2022 Commonwealth Games: 24 ఏళ్ల తర్వాత క్రికెట్‌ రీ ఎంట్రీ.. అయితే..?

1 Feb, 2022 20:57 IST|Sakshi

Cricket Returns To Commonwealth Games: 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కామన్‌వెల్త్‌ క్రీడల్లోకి క్రికెట్‌ రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది జూన్‌లో బర్మింగ్హమ్‌(ఇంగ్లండ్‌) వేదికగా జరిగే 22వ ఎడిషన్‌లో క్రికెట్‌కు ప్రాతినిధ్యం లభించింది. అయితే, ఈ సారికి కేవలం మహిళల క్రికట్‌కు మాత్రమే అనుమతి ఇచ్చింది కామన్‌వెల్త్‌ క్రీడల సమాఖ్య(సీజీఎఫ్‌). టీ20 ఫార్మాట్లో లీగ్‌ కమ్‌ నాకౌట్‌ పద్ధతిలో సాగే ఈ గేమ్స్‌లో మొత్తం 8 జట్లు(భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, పాకి​స్థాన్‌, బార్బడోస్‌, సౌతాఫ్రికా, శ్రీలంక) పాల్గొనేందుకు ఐసీసీ అనుమతినిచ్చింది. 

జులై 29న భారత్‌-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌తో ప్రారంభమయ్యే ఈ క్రీడలు.. ఆగస్ట్‌ 7న జరిగే గోల్డ్‌ మెడల్‌ మ్యాచ్‌తో ముగుస్తాయి. ఈ మేరకు ఐసీసీ, సీజీఎఫ్‌ మంగళవారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. కాగా, 1998(మలేషియా)లో చివరిసారిగా కామన్‌వెల్త్‌ క్రీడల్లో క్రికెట్‌కు(50 ఓవర్ల ఫార్మాట్‌) ప్రాతినిధ్యం లభించిన విషయం తెలిసిందే. నాడు షాన్‌ పొలాక్‌ నేతృత్వంలోని దక్షిణాఫ్రికా పురుషుల జట్టు స్టీవ్‌ వా సారధ్యంలోని ఆస్ట్రేలియాపై విజయం సాధించి స్వర్ణ పతకం సాధించింది. ఇదిలా ఉంటే, 72 దేశాలకు చెందిన 4500 అథ్లెట్లు జులై 28 నుంచి ఆగస్ట్‌ 8 వరకు జరిగే కామన్‌వెల్త్‌ క్రీడల్లో పాల్గొంటారు.  
చదవండి: IPL 2022 Auction: వేలంలో పాల్గొనబోయే యువ భారత చిచ్చరపిడుగులు వీళ్లే..

మరిన్ని వార్తలు