Andrew Symonds: ఆండ్రూ సైమండ్స్‌ మృతి.. దిగ్గజ క్రికెటర్ల సంతాపం

15 May, 2022 09:07 IST|Sakshi

క్వీన్స్‌ల్యాండ్‌: ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం ఆండ్రూ సైమండ్స్‌ మృతి చెందాడు. గత రాత్రి టౌన్స్‌విల్లే సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో 46 ఏళ్ల సైమండ్స్‌ మరణించాడు. 1998లో ఆస్ట్రేలియా తరపున వన్డే ఇంటర్నేషనల్‌లో అరంగేట్రం చేసిన సైమండ్స్‌.. దిగ్గజ ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడు.

198 వన్డేలు ఆడిన సైమండ్స్‌.. 2003, 2007 వరల్డ్‌ కప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే సైమండ్స్‌ మృతి పట్ల ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు, ఐసీసీ, ఆసీస్‌ మాజీ ఆటగాళ్లు ఆడమ్‌ గ్రిల్‌కిస్ట్‌, గిల్లెస్పీ, న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ ఫ్లెమింగ్‌, పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌, భారత మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ట్విటర్ ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు. 

'కారు ప్రమాదంలో ఆండ్రూ సైమండ్స్‌ మరణించారని తెలిసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. మేము మైదానంలోనూ బయట మంచి సంబంధాన్ని పంచుకున్నాము. వారి కుటుంబానికి దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను' అంటూ పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ ట్వీట్‌ చేశాడు. 


ఆస్ట్రేలియా క్రికెట్‌ మరో అత్యుత్తమైన ఆటగాడని కోల్పోయింది. రెండు ప్రపంచకప్‌ విజయాల్లో కీలక పాత్రపోషించిన క్వీన్స్‌ ల్యాండర్‌ సైమండ్స్‌ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగియడంతో మేము తీవ్ర దిగ్భ్రాంతి చెందాము. ఈ విషాద సమయంలో సైమండ్స్‌ కుటుంబానికి క్రికెట్‌ ఆస్ట్రేలియా, స్నేహితులు, సన్నిహితులు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

దిగ్గజ క్రికెటర్ గిల్‌క్రిస్ట్, ఆస్ట్రేలియా మాజీ పేసర్ జాసన్ గిల్లెస్పీ కూడా మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్‌ అకాల మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మేమంతా నిన్ను మిస్‌ అవుతున్నాం అంటూ ట్వీట్‌ చేశారు.  

చదవండి: (క్రికెట్‌ ఫ్యాన్స్‌కు షాక్‌.. ఆసిస్‌ దిగ్గజ క్రికెటర్‌ ఆండ్రూ సైమండ్స్‌ మృతి)

ఆండ్రూ సైమండ్స్‌ మృతి పట్ల భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి సంతాపం వ్యక్తం చేశాడు. ఈ వార్త తనని దిగ్భ్రాంతికి గురిచేసిందన్న కోహ్లి.. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నానని, ఈ క్లిష్ట సమయాన్ని అధిగమించే శక్తిని సైమండ్స్‌ కుటుంబ సభ్యులకు దేవుడు అందివ్వాలని కోరుకుంటున్నట్లు ట్వీటర్‌ ద్వారా తన సంతాపాన్ని తెలిపాడు.

మరిన్ని వార్తలు