ జరిగే అవకాశం లేదంటూ ఒక వ్యక్తి తన ట్విటర్‌లో పంచుకున్నాడు. వాతావారణ విభాగానికి చెందిన మ్యాప్‌ను షేర్‌ చేసిన ఆ వక్తి.. అక్టోబర్‌ 23న మెల్‌బోర్న్‌లో రోజంతా వర్షం పడే అవకాశం ఉందని తెలిపాడు.

మాములుగానే యమ క్రేజ్‌ ఉండే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందని ఒక ఆకతాయి పెట్టిన పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పోస్టు పెట్టిన సదరు వ్యక్తిని ట్విటర్‌లో ఏకిపారేశారు టీమిండియా అభిమానులు. ''వారం ముందే చెప్పడానికి నువ్వేమైనా దేవుడివా లేక వాతావరణ విభాగం నిపుణుడివా''.. ''సిగ్గుండాలి ఇలాంటి ట్వీట్స్‌ పెట్టడానికి''.. ''భారత్‌, పాక్‌ మ్యాచ్‌ అంటే ఎమోషన్స్‌తో కూడుకున్నది.. మాతో ఆడుకోకు''.. ''మ్యాచ్‌ పాక్‌ లేదంటే టీమిండియా గెలవచ్చు.. కానీ మ్యాచ్‌ జరగాలి.. ఇలాంటి పిచ్చి పోస్టులు పెట్టకు'' అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇక ప్రపంచకప్‌ ఆరంభానికి 15 రోజుల ముందే ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన టీమిండియా వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాతో రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడింది. తొలి మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో మాత్రం ఓడిపోయింది. మరోవైపు న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌లతో జరిగిన ట్రై సిరీస్‌ను గెలిచిన పాక్‌ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంది. గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో దారుణ పరాజయం చవిచూసింది. ఐసీసీ మేజర్‌ టోర్నీలో(వన్డే, టి20 ప్రపంచకప్‌లు) తొలిసారి భారత్‌పై పాకిస్తాన్‌ నెగ్గడం విశేషం. మరి ఈసారి జరగనున్న మ్యాచ్‌లో ఎవరిది పైచేయి అవుతుందనేది చూడాలంటే అక్టోబర్‌ 23 వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు